Rain Forecast: ఈ నెల 16 నుంచి వర్షాలు.. 20 వరకు కొనసాగే అవకాశం  | Rain Forecast For Andhra Pradesh From March 16th 2023 | Sakshi
Sakshi News home page

Rain Forecast: ఈ నెల 16 నుంచి వర్షాలు.. 20 వరకు కొనసాగే అవకాశం 

Published Sun, Mar 12 2023 4:45 AM | Last Updated on Sun, Mar 12 2023 7:31 AM

Rain Forecast For Andhra Pradesh From March 16th 2023 - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఈసారి వేసవిలోనూ వర్షాలు పలకరించనున్నాయి. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం పడమర గాలులతో ఏర్పడిన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ. నుంచి 7.6 కి.మీ. ఎత్తులో ఉంటూ బిహార్‌ నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా కొనసాగుతోంది. ఈ నెల 16న ఈస్టిండియాపై మరో ద్రోణి, దక్షిణాది రాష్ట్రాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతున్నాయి. వీటి ప్రభావంతో గాలుల దిశ మారనుంది.

ప్రస్తుతం రాష్ట్రంపైకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ గాలులు దిశ మార్చుకుని దక్షిణ దిశ నుంచి వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం 4 రోజులపాటు ఉండనుంది. ఫలితంగా 16 నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం నాటి బులెటిన్‌లో తెలిపింది.

అదే సమయంలో క్యుములోనింబస్‌ మేఘాలు కూడా ఏర్పడే అవకాశం ఉందని, దీంతో అవి ఏర్పడిన ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న ఐదారు రోజులు కూడా ఇవే ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ఫలితంగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉష్ణతాపానికి కాస్త విరామం లభించనుంది.  

పంటలు జాగ్రత్త సుమా! 
రాష్ట్రంలో కురవనున్న వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, కోత దశలో పంటలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా రైతులకు సూచించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement