అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం | Amarnath yatra resumes from Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభం

Published Mon, Jul 10 2023 4:44 AM | Last Updated on Mon, Jul 10 2023 7:13 AM

Amarnath yatra resumes from Jammu and Kashmir - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశీ్మర్‌లో అమర్‌నాథ్‌ యాత్ర మూడు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం వల్ల పంజ్‌తరణి, శేష్‌నాగ్‌ బేస్‌క్యాంపుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు ఆదివారం మంచు శివలింగ దర్శనానికి తరలివెళ్లారు. భారీ వర్షాలకుతోడు కొండ చరియలు విరిగిపడుతుండడంతో అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు మూడు రోజుల క్రితం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

పవిత్ర గుహ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను అనుమతించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను అనుమతించడం లేదు. జమ్మూకశ్మీర్‌లో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమర్‌నాథ్‌లో మంచు సైతం కురిసింది. సోమవారం నుంచి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

ఏపీ వాసి దుర్మరణం
రాజాం సిటీ(ఆంధ్రప్రదేశ్‌): ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవి రావు మృతి చెందారు. బొద్దాం గ్రామానికి చెందిన రవి రావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఐదు నెలల క్రితమే వివాహమైంది. భార్య కల్యాణితో కలిసి వారం క్రితం కేదార్‌నాథ్‌ యాత్రకు బయలుదేరారు. శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో రవి రావు ప్రాణాలు కోల్పోయారు. కల్యాణితో పాటు మరికొందరిని సహాయక సిబ్బంది రక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement