సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లో రానున్న రెండు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే నిన్నటి కుండపోత నుంచి నగరవాసులు ఇంకా తేరుకోలేదు. ఈలోపు మళ్లీ వర్షం కురుస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కాగా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్‌లో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి. బాచుపల్లి ప్రగతినగర్ కాలనీ వద్ద ఉన్న నాలాలో పడి బాలుడు మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. రెజిమెంటల్ బజార్‌లో పురాతన భవనం కూలిపోయింది. అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
చదవండి: ఇంకెన్నాళ్లు నాలా మరణాలు?
రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్ హోళ్లు ఓపెన్ చేసినా.. పై నుంచి భారీ ఎత్తున వస్తున్న నీళ్లతో.. ప్రధాన రహదారిపైనే మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరాంఘర్ జాతీయ రహదారిపై, శ్రీనగర్ సమీపంలో ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు అతికష్టం మీద ఆ బస్సులను వరద నుంచి బయటకు తీశారు.
మొత్తమ్మీద మంగళవారం రికార్డు స్థాయిలో సుమారు 20 సెంటిమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. తెల్లవారు జామున నుంచి ఉదయం 8 గంటల వరకు 14.7 సెం.మీ.. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెం.మీ మేర వర్షం కురిసినట్లు వాతావరణశాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
Moderate - Heavy downpours expected today in North, Central, East Telangana today and light - moderate rains ahead in South Telangana
— Telangana Weatherman (@balaji25_t) September 6, 2023
Moderate rains expected in Hyderabad city today but yesterday type huge rains not expected
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు
సికింద్రాబాద్ జోన్‌లో పలు చోట్ల నీరు నిలిచిన ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం ఉదయం పరిశీలించారు. నీరు వెంటనే తొలగించాలని, మ్యాన్ హోల్స్ వద్ద మట్టి, చెత్తచెదారాన్ని వెంటవెంటనే తీసేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. మయూర మార్గ్ అల్లం తోట బావి, ద్వారక దాస్ నగర్ కాలనీ, ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్, యస్ పి రోడ్డు పెట్రోల్ పంప్, అల్లాగడ్డ బావి రైల్వే అండర్ బ్రిడ్జి, లాలా పేట్ సత్య నగర్ లలో నాలాలను సైతం ఆయన పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment