నూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశాక సోషల్ మీడియాలో కశ్మీరీ మహిళలపై వస్తున్న పోస్టులపై మహిళా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై భారత యువకులు జమ్మూకశ్మీర్ యువతులను వివాహం చేసుకోవచ్చంటూ వస్తున్న కామెంట్లపై తీవ్రంగా స్పందించారు. కామెంట్లు చేసేవారిని ఉద్దేశిస్తూ ‘జమ్మూ కశ్మీర్ మహిళలను వివాహం చేసుకోవడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు, వారేం యుద్ధంలో దొరికే బొమ్మల్లాగా భావిస్తున్నారా’ అని మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్లు ఎంత నీచంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండని కోరుతున్నారు.
భారతదేశంలో మీటూ ఉద్యమంపై పుస్తకం రాస్తున్న సామాజిక కార్యకర్త రితుపర్ణ ఛటర్జీ ఈ పోస్టులపై స్పందిస్తూ‘ ఇది తీవ్రమైన లైంగిక కోరికని, మహిళల శరీరాలు శతాబ్దాలుగా పురుషులకు యుద్ధభూమిగా మారాయని, కశ్మీరీ మహిళలపై తాజా వ్యాఖ్యలు దీనికి ఒక నిదర్శనం మాత్రమే’ అని వాపోయారు. టిక్‌టాక్, ట్విట్టర్ లాంటి వాటి ద్వారా మహిళలపై అసభ్యంగా కామెంట్లు ఏంటని లింగ సమానత్వం కోసం పోరాడుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది మిహిరా సూద్ ప్రశ్నించారు. ఆమె పలు పోస్టులను ప్రస్తావించారు.
‘అభినందనలు. భారతదేశంలో ఇప్పుడు పెళ్లికాని అబ్బాయిలు ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత కశ్మీర్‌లోని అందమైన అమ్మాయిలను వివాహం చేసుకోవచ్చు.
మరొక పోస్టులో ‘ప్రస్తుతం ప్రతి భారతీయ అబ్బాయి కల. 1. కశ్మీర్‌లో ప్లాట్ 2. కశ్మీర్‌లో ఉద్యోగం 3. కశ్మీరీ అమ్మాయితో వివాహం.’
ఇలాంటి కామెంట్లను మహిళలపై తీవ్రచర్యగా భావించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ‘కశ్మీరీ మహిళలు యుద్ధంలో దొరికే బొమ్మలు కాదు. వారు మనుషులేనని గుర్తించాలని, వారికి సమ్మతి లేదా అసమ్మతి తెలిపే హక్కు ఉందని’ తెలిపారు.
కాగా, జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 370ని సోమవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆ రాష్ట్రంలో ఆస్తులను కొనుగోలు చేయకుండా అడ్డుగా ఉన్న ఆర్టికల్ 35ఏ కూడా రద్దయింది. దీంతో ఇప్పటినుంచి ఇతర రాష్ట్రాలవారికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందడమేకాక, అక్కడి ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. ఇంతకు ముందు కశ్మీరీ మహిళ ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ రాష్ట్రంలో ఆస్తిహక్కును కోల్పోయేవారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కామెంట్లకు వేదికైంది.
Comments
Please login to add a commentAdd a comment