కశ్మీర్ పండిట్ల నిరసన ప్రదర్శన (ఫైల్)
జమ్మూ: ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ.. కుటుంబానికో వ్యథ. తమ సంస్కృతిని మరచిపోయారు. సంప్రదాయాలు వదిలేశారు. ప్రాణ సమానంగా ప్రేమించిన సాహిత్యం, కవిత్వం, సంగీతం గుర్తు కూడా లేదు. ఇస్లాం ఉగ్రవాదుల దాడుల భయంతో మూడు దశాబ్దాల కిందట కట్టుబట్టలతో తమ సొంత గడ్డను వీడిన కశ్మీర్ పండిట్లలో ఇప్పుడు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో తిరిగి మాతృభూమికి చేరుకోవాలని పండిట్లు అందరూ తహతహలాడుతున్నారు. 30 ఏళ్ల క్రితం 1990, జనవరి 19 అర్ధరాత్రి ఇస్లాం జీహాదీల ఊచకోతతో చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైన పండిట్లు అందరూ సోషల్ మీడియా వేదికగా ఒకటయ్యారు.
తాము లోయను విడిచి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంలో హమ్ వాపస్ ఆయేంగే హ్యాష్ ట్యాగ్‌తో వారు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్‌గా మారాయి. కొందరు అప్పట్లో శ్రీనగర్ నుంచి జమ్మూకి కొన్న బస్సు టిక్కెట్లు షేర్ చేస్తూ ఉంటే, మరికొందరు పీడకలలా ఇప్పటికీ వెంటాడుతున్న ఆనాటి అనుభవాలను కథలు కథలుగా చెబుతున్నారు. ఇప్పటికైనా తమకు నష్టపరిహారం చెల్లించి లోయలో భద్రత కల్పించాలని ఆనాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ కవి సర్వానంద్ కౌల్ ప్రేమి కుమారుడు రాజేందర్ కౌల్ ప్రేమి డిమాండ్ చేస్తున్నారు. ఇక జమ్ములో ఆదివారం పండిట్లు కశ్మీర్ లోయని విడిచి పెట్టి 30 ఏళ్లయిన సందర్భంలో ఆల్ స్టేట్ కశ్మీరీ పండిట్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సొంతింటికి తాము తిరిగి వెళ్లేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భూతల స్వర్గం నరకంగా మారిన వేళ..
మూడు దశాబ్దాల క్రితం కశ్మీర్ లోయలో మైనర్లుగా ఉన్న పండిట్లపై ఇస్లాం వేర్పాటువాద తీవ్రవాదులు దాడులకు దిగారు. జేకేఎల్‌ఎఫ్, ఇతర ఇస్లాం జీహాదీలు హిందువులు ఇస్లాంలోకి మారాలని, మారకపోతే లోయని విడిచిపెట్టి పోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు. 1989–90 మధ్య కాలంలో వందలాది మంది కశ్మీర్ పండిట్లను చంపేశారు. మహిళలపై మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు. హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు. కశ్మీర్‌ని అల్లాయే పరిపాలించాలి అంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేశారు. దీంతో ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని 5 లక్షల మంది వరకు కశ్మీర్ పండిట్లు లోయని విడిచిపెట్టి జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు పారిపోయారు.
మోదీ సర్కార్ ప్రణాళికలేంటి ?
కేంద్రంలో మోదీ సర్కార్ కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు రచిస్తోంది. కశ్మీర్ ఘర్షణల్లో చెల్లాచెదురైన 5 లక్షల మంది పండిట్లను తిరిగి కశ్మీర్ లోయకి తెప్పించడానికి 2015లో రోడ్ మ్యాప్ రచించింది. వీరి కోసం సురక్షితమైన టౌన్‌షిప్‌లు నిర్మించాలని, అందులోనే షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, పాఠశాలలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేయడానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇప్పుడు కశ్మీర్‌ను తన పాలన కిందకి తెచ్చుకోవడంతో పాటు పండిట్లు కూడా తిరిగి సొంత గూటికి చేరుతామన్న డిమాండ్లతో అది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment