
చిలికా సరస్సు
నియోజకవర్గంపై బీజేడీ కన్ను
తెరపైకి ప్రసన్న కుమార్‌ను తీసుకొచ్చే యోచన
సీటుపై బీజేపీ సైతం కసరత్తు
భువనేశ్వర్: రాష్ట్ర రాజకీయాల్లో చిలికా నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. చిలికా శాసనసభ నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం కావడంతో విభిన్న ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాల్లో దీనిపై ఖుర్దా జిల్లా ప్రభావం అధికంగా ఉంటుంది. భౌగోళిక సరిహద్దుల ప్రకారం పూరీ జిల్లాలో ఉంది. అలాగే భువనేశ్వర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సరిహద్దు కావడంతో పూరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో విలీనమై కొనసాగుతోంది. ఈ శాసనసభ ప్రాతినిథ్యంలో ఖుర్దా జిల్లా పెత్తనం చలామణి అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ప్రాబల్యం భువనేశ్వర్ పార్లమెంటరీ నియోజకవర్గం పోలింగ్‌లో ఉపకరిస్తుంది.
సందిగ్ధంలో బీజేడీ
గత ఎన్నికల్లో బిజూ జనతా దళ్ అభ్యర్థి ప్రశాంత జగదేవ్ ఇక్కడ విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన బీజేడీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో రానున్న ఎన్నికల్లో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే ఆలోచనలో బీజేడీ తలమునకలైంది. దీనిలో భాగంగా ఈసారి చిలికా నియోజకవర్గం నుంచి డాక్టర్ ప్రసన్న కుమార్ పటసహాణిని దించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ యోచనతో ప్రసన్న కుమార్ పాత్ర మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తెరపైకి వచ్చింది. ఆయన బిజూ జనతా దళ్‌లో విద్యాధికుడు, ఆసు కవి, ఓటరుని ఇట్టే ఆకట్టుకోగలిగే చమత్కారిగా పేరొందారు. అధిష్టానం నిర్ణయంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల పోరు నుంచి దూరమై విధేయుడుగా మిగిలిపోయారు. అయితే ప్రస్తుత అనిశ్చితి వాతావరణాన్ని అవలీలగా ఎదుర్కోగలిగే దక్షత ఆయనకే ఉందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ పటసహాణి మరోసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు పునః రంగ ప్రవేశం చేయడం తథ్యం. చిలికా నియోజకవర్గం నుంచి ఆయన రాష్ట్ర శాసనసభకు ఇదివరకే వరుసగా 4 సార్లు ఎన్నికై చరిత్రని సృష్టించారు.
బీజేపీతో సరితూగునా..?
చిలికా నియోజకవర్గంపై భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా గట్టిపట్టు ఉంది. దీర్ఘకాలంగా తెరమరుగైన పటసహాణి చతురత బీజేపీతో తలపడేందుకు ఎంతవరకు దోహదపడుతుందోననే విశ్లేషణతో ఉభయ పార్టీల అధిష్టానాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో హరిచందన్ కుటుంబీకులకు గట్టిపట్టు ఉంది. సమగ్రంగా చిలికా శాసనసభ నియోజకవర్గంలో బీజేడీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. డాక్టర్ బిభూతి భూషణ్ హరిచందన్ చాలాసార్లు ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పృథ్వీరాజ్ హరిచందన్ ఇక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం.
తొలి సమావేశంలో పటసహాణి
అభ్యర్థుల ఖరారు, సీట్ల కేటాయింపు వ్యవహారం పురస్కరించుకుని నవీన్ నివాస్‌లో జరిగిన తొలి సమావేశంలో పూరీ పార్లమెంటరీ స్థితిగతులను సమీక్షించారు. ఈ సమావేశానికి బీజేడీ అగ్రస్థాయి నాయకులతో పూరీ జిల్లా సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులతో డాక్టర్ ప్రసన్న కుమార్ పటసహాణి కూడా హాజరు కావడం చర్చనీయాంశమైంది. సమావేశం అనంతరం ఆయన స్పందిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి విధేయునిగా కొనసాగుతానని ప్రకటించారు.
పొత్తు కుదిరితే..
బీజేడీ, బీజేపీ ఎన్నికల పొత్తు కుదిరితే చిలికా నియోజకవర్గాన్ని తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ మంతనాలు జరుపుతోంది. పోటీని ఎదుర్కోవడంలో సమర్ధవంతమైన అభ్యర్థి ఖరారు కాని పరిస్థితుల్లో, బీజేపీ యోచన ప్రకారం ఈ సీటుని అంకితం చేసి పోటీ నుంచి హుందాగా తప్పుకోవాలని బీజేడీ తన చాతుర్యానికి పదును పెడుతోంది. ప్రశాంత జగదేవ్ క్షేత్రస్థాయి రాజకీయం బీజేడీకి ప్రతికూల పరిస్థితుల్ని ప్రేరేపించే సందేహంతో పోటీ విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా బీజేడీ అడుగులు వేస్తోంది. బీజేపీ మాత్రం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఇటీవల పార్టీలో చేరిన ప్రశాంత జగదేవ్‌ని మాత్రం ఈ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష పోటీకి బరిలోకి దింపకుండా, ఆయన బలాన్ని ప్రయోగించి నికరమైన విజయం కోసం పావులు కదుపుతోంది.


Comments
Please login to add a commentAdd a comment