సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపం వచ్చింది. అన్నీ ఇలాగే చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ముందే దూరం పెట్టి ఉంటే పార్టీ ఇంతగా భ్రష్టుపట్టింది కాదని కూడా అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అంతేనా! గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు పేరిట ప్రజలకు విడుదలచేసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో మాటవరసకైనా పట్టాభి పేరును ప్రస్తావించకపోవడం పరిశీలనాంశం.
గన్నవరం సంఘటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయిందని జిల్లా నాయకులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. నాయకుల పనితీరునూ తూర్పారపట్టిన ఆయనకు ఆ తరువాత పలు విషయాల గురించి తెలియవచ్చింది. జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు కొందరు కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న అంశాలను, అంతకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దారుణ పరిణామాలను ఏకరువు పెట్టడంతో పాటు సీనియర్లుగా తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారనేది అత్యంత విశ్వసనీయ సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు మీకిలాంటివి ఏమీ పట్టలేదని, అప్పుడే కొంతయినా సరిచేసి ఉంటే ఇంతలా పరిస్థితులు ఇప్పుడు తలెత్తేవి కావని అనడంతో చంద్రబాబు కూడా మౌనం వహించారని తెలిసింది. ముఖ్యమంత్రిని ఇతర నాయకులను ఇష్టానుసారం పరుషపదజాలంతో మాట్లాడటం సరికాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పడంతో తమ నాయకుడు మారుమాట్లాడలేదని సమాచారం.
అలా చేయడం ముమ్మాటికీ తప్పే..
బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండగా పార్టీ ఆదేశిస్తే తానే పోటీచేస్తానంటూ పట్టాభి ఇష్టానుసారం మాట్లాడటంతో నియోజకవర్గానికి చెందిన వారు కూడా అంటీముట్టనట్లు ఉన్నారని విశ్లేషించారు. తనంతట తాను గొప్ప నాయకునిగా పోల్చుకుంటూ రాష్ట్ర, జిల్లాలోని సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, కేశినేని నాని కార్యాలయంలో ఉంటూ పలు ఆరోపణలను ఎదుర్కోవడం, వివాదాలకు కారకుడనే గుర్తింపు తెచ్చుకోవడం తదితరాలతో పాటు పట్టాభి గతంలో అమెరికాకు వెళ్లి ఎన్‌ఆర్‌ఐల వద్ద పార్టీపేరు చెప్పి స్వీయ ప్రయోజనాలు పొందారని వివరించడంతో, అవునా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది.
‘పట్టాభి గురించి తెలియాల్సిన అంశాలన్నీ మా సార్‌కు ఇప్పటికి తెలిసొచ్చాయి. అతను అంత యూజ్‌లెస్ నా అంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి విషయంలో ముందే జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. అతని మాటలవల్లే కదా మంగళగిరి, గన్నవరంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయి’ అని ప్రస్తావనకు వచ్చిందని ఓ సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఇలాంటివన్నీ అవసరమా? మొత్తం డైవర్ట్ అయిపోయిందిగా. పార్టీ కూడా బాగా బదనాం అయ్యింది. అన్నింటికన్నా ముఖ్యంగా పట్టాభికి సంబంధించిన ఆ పాత ఫొటోలు ఎవరు పోస్ట్ చేశారో.. అన్నివిధాలా చాలా డ్యామేజ్ అయ్యిందని ముఖ్యనాయకుల వద్ద బాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పట్టాభి పేరు కూడా లేదాయె...
‘గన్నవరం విధ్వంసం– ప్రజలకు బహిరంగ లేఖ’ అంటూ చంద్రబాబు పేరిట ఇదివరకే పార్టీ విడుదల చేసింది. నాలుగు పేజీల ఆ లేఖలో పట్టాభి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా పేరు మాత్రం రెండు చోట్ల ప్రముఖంగా ఉంది. దీన్నిబట్టి పట్టాభి విషయంలో పార్టీ ఎలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటుందో స్పష్టమైపోతోందని విజయవాడకు చెందిన మరో నాయకుడు అభిప్రాయపడ్డారు. పట్టాభి వ్యవహార శైలిని జిల్లా నాయకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేషన్ కమిటీని అధిష్టానం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్వంలో తక్షణం నియమించినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment