ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ముస్లింల కోటా అంశం తెరపైకి వస్తూ... గతం తాలూకు గాయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. ముస్లింలు వెనుకబడిపోయారన్న అంశం కోటా కోరడానికి ప్రాతిపదిక. వీరు వెనుకబడిపోయారన్న కారణంతోనే 1906లో ‘ఆలిండియా ముస్లిం లీగ్’ ఏర్పడింది. అలాగే ముస్లింలకు వేరుగా ఓటరు జాబితా (1909), ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేకంగా 25 శాతం కోటా (1926)లు అందుబాటులోకి వచ్చేందుకూ ఇదే కారణం. వీటివల్ల అష్రాఫ్‌ల వంటి ఉన్నతవర్గాలతో ‘ముస్లిం సమాజం’ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. లాభపడింది కూడా ఈ సమాజమే. అనవసరమైన చేర్పులతో కాంగ్రెస్ పార్టీ ; దళిత మూలాలున్న ముస్లింలను ఎస్సీ కోటాలో చేర్చడాన్ని వ్యతిరేకించిన బీజేపీ... రెండూ ముస్లింల వెనుకబాటుకు కారణమయ్యాయి.
ముస్లింలకు కోటా విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ కొట్లాటకు దిగుతూండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కొట్లాటల మూలం మాత్రం బ్రిటిష్ పాలకుల కళ్లముందు జరిగిన దేశ విభజన గాయాలే అని మేధో వర్గంలోనూ అటు ఏకాభిప్రాయం, ఇటు భిన్నాభిప్రాయమూ ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ముస్లింల కోటా అంశం తెరపైకి వస్తూ... గతం తాలూకూ గాయాలను గుర్తు చేస్తూ ఉంటుంది. తద్వారా రాజకీయం మొత్తం హిందూ–ముస్లిం, మెజార్టీ–మైనార్టీ, సెక్యులర్–కమ్యూనల్, ఇస్లామోఫోబియా అన్న అంశాలకే పరిమితమవుతూ ఉంటుంది. ఈ భావజాలం కాస్తా కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయం వంటి విస్తృతాంశాలపై జరగాల్సిన చర్చను కట్టడి చేసేందుకు ఒక వర్గానికి చక్కగా ఉపయోగపడుతోంది.
వలస పాలన ముగింపు దశలో ప్రభుత్వ పాలన వ్యూహాలు, అంతులేని మత ఘర్షణలు, మత పునరుజ్జీవన యత్నాల ఫలితంగానే దేశంలో హిందు, ముస్లిం సమాజాలన్న భావన పుట్టుకొచ్చింది. ఈ వర్గాల్లోని ఉన్నత వర్గాలు ‘ద్విజులు’, ‘అష్రాఫ్’లు ఈ భావజాలాన్ని పెంచి పోషించారు. ఈ కారణంగా మతం ఆధారంగా కొనసాగిన రాజకీయాలు... మతానికి వ్యతిరేకంగా నడిచిన ఉద్యమాలతో వైరం పెంచుకున్నాయి. గతంలో పాల్‌బ్రాస్ చెప్పినట్లు ‘ముస్లింలు వెనుకబడిపోయారన్న భ్రమ’ పునాదులు 1882 నాటి హంటర్ కమిషన్ నాటి నుంచే కనిపిస్తుంది.
అప్పట్లో కేవలం బెంగాల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముస్లిం సమాజం మొత్తం వివక్షకు గురైనట్లు చిత్రీకరించారు. ఉదాహరణకు 1881 – 1921 మధ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లోని ముస్లింల శాతం 34.8 నుంచి 47.2కు వెళ్లింది. అయితే ఈ మధ్యకాలంలోనే దేశంలో ముస్లింల జనాభా కూడా 19 శాతం (1881) నుంచి 23 శాతానికి (1921) పెరిగింది. మతానికీ, సామాజిక స్థాయికీ మధ్య సంబంధం ఉందన్న దృష్టికోణం నుంచి ఈ సమాచారాన్ని పరిశీలిస్తే వలసపాలకుల ప్రాపకంతో వచ్చిన లబ్ధిని ముస్లింలలోని ఉన్నత వర్గాలైన అష్రఫీలు అందుకున్నట్లు స్పష్టమవుతుంది. సాంస్కృతిక అంశాలను పెట్టుబడిగా పెట్టి వీరు సాధారణ ముస్లింలను పక్కకు తోసి ఈ లాభాలు పొందారు.
ముస్లింలు వెనుకబడిపోయారన్న భ్రమే 1906లో ‘ఆలిండియా ముస్లిం లీగ్’ ఏర్పాటుకు కారణమైంది. అలాగే ముస్లింలకు వేరుగా ఓటరు జాబితా (1909), ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేకంగా 25 శాతం కోటా (1926)లు అందుబాటులోకి వచ్చేందుకూ ఇదే కారణం. వీటి వల్ల అష్రాఫ్‌ల వంటి ఉన్నతవర్గాలతో కూడిన ‘ముస్లిం సమాజం’ ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది. లాభపడింది కూడా ఈ సమాజమే. ‘ముస్లింలు ముప్పును ఎదుర్కొంటున్నారు’... ‘ముస్లింల మెప్పు పొందే ప్రయత్నాల’న్న భావజాలం కూడా ఈ అష్రాఫ్‌ల వంటి ఉన్నత వర్గాలు సమాజంలోకి చొప్పించినవే.
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కూడా తొలినాళ్ల నుంచి వలసపాలకుల ‘ముస్లిం ఫస్ట్’ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగువ తరగతి ముస్లింలతో ‘మోమిన్ కాన్ఫరెన్స్’ను స్థాపించిన అబ్దుల్ ఖయ్యూమ్ అన్సారీ కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. 1930ల్లో ఏర్పడ్డ మోమిన్ కాన్ఫరెన్స్ ముస్లిం లీగ్‌ను అష్రాఫ్ ముస్లిం కూటమిగా వ్యవహరించేది. అలాగే మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ‘టూ నేషన్ థియరీ’ని తీవ్రంగా వ్యతిరేకించింది కూడా. 1939లో దేశంలోని ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనీ, దిగువ తరగతి ముస్లింలకు వేరుగా జాబితా, ప్రాతినిధ్యం కల్పించాలనీ మోమిన్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేసింది.
పన్నులు కట్టే, విద్యార్హతలు, ఆస్తులుండే వారికి మాత్రమే ఓటుహక్కు ఉండేది అప్పట్లో. వీరు ముస్లిం లీగ్‌కు ప్రాతినిధ్యం వహించేవారు. ముస్లిం ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసేవారు. అయితే 1946 ఎన్నికల్లో ముస్లింలీగ్ విజయం సాధించడంతో దేశ విభజన అడ్డుకునేందుకు మోమిన్ కాన్ఫరెన్స్ ప్రయత్నాలు సరిపోలేదు. స్థూలంగా చూస్తే ముస్లిం అష్రాఫ్‌లు జిన్నా దేశ విభజన పిలుపునకు ఊ కొట్టారనీ, దిగువస్థాయి ముస్లింలు వ్యతిరేకించడంతోపాటు గాంధీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి పని చేశారనీ అర్థమవుతుంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ముస్లిం లీగ్ భాగమైపోయింది. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి వారితో కలిసి ముస్లింలను జనజీవన స్రవంతిలోకి చేర్చేందుకు ఇది అవసరమన్న మిష చూపింది. కాలక్రమంలో ఈ అష్రాఫ్ నేతలు కాంగ్రెస్‌లో ముస్లిం వ్యవహారాలపై వ్యాఖ్యాతలుగా మారారు. ఈ క్రమంలోనే దిగువ జాతి ముస్లింల అభివృద్ధి నలిగిపోయింది.
స్వాతంత్య్రం తరువాత రెండుసార్లు (1955, 1979) ఏర్పాటైన వెనుకబడిన వర్గాల కమిషన్లు (కాకా కేల్కర్, మండల్ కమిషన్లు) కూడా ముస్లింలను వెనుకబడిన వర్గాలుగా పరిగణించలేదు. మండల్ కమిషన్ నివేదిక 82 కులాల ముస్లింలు సామాజికంగా వెనుకబడి ఉన్నారని చెప్పడంతో... మతాలకు అతీతంగా అణచివేతకు గురైన కులాల అంశంపై విస్తృత చర్చకు మార్గం ఏర్పడింది. అలీ అన్వర్ నేతృత్వంలోని ‘పస్మాందా ఉద్యమం’ ముస్లిం కోటాను వ్యతిరేకిస్తూనే దళిత, ఆదివాసీల వంటి సామాజిక వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న కులాలకు న్యాయం చేయాలనీ, ఇది మతాలకు అతీతంగా జరగాలనీ డిమాండ్ చేస్తూ వచ్చింది.
1990 తొలి నాళ్లలో భారతీయ ముస్లింలలో 85 శాతం వరకూ ఉన్న దిగువ తరగతి ముస్లింలకు వేర్వేరు రాష్ట్రాల్లోని ఓబీసీ కోటాల్లో రిజర్వేషన్లు లభించేవి. అయితే కాంగ్రెస్‌లోని అష్రాఫ్ ముస్లింలు పస్మాంద వర్గాలకు లభిస్తున్న చిన్నపాటి సౌకర్యాలను కూడా పట్టాలు తప్పించే ప్రయత్నం చేసేవారు. ముస్లిం కోటాను డిమాండ్ చేయడం, ఓబీసీ వర్గాల్లో మతం ప్రస్తావన తేవడం ద్వారా ఇది జరిగేది. 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం కోటా ప్రస్తావన, కేంద్ర ఓబీసీ కోటాలో మైనార్టీల్లోని వెనుకబడిన వర్గాల వారికి 4.5 శాతం సబ్‌కోటా ఏర్పాటు వంటివన్నీ పస్మాందా వర్గాలకు లభిస్తున్న సౌకర్యాలను తప్పించే ప్రయత్నాలకు నిదర్శానాలు. దళితుల కంటే ముస్లింలు వెనుకబడి పోయారన్న తప్పుడు అంచనాకు సచార్‌కమిటీ వచ్చిందంటారు. నిజానికి దీన్ని అష్రాఫ్ వర్గాలు ముందుకు తెచ్చాయి.
ముస్లిం కోటాపై కాంగ్రెస్ వైఖరిని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ చెబుతున్నా... దాన్ని అష్రాఫ్ వర్గం మెప్పుకు మాత్రమే కాంగ్రెస్ ప్రయత్నించిందన్నట్లుగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో కొన్ని తప్పులు చేసిందని రాహుల్ గాంధీ పరోక్షంగా ఒప్పుకున్నప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తారా అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. హంటర్ నుంచి సచార్ వరకూ ఏర్పాటైన కమిషన్ల నివేదికలను అధ్యయనం చేసి ముస్లింల వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుందా? అనవసరమైన చేర్పులతో కాంగ్రెస్ పార్టీ ముస్లింల వెనుకబాటు తనానికి కారణమైతే; బీజేపీ... ముస్లింలు, క్రిస్టియన్లు, దళిత మూలాలున్న ముస్లింలను ఎస్సీ కోటాలో చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా ముస్లింల వెనుకబాటు తనానికి కారణమైందని చెప్పాలి. – వ్యాసకర్త అజీమ్ ప్రేమ్‌జీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)
విశ్లేషణ: ఖాలిద్ అనీస్ అన్సారీ
Comments
Please login to add a commentAdd a comment