![Haridwar Man Poisons 3 Leopards in Revenge for Killing His Dog - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/9/123.jpg.webp?itok=gnh15dCJ)
హరిద్వార్ : పెంపుడు కుక్కను చంపేశాయనే కోపంతో ఓ వ్యక్తి మూడు చిరుత పులులకు విషం పెట్టి చంపేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రాజాజీ నేషనల్ పార్కులో వేర్వేరు చోట్ల మూడు చిరుత పులులు అనుమానాస్పదంగా మరణించిన విషయాన్ని ఫారెస్టు అధికారులు గుర్తించారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించగా అవి ఒకే రీతిలో మరణించాయని తెలిసింది. విషపూరితమైన కుక్కమాంసం తినడం వల్లే చనిపోయినట్లుగా ధృవీకరించుకున్న అధికారులు ఆ విషం ఫారెస్టు నర్సరీలో వాడేదిగా గుర్తించారు. దీంతో ఫారెస్టు నర్సరీలో విచారించగా సుఖ్‌పాల్ అనే వ్యక్తి నిందితుడిగా తేలింది.
సుఖ్‌పాల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ‘తాను రెండు పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నానని, చిరుతలు దాడిచేసి ఒక దాన్ని చంపేయగా ఇంకొకటి తీవ్రంగా గాయపడిందని, దీంతో కోపం వచ్చి చిరుతలను చంపాలని నిర్ణయించుకున్నానని’ నేరాన్ని అంగీకరించాడు. సుఖ్‌పాల్ భార్య ఫారెస్టు నర్సరీలో పనిచేసే చిరుద్యోగి. ఈమె ద్వారా విషం సంపాదించిన అతను చనిపోయిన కుక్కకు విషం పూసి అడవిలో పడేశాడు. దీంతో ఇది తిన్న మూడు చిరుతలు మరణించాయి. నిందితున్ని కోర్టులో హాజరుపర్చగా 12 రోజుల కస్టడీ విధించింది. కాగా ఇదే తరహాలో మహరాష్ట్రలో ఆవుదూడను చంపిన కుక్కలను చంపాలనే కోపంతో ఓ రైతు చనిపోయిన ఆవుదూడకు విషం పూయగా దాన్ని తిని మూడు పెద్దపులి పిల్లలు మరణించడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment