ధర్మపురి మ్యాప్
మళ్లీ గెలుపునకు డీఎంకే వ్యూహం
పట్టుకు పీఎంకే కుస్తీ
అభ్యర్థిగా సౌమ్య అన్బుమణి రాందాసు
పాగా వేస్తామంటున్న అన్నాడీఎంకే
రేసులో నామ్ తమిళర్ కట్చి
కీలకంగా మారిన తెలుగు ఓటర్లు
సాక్షి, చైన్నె: పర్యాటకంగానే కాకుండా మామిడి ఉత్పత్తికి ధర్మపురి ప్రసిద్ధి చెందింది. కావేరి నదీ తీరంలోని తీర్థాదీశ్వర ఆలయంలో రాముడు, హనుమంతుడు పూజలు చేసినట్టుగా ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఈ ఆలయంలోని స్వామి వారికి అభిషేకం నిర్వహించడం కోసం రాముడు ఓ జలపాతాన్ని ఇక్కడ సృష్టించినట్టుగా, దీనిని నేడు హనుమంత తీర్థంగా పేర్కొంటుంటారు. భారత నయాగారాగా పిలవబడే ‘హొగ్నేకల్’ జలపాతం కూడా ఇక్కడే ఉంది. ఈ ధర్మపురిలో లోక్ సభ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు చెమటోడ్చుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఏకంగా 20శాతం ఓటర్లు తెలుగు మాట్లాడే వారు కావడంతో ఇక్కడి ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
డీఎంకే డిపాజిట్ గల్లంతు..
2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే హవా కొనసాగింది. అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ధర్మపురిలో ఆపార్టీ నేతృత్వంలోని కూటమికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఒక్కటంటే ఒక్క సీటు ఇక్కడ గెలువలేదు. ఈ లోక్‌సభ పరిధిలో పాలక్కోడు, పెన్నాగరం, ధర్మపురి, పాపిరెడ్డి పట్టి, హారూర్, మెట్టూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మేట్టూరు నియోజకవర్గం సేలం జిల్లాలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో పాలక్కోడు నుంచి అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ అన్బళగన్ ఐదోసారిగా గెలిచారు. అలాగే, అదే పార్టీకి చెందిన గోవిందస్వామి పాపిరెడ్డిపట్టి నుంచి, వి.సంపత్‌కుమార్ హారూర్ నుంచి రెండుసార్లు గెలిచారు. మూడు స్థానాలను అన్నాడీఎంకే కై వసం చేసుకోగా, మిగిలిన మూడు స్థానాలలో పెన్నాగరం నుంచి పీఎంకే గౌరవాధ్యక్షుడు జీకే మణి, ధర్మపురి నుంచి పార్టీకి చెందిన ఎస్పీ వెంకటేశ్వరన్, మేట్టూరు నుంచి పి.సదాశివం విజయఢంకా మోగించారు. అన్నాడీఎంకే, పీఎంకే అభ్యర్థుల ముందు డీఎంకే కూటమి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇందుకు డీఎంకే సిట్టింగ్ ఎంపీ డాక్టర్ ఎస్ సెంథిల్‌కుమార్ పనితీరు కారణంగా ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది.
చేజారకుండా జాగ్రత్తగా..
అసెంబ్లీ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైనా లోక్‌సభ ఎన్నికలలో తమ పట్టు చేజారకుండా జాగ్రత్తగా వ్యూహాలకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదునుపెట్టారు. ఇక్కడ ఇప్పటి వరకు డీఎంకే 3 సార్లు, ఆ కూటమిలోని కాంగ్రెస్ మరో మూడుసార్లు గెలిచాయి. తమకు బలం ఉన్న చోట డిపాజిట్లు గల్లంతు కావడం ఆ కూటమిని జీర్ణించుకోలేకుండా చేసింది. దీంతో ఈసారి సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి స్థానిక నేతగా ఉన్న ఎ.మణిని పోటీలో పెట్టారు. ఈయన గెలుపు లక్ష్యంగా సీఎం స్టాలిన్, యువజన నేత, మంత్రి ఉదయనిధిస్టాలిన్ ధర్మపురిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో కోల్పోయిన ఓట్లను, పట్టును తిరిగి సొంతం చేసుకునేందుకు డీఎంకే కూటమిలోని పార్టీలు తీవ్రంగా కుస్తీలు పడుతున్నాయి.
పట్టు బిగిస్తామంటోన్న పీఎంకే..
ప్రస్తుతం డీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని తమ ఖాతాలోకి వేసుకుని తీరుతామన్న ధీమాను పీఎంకే, అన్నాడీఎంకేలు వేర్వేరుగా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు పీఎంకే నాలుగు సార్లు గెలిచింది. 2014లో ఆపార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికలలో 70 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. గతంలో కంటే తమకు బలం పెరగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వ్యూహాత్మకంగా పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన వారసుడు, పార్టీ అధ్యక్షుడు అన్బుమణి అడుగులు వేశారు. తొలుత ఓ అభ్యర్థిని ప్రకటించినా, హఠాత్తుగా అతడ్ని మార్చి తన కోడలు సౌమ్య అన్బుమణిని అభ్యర్థిగా రాందాసు ప్రకటించారు. గతంలో అన్బుమణి ఎంపీగా ఉన్న సమయంల, ఆ తర్వాత కానీయండి తన నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ద్వారా సౌమ్య అన్బుమణి ఇక్కడి ప్రజలకే కాదు, తన సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమెను అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కృష్ణస్వామి కుమార్తెగా, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు సతీమణిగా ప్రచారంలో సౌమ్య అన్బుమణి ముందంజలో ఉన్నారు. పీఎంకే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పట్టు బిగించే విధంగా ముందుకు సాగుతున్నారు.
పాగా వేస్తామంటున్న అన్నాడీఎంకే..
ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్థానికంగా బలం కలిగిన నేతలు. ఇందులో ఒకరు ఐదుసార్లు, మరో ఇద్దరు రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. తమకు బలం ఉన్న నేపథ్యంలో ఈసారి తప్పకుండా పాగా వేస్తామన్న ధీమాను వ్యక్తం కేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ అశోకన్‌ను గెలిపించేందుకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటనలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఒకే సామాజిక వర్గ అభ్యర్థుల మధ్య జరుగుతున్న ఈ రసవత్తర సమరంలో తాము సైతం అంటూ నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా డాక్టర్ అభినయ పొన్నివలవన్ సైతం ఓట్ల చీలికతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
ధర్మపురి లోక్‌సభను మళ్లీ కై వసం చేసుకోవడంమే లక్ష్యంగా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. తమ గుప్పెట్లో నుంచి చేజారిన ఈ స్థానంపై పట్టుకు పీఎంకే తీవ్ర కుస్తీలు పడుతోంది. ఇక్కడ తమకు సైతం బలం ఉండడంతో పాగా వేసి తీరుతామన్న ధీమాను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రేసులో తామూ ఉన్నామన్నట్టు నామ్ తమిళర్ కట్చి ప్రచారంలో ఉంది. వన్నియర్ సామాజిక వర్గం, తెలుగు మాట్లాడే వారే న్యాయనిర్ణేతలుగా ఉన్న ఈ లోక్‌సభలో ఓటరు నాడి అంతుచిక్కని పరిస్థితి నెలకొంది.
ఓటరు ఎటో..
ఈ నియోజకవర్గంలో 15,12,732 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఓటర్లు అత్యధికంగా ఉంటే, ఈ నియోజకవర్గంలో మాత్రమే పురుషులు ఓట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఓటర్లలో వన్నియర్ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ 50 శాతం, తెలుగు మాట్లాడే వారి సంఖ్య 20%, ఇతర సామాజిక వర్గాలు 30 శాతం మేరకు ఉన్నాయి. ఈ ఓటరు నాడి ఎటో అనేది అంతు చిక్కని పరిస్థితి. 2019 లోక్‌సభ ఎన్నికలలో డీఎంకేను ఆదరించిన ఓటర్లు, 2021 అసెంబ్లీ ఎన్నికలలో తిరస్కరించడం గమనార్హం. తాజాగా ఓటరు నాడి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. వన్నియర్ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ చెల్లా చెదురయ్యే అవకాశాల నేపథ్యంలో తెలుగు మాట్లాడే వారు, ఇతర సామాజిక వర్గాల ఓట్లే గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయనున్నాయి. దీంతో ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నువ్వా..నేనా అంటూ అభ్యర్థులు ఉరకలు, పరుగులు తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment