రైలులో నోట్ల కట్టలు.. రూ. 4 కోట్లకు పైగా సీజ్‌ | Over rs 4 crore seized from Tambaram railway station | Sakshi
Sakshi News home page

రైలులో నోట్ల కట్టలు.. రూ. 4 కోట్లకు పైగా సీజ్‌

Published Sun, Apr 7 2024 11:38 AM | Last Updated on Sun, Apr 7 2024 12:18 PM

Over rs 4 crore seized from Tambaram railway station - Sakshi

చెన్నై, సాక్షి: చెన్నై తాంబరం రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నెల్లూరు ఎక్స్‌ప్రెస్ రైలులో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు ఎనిమిది బ్యాగులతో ఎగ్మోర్‌లో రైలు ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, తాంబరంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్‌లు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాంబరం రైల్వే స్టేషన్‌కు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులను అగరానికి చెందిన ఎస్ సతీష్, అతని సోదరుడు ఎస్ నవీన్, తూత్తుకుడికి చెందిన ఎస్ పెరుమాల్‌గా గుర్తించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ (ఏ1)లో వెతకగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు దొరికాయి. 

దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఐటీ బృందాలు నిందితులను ఆదివారం లేదా సోమవారం విచారించనున్నాయి. తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్‌కు చెందిన కిల్‌పాక్, ట్రిప్లికన్, సాలిగ్రామం ప్రాంతాలలో కూడా పోలీసులు సోదాలు చేశారు. నిందితులు నగదును ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లే ముందు బీజేపీ నేతకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచినట్లు తెలిసింది. 

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరునెల్వేలి లోక్‌సభ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ డబ్బును తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు మొదటి దశ అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement