చెన్నై, సాక్షి: తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రూ. 1 కోటి నగదును స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో లోక్‌సభకు పోలింగ్‌కు ముందు ఒకే ఇంట్లో అదీ కూడా ఓ గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడం గమనార్హం.
తిరుచిరాపల్లిలోని ఎత్తరై గ్రామంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారని, ఒక బ్యాగ్‌లో నింపిన మొత్తం రూ.1 కోటి కరెన్సీ నోట్లు దొరికాయని జిల్లా కలెక్టర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్‌లోని ఎలక్షన్ కంట్రోల్ రూంకి ఫోన్ కాల్ వచ్చిందని, ఫలితంగా నగదు రికవరీ అయ్యిందని ఆయన చెప్పారు. ఓ ఇంట్లో కరెన్సీ నోట్లు భద్రపర్చినట్లు సమాచారం అందడంతో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు గ్రామానికి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో నగదును ఇంట్లో ఎవరు ఉంచారు.. ఎన్నికలలో ఓటర్లకు పంచేందుకే ఈ డబ్బును సిద్ధం చేశారా అనే కోణంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment