బెంగళూరు : ఉల్లి ధర మరోసారి వినియోగదారుల కంట కన్నీరు పెట్టించనుంది. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఉల్లిపాయ ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఎడ తెరిపిలేని వర్షాలు ఖరీఫ్ పంటను ప్రభావితం చేశాయి. ఇప్పటికే లాసాల్‌గావ్, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో గత పదిహేను రోజులుగా టోకు ధరలు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉల్లి ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి ఖరీఫ్ ప్రధాన పంట ఉల్లిపాయల సాగు ఎక్కువగా వేయలేదు. దీంతో మరి కొన్ని రోజుల్లో ఉల్లిపాయలకు తీవ్ర కొరత ఏర్పడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉల్లిపాయల మార్కెట్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న లాసాల్‌గావ్ ప్రాంతంలో ఉల్లిపాయల సాగు గణనీయంగా పడిపోయింది. కర్ణాటక మార్కెట్‌లో ఉల్లిధర ఆగస్టు మొదటివారం నుంచి ఇప్పటికే 40 శాతం వరకు పెరిగింది. లాసాల్‌గావ్ ప్రాంతం నుంచి రావాల్సిన పంట చేతికి రాకపోతే ఉల్లిపాయల ధర విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. మరోవైపు ఉల్లిపాయల ఉత్పత్తికి మరో ప్రధాన మార్కెట్ అయిన మహరాష్ట్ర రైతులు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఉల్లిని మార్కెట్‌కు తరలించకుండా, గిడ్డంగుల్లోనే దాచిపెడుతున్నారు. ముందస్తు అంచనాలతో రైతులు ఇలా చేస్తున్నారని వాణిజ్య వర్గాలు తెలిపాయి. దీంతో ఉల్లిపాయల కొరత ఏర్పడి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అయితే మరొక ప్రధాన ఎగుమతి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా.. కర్నూలులో ఉల్లి సాగు పెరిగితే ఎంతో కొంత కొరతను నివారించవచ్చు. కర్నూలు నుంచి ఉల్లిపాయలు ప్రధానంగా తమిళనాడుకు ఎగుమతి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment