Lasalgaon market
-
లసల్గావ్ మార్కెట్.. ఆనియన్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన కార్యశాలి ఆమె!
లసల్గావ్.. అసియాలోనే అతి పెద్ద ఆనియన్ మార్కెట్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సీజన్లో అక్కడ రోజూ ఉల్లిపాయల వేలం జరుగుతుంది. వ్యాపారులు మగవాళ్లే, దళారులు మగవాళ్లే, రైతులూ మగవాళ్లే. ఆడవాళ్లను ఆ దరిదాపుల్లోకి రానివ్వరు. అలాంటిది తొలిసారి.. ‘నా పాట...’ అంటూ ఒక మహిళ గొంతు వినిపించింది. అంతా తల తిప్పి చూశారు. ‘నా పేరు సాధన.. నా పాట ..’ అంటూ ఆమె వేలంలోకి దిగారు. అయితే మగవాళ్లంతా ఆ వేలాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం సాధన వైపు నిలబడింది. సాధనకు వేలం సమకూరింది. గ్లాస్ కన్నా గట్టిదైన ఆ ఆనియన్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన కార్యశాలిగా సాధనా యాదవ్ వార్తల్లోకి వచ్చారు. లసల్గావ్ ఉల్లి మార్కెట్లో శుక్రవారం హటాత్తుగా ఉల్లిపాయల వేలంపాట ఆగిపోయింది. ‘‘మేము పాడం’’ అని వ్యాపారులు పక్కకు వెళ్లిపోయారు. వాళ్లతోపాటు దళారీలు, వాళ్లతోపాటు కొద్దిమంది రైతులు! ‘ఆడవాళ్లను వేలంలోకి ఎలా రానిస్తారు?’ అని వాళ్ల అభ్యంతరం. అయితే ఆ మాటను వారు నేరుగా అనలేదు. ‘వేలానికి వచ్చిన ఆ ఆడ మనిషికి కమిటీలో సభ్యత్వం లేదు. తనను వెళ్లిపొమ్మనండి’ అన్నారు. వాళ్లన్న ఆ ఆడ మనిషి సాధనా జాదవ్. వాళ్లన్న ఆ కమిటీ ఏపీఎంసీ. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. సాధన అనే ఆ మహిళకు ఎపీఎంసీలో సభ్యత్వం లేని మాట నిజమే. అయితే ఉండాలన్న నిబంధన లేదు. సాధన అదే మాట అన్నారు. ‘‘వేలానికి ఎవరొచ్చినా, రాకున్నా మాకు అనవసరం. మేము పాటలోకి దిగుతున్నాం’’ అని చెప్పారు. లసల్గావ్ వేలంలో టన్నుల కొద్దీ ఉల్లిపాయల్ని కొనేసి తను వ్యాపారం చేసుకోడానికి సాధన అక్కడికి రాలేదు. ‘కృషి’ అనే వ్యవసాయ ఉత్పత్తుల మహిళా సహకార సంఘం తరఫున వచ్చారు. ఆమె వెనుక ‘కృషి’ ఉంది. ‘కృషి’ వెనుక నాఫెడ్ ఉంది. (నేషనల్ అగ్రికల్చరల్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా). ఎవరున్నా వెనక్కి వెళ్లాల్సిందే అని సాధనను, ఆమె వెంట ఉన్న మరొక మహిళను అక్కడి నుంచి తరిమేసినంత పని చేశారు. అయితే వేలంలో పాల్గొనడానికి సాధనకు అధికారికమైన అడ్డంకులేమీ లేవు. పాటకు వచ్చిన పురుషులు వచ్చారు. పాట సాగింది. సాధనకు పాట దక్కింది. ∙∙ గ్లాస్ సీలింగ్ అంటుంటాం కానీ.. లసల్గావ్ ఆనియన్ సీలింగ్ మహా దృఢమైనది. మగాళ్లంతా జట్టు కట్టినట్లుగా ఆడవాళ్లను వేలంలోకి రానివ్వరు. తక్కువకు పాడి ఎక్కువకు అమ్మేసుకోవాలని అంతా ఒకమాటపై ఉండే ఆ వేలం వలయంలో ఉండేదంతా పురుషులే. మహిళా రైతులు ఉన్నా వారి తరఫున పురుషులనే వేలంలో పాడనిస్తారు. అయితే గత గురువారం నుంచి ‘నాఫెడ్’ తరఫున ‘కృషి’ సంస్థ డైరెక్టర్ అయిన సాధన నేరుగా తనే వేలానికి వస్తున్నారు. పైగా నాఫెడ్‌కు కృషి నోడల్ ఏజెన్సీ. ‘అయితే మాత్రం..’ అని వేలానికి వచ్చిన పురుషులు గురువారం ఒక్కరోజే కాదు, శుక్రవారం, శనివారం కూడా సాధన వేలంలో పాల్గొన్నారు. వేలం ఎవరి ఆధ్వర్యంలో అయితే జరిగిందో ఆ ఎపీఎంసీకి ఛైర్పర్సన్ కూడా మహిళే. సువర్ణ జగ్దీప్. మహిళ కాబట్టి మహిళకు మద్దతు ఇవ్వడం కాదు.. సాధన అవసరమైన పత్రాలన్నీ చూపించారు. ఇక పురుషులు సాకులు చూపడానికి దారి లేకపోయింది. లసల్గావ్ మార్కెట్ కమిటీ పరిధిలోని 321 మంది కమీషన్ ఏజెంట్లలో 107 మంది, కమిటీలో పేరు నమోదు చేయించుకున్న 335 మంది వ్యాపారులలో 71 మంది మహిళలు ఉన్నప్పటికీ ఏనాడూ అక్కడి వారు మహిళల్ని వేలం లోకి రానివ్వలేదు. సాధననా యాదవ్ వల్ల మొదటిసారి ఆ ఆనియన్ సీలింగ్ బ్రేక్ అయింది. ఈ ఘటనతో అసలు లసల్గావ్ వేలంలో ఇంతకాలం ఏం జరుగుతున్నదీ మాధునీ ఖడ్సే అనే మహిళా రైతు ముందుకు వచ్చి చెప్పగలిగారు. సాధనా యదవ్ వేలంపాటలో మహిళా రైతులు, మహిళా వర్తకుల మాట చెల్లుబాటు కాకుండా ఉండేందుకు అవసరమై అన్ని అవాంతరాలను, అడ్డంకులను, అసౌకర్యాలను వేలంలో పాల్గొనడానికి వచ్చే పురుషులు సృష్టిస్తూ ఉంటారని మాధురి చెప్పారు. సాధనా యాదవ్ చొరవతో మొట్టమొదటి సారి మహిళల మాట నెగ్గిందని అన్నారు. తక్కువకు వేలాన్ని ముగించనివ్వకుండా, న్యాయంగా పాడి రైతుకు లాభం చేకూరుస్తారు కనుకనే మహిళలను లోపలికి రానివ్వరని కూడా ఆమె చెప్పారు. ‘‘ఏపీఎంసీ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కయి ఈ పని చేస్తారు. ఇదేంటని ప్రశ్నించిన రైతు పంట వేలం వరకు రాకుండా వృథా కావలసిందే. మహిళలు ఇలాంటివి సాగనివ్వరు కనుకనే వాళ్లను దూరంగా ఉంచుతారు’’ అని అంటున్న సాధనా యాదవ్.. ‘‘ఇది ఒకరోజుతో ముగిసే పోరాటం కాదు. రైతుల తరఫున నిరంతరం ఒకరు ఉండాలి. మా సొసైటీ ఉంటుంది’’ అని ఆమె స్పష్టంగా చెబుతున్నారు. చదవండి: భారత్ బయోటెక్’కు సీఐఎస్ఎఫ్ భద్రత -
రానున్న రోజుల్లో ఉల్లి ‘ఘాటు’
బెంగళూరు : ఉల్లి ధర మరోసారి వినియోగదారుల కంట కన్నీరు పెట్టించనుంది. భారీ వర్షాలు, వరదలు కారణంగా ఉల్లిపాయ ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఎడ తెరిపిలేని వర్షాలు ఖరీఫ్ పంటను ప్రభావితం చేశాయి. ఇప్పటికే లాసాల్గావ్, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో గత పదిహేను రోజులుగా టోకు ధరలు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉల్లి ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి ఖరీఫ్ ప్రధాన పంట ఉల్లిపాయల సాగు ఎక్కువగా వేయలేదు. దీంతో మరి కొన్ని రోజుల్లో ఉల్లిపాయలకు తీవ్ర కొరత ఏర్పడవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉల్లిపాయల మార్కెట్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న లాసాల్గావ్ ప్రాంతంలో ఉల్లిపాయల సాగు గణనీయంగా పడిపోయింది. కర్ణాటక మార్కెట్లో ఉల్లిధర ఆగస్టు మొదటివారం నుంచి ఇప్పటికే 40 శాతం వరకు పెరిగింది. లాసాల్గావ్ ప్రాంతం నుంచి రావాల్సిన పంట చేతికి రాకపోతే ఉల్లిపాయల ధర విపరీతంగా పెరుగుతుందని అంటున్నారు. మరోవైపు ఉల్లిపాయల ఉత్పత్తికి మరో ప్రధాన మార్కెట్ అయిన మహరాష్ట్ర రైతులు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఉల్లిని మార్కెట్‌కు తరలించకుండా, గిడ్డంగుల్లోనే దాచిపెడుతున్నారు. ముందస్తు అంచనాలతో రైతులు ఇలా చేస్తున్నారని వాణిజ్య వర్గాలు తెలిపాయి. దీంతో ఉల్లిపాయల కొరత ఏర్పడి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. అయితే మరొక ప్రధాన ఎగుమతి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా.. కర్నూలులో ఉల్లి సాగు పెరిగితే ఎంతో కొంత కొరతను నివారించవచ్చు. కర్నూలు నుంచి ఉల్లిపాయలు ప్రధానంగా తమిళనాడుకు ఎగుమతి చేస్తారు. -
లసల్గావ్ మార్కెట్‌కు ఢిల్లీ బృందం
పుణే: ఉల్లిపాయల కొనుగోలు కోసం ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లా మార్కెట్‌కు వచ్చింది. జాతీయ రాజధాని నగరంలో కిలో ఉల్లిపాయలు రూ. 90 నుంచి రూ. 100 దాకా పలుకుతుండగా, ఈ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకు లభిస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందం గురువారం నాసిక్ జిల్లాలోని లసల్గావ్ మార్కెట్‌కు వెళ్లింది. దీంతో ఆ మార్కెట్లో సరుకు లభ్యత విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌తో మాట్లాడా. వారి అవసరాలకు అనుగుణంగా ఉల్లిపాయలను కొనుగోలు చేస్తారు’ అని అన్నారు. ‘ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో దేశంలోనే అత్యంత పెద్ద ఉల్లిపాయల మార్కెట్ ఉంది. అక్కడ ఉల్లిపాయలను అక్రమంగా దాచరు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉల్లి పంట దిగుబడి తగ్గిపోయింది. నవంబర్ ఒకటో తేదీకల్లా కొత ్త పంట మార్కెట్‌కు రావడం మొదలవుతుంది. అప్పటినుంచి పరిస్థితి కొంతమేర మెరుగుపడుతుంది’ అని అన్నారు. లసల్గావ్ మార్కెట్‌కు వచ్చే రైతుల కోసం అనేక సౌకర్యాలు కల్పించామని, అందువల్ల ఉల్లిపాయలను అనేకరోజులపాటు నిల్వ ఉంచేందుకు వీలవుతుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బృందానికి కొనుగోలు చేసేందుకు వీలుగా అవసరమైనంతమేర ఉల్లిపాయలను అందుబాటులో ఉంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. -
ధరాఘాతం వెనుక ఉల్లి మాఫియా?
పుణే: ప్రతి గృహిణిని కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరల భాగోతం వెనుక లసల్గావ్లోని హోల్‌సేల్ మార్కెట్లో శక్తివంతమైన వ్యాపారుల మాఫియా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఉల్లి సరఫరా తగ్గినప్పుడు ధరలు పెరిగాయని, అలాగే ఆగస్టు, అక్టోబర్ నెలలో మార్కెట్‌కు ఉల్లి అధికంగా వచ్చినా సమయంలోనూ రేట్లు రెట్టింపయ్యాయని ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. సరఫరా పెరిగినప్పుడు ధర తగ్గాలన్న మార్కెట్ సూత్రాలకు విరుద్ధంగా ఇక్కడ ధర పెరుగుతోందని నిగ్గు తేల్చింది. మహారాష్ట్ర వ్యవసాయ విభాగం నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఆగస్టు నాటికి ఒక లక్ష క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు రావల్సి ఉండగా, అది సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు పెరగడం సహజం. ధరలు పెరుగుతున్నప్పటికీ ఉల్లి గడ్డ నిల్వలను పెంచేందుకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. ఆగస్టు ఒకటిన లసల్గావ్ మార్కెట్లో కిలో ఉల్లిధర రూ.24లు పలికింది. ఆ తర్వాత నిరంతరాయంగా ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో వివిధ మార్కెట్లలో ధరలు పైకి ఎగబాకాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిమాండ్ పెరగడంతో రేట్లు దానంతటవే పెరగాల్సిన పరిస్థితిని ఉల్లి మాఫియా సృష్టించిందని చెప్పాయి. వాస్తవానికి ఆగస్టు 12 తర్వాత లసల్గావ్ మార్కెట్‌కు 25వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చిందని, అప్పుడు ఉల్లి కేజీకి 25లు పలికిందని తెలిపాయి. ముందుగానే రైతుల నుంచి ఉల్లి నిల్వలను తీసుకున్న వ్యాపారులు ధర పెరిగినప్పుడు మార్కెట్లోకి వదిలేవారని పేర్కొన్నాయి. మార్కెట్ సూత్రాలకు విరుద్ధంగా అధిక ఉల్లి సరఫరా ఉన్నప్పుడు ధరలు తగ్గుముఖం పట్టాలి. కానీ వారంలోనే రెండింతలు రూ.47లకు చేరుకునేలా చేశారని తెలియి. అక్టోబర్‌లో ఉల్లి సరఫరా అధికంగానే ఉన్నా ధరలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు సరికదా మరింత పెరిగాయని వెల్లడించాయి. అధిక ధరకు చేరేందుకు మార్కెట్లోకి ఎంత స్థాయిలో ఉల్లిని సరఫరా చేయాలని నిర్ణయించడంలో శక్తివంతమైన వ్యాపారుల ముఠా ప్రధాన పోషించిందని తెలిపాయి. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీలో వివిధ పోస్టుల్లో ఉన్న సొంత పార్టీకే చెందిన నేతలపై కాంగ్రెస్, ఎన్సీపీ అధికార కూటమి చర్యలు తీసుకోలేదని వ్యవసాయ నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ ఉల్లి మాఫియాకు అధికార కూటమితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాగా, రెండు వారాల్లోగా ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. కేజీ రూ.40లకి ప్రజలకు అందుబాటులో ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.