పుణే: ప్రతి గృహిణిని కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరల భాగోతం వెనుక లసల్గావ్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌లో శక్తివంతమైన వ్యాపారుల మాఫియా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఉల్లి సరఫరా తగ్గినప్పుడు ధరలు పెరిగాయని, అలాగే ఆగస్టు, అక్టోబర్ నెలలో మార్కెట్‌కు ఉల్లి అధికంగా వచ్చినా సమయంలోనూ రేట్లు రెట్టింపయ్యాయని ఓ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన పరిశోధనలో తేలింది. సరఫరా పెరిగినప్పుడు ధర తగ్గాలన్న మార్కెట్ సూత్రాలకు విరుద్ధంగా ఇక్కడ ధర పెరుగుతోందని నిగ్గు తేల్చింది. మహారాష్ట్ర వ్యవసాయ విభాగం నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఆగస్టు నాటికి ఒక లక్ష క్వింటాళ్ల ఉల్లి మార్కెట్‌కు రావల్సి ఉండగా, అది సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు పెరగడం సహజం. ధరలు పెరుగుతున్నప్పటికీ ఉల్లి గడ్డ నిల్వలను పెంచేందుకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది.
ఆగస్టు ఒకటిన లసల్గావ్ మార్కెట్‌లో కిలో ఉల్లిధర రూ.24లు పలికింది. ఆ తర్వాత నిరంతరాయంగా ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో వివిధ మార్కెట్లలో ధరలు పైకి ఎగబాకాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిమాండ్ పెరగడంతో రేట్లు దానంతటవే పెరగాల్సిన పరిస్థితిని ఉల్లి మాఫియా సృష్టించిందని చెప్పాయి. వాస్తవానికి ఆగస్టు 12 తర్వాత లసల్గావ్ మార్కెట్‌కు 25వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చిందని, అప్పుడు ఉల్లి కేజీకి 25లు పలికిందని తెలిపాయి. ముందుగానే రైతుల నుంచి ఉల్లి నిల్వలను తీసుకున్న వ్యాపారులు ధర పెరిగినప్పుడు మార్కెట్‌లోకి వదిలేవారని పేర్కొన్నాయి.
మార్కెట్ సూత్రాలకు విరుద్ధంగా అధిక ఉల్లి సరఫరా ఉన్నప్పుడు ధరలు తగ్గుముఖం పట్టాలి. కానీ వారంలోనే రెండింతలు రూ.47లకు చేరుకునేలా చేశారని తెలియి. అక్టోబర్‌లో ఉల్లి సరఫరా అధికంగానే ఉన్నా ధరలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు సరికదా మరింత పెరిగాయని వెల్లడించాయి. అధిక ధరకు చేరేందుకు మార్కెట్‌లోకి ఎంత స్థాయిలో ఉల్లిని సరఫరా చేయాలని నిర్ణయించడంలో శక్తివంతమైన వ్యాపారుల ముఠా ప్రధాన పోషించిందని తెలిపాయి. వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ కమిటీలో వివిధ పోస్టుల్లో ఉన్న సొంత పార్టీకే చెందిన నేతలపై కాంగ్రెస్, ఎన్సీపీ అధికార కూటమి చర్యలు తీసుకోలేదని వ్యవసాయ నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ ఉల్లి మాఫియాకు అధికార కూటమితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కాగా, రెండు వారాల్లోగా ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అన్నారు. కేజీ రూ.40లకి ప్రజలకు అందుబాటులో ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ధరాఘాతం వెనుక ఉల్లి మాఫియా?
Published Fri, Oct 25 2013 11:11 PM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM
Advertisement
Advertisement