సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల నుంచి 173 ఎంబీబీఎస్ సీట్లు నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. మరో 15 బీడీఎస్ సీట్లు కూడా పూల్‌లో చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య విద్య అదనపు జనరల్ కార్యాలయం రాష్ట్రానికి తెలిపింది. రాష్ట్రంలోని 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు, ఒక ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 100 బీడీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం నేషనల్ పూల్‌లోకి వెళ్లాయి. మొదటిసారిగా రాష్ట్రం నేషనల్ పూల్‌లోకి వెళ్లడంతో 173 ఎంబీబీఎస్, 15 బీడీఎస్ సీట్లకు దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడతారు. ఇప్పటికే నీట్ మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కానీ మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి మన రాష్ట్ర వైద్య సీట్లను నేషనల్ పూల్‌లో చేర్చలేదు. తాజాగా చేర్చడంతో వచ్చే నెల 6 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత నీట్ కౌన్సెలింగ్ నాటికి ఆయా సీట్లలో అందరూ పోటీ పడే అవకాశముందని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
4,890 సీట్లు అందుబాటులోకి..
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 32,600 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిల్లో 15 శాతం ప్రకారం 4,890 సీట్లు నేషనల్ పూల్‌లోకి వచ్చాయి. ఆయా సీట్లలో మన రాష్ట్ర విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఏర్పడిందని, ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,100 ప్రభుత్వ సీట్లకే పోటీ పడే తెలంగాణ విద్యార్థులకు, ఇక దేశంలోని దాదాపు 5 వేల నేషనల్ పూల్ సీట్లలో కూడా పోటీ పడే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు.
28 వరకు ఈసెట్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు ఈ నెల 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయినవారు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు(లెటరల్ ఎంట్రీ) నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ సోమ వారం మొదలైంది. 1 నుంచి 6 వేల ర్యాంకు వరకు విద్యార్థులను వెరిఫికేషన్‌కు ఆహ్వానించగా 4,811 మంది హాజరయ్యారని కమిటీ తెలిపింది. నేడు 6,001వ ర్యాంకు నుంచి 14 వేల ర్యాంకు వరకు సర్టి ఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
‘పార్ట్‌టైం’ టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: బీసీ స్టడీ సర్కిల్‌లో పార్ట్‌టైం టీచ ర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.సుజాత తెలిపారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, గ్రూప్–4 వంటి పోటీ పరీక్షలకు సంబంధించి పాఠాలను భోధించడానికి అనుభవం కలిగిన లెక్చరర్లు అర్హులన్నారు. పేపర్–1లో జనరల్ నాలెడ్జ్(కరంట్ ఎఫైర్స్), పేపర్– 2లో మెంటల్ ఎబిలిటీ, వెర్బల్–నాన్ వెర్బల్ తదితర సబ్జెకులను బోధించడానికి ఆసక్తి గల వారు తమ బయోడేటాను bcstudycircle&hyd@yahoo. co.in కు మెయిల్ చేయాలని తెలిపారు. ఈ నెల 28 లోగా అర్హతలు, అనుభవంతో కూడిన సర్టిఫికెట్ల కాపీ లను మెయిల్ ద్వారా పంపాలని సూచించారు.
ఎంపీహెచ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఎంజీఎం: కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ పరిధిలో 2018–19 విద్యాసంవత్సరానికి మాస్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ (ఎంపీహెచ్) కోర్సులో అడ్మిషన్లు స్వీకరించేందుకు సోమవారం వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. వైస్‌చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 29 మధ్యాహ్నం రెండు గంటల నుంచి జూలై 12 సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. అర్హుల జాబితాను జూలై 15న వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను జూలై 16 నుంచి 19 వరకు యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 19న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఫలితాలు 27న విడుదల చేస్తామన్నారు. అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆగస్టు 10న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, 16 నుంచి తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.knruhs.in లో సంప్రదించాలన్నారు.
నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఎస్సీ విద్యార్థులకు ఇవ్వనున్న నీట్‌లాంగ్‌టర్మ్ కోచింగ్ 2018–19 ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం 2 లక్షలలోపు ఉండి, నీట్‌లో 250 మార్కులకు పైగా, తెలంగాణ ఎంసెట్‌లో 80 మార్కులకు పైగా వచ్చిన విద్యార్థులు ఈ కోచింగ్‌కు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు www. tswreis.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
28 నుంచి హాస్టల్ వెల్ఫేర్ దరఖాస్తుల్లో సవరణలు
సాక్షి, హైదరాబాద్: బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో గ్రేడ్–2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో భాగంగా దరఖాస్తు చేసుకున్న కొంత మంది అభ్యర్థుల బయోడేటా వివరాల్లో తప్పులు దొర్లాయని, వాటిని సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు పీడీఎఫ్ రూపంలో ఉండే తమ బయోడేటా వివరాలను సరిచూసుకుని తప్పులు ఉంటే ఈ నెల 28 నుంచి 30 వరకు సవరించుకోవాలని సూచించింది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ద్వారా వాటిని సవరించుకోవాలని పేర్కొంది. రెండు శాఖల్లోని పోస్టులకు వచ్చే నెల 29న ఒకే పరీక్షను(ఉదయం, మధ్యాహ్నం) నిర్వహించనున్నట్లు వివరించింది.
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు 28న వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 28న రెండో దశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10కి వెరిఫికేషన్ ప్రారంభం అవుతుందని పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించింది.
9 నుంచి ఎడ్‌సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం వచ్చే నెల 9 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ వెల్లడించింది. సంబంధిత షెడ్యూల్‌ను త్వరలో జారీ చేస్తామంది. 9 నుంచి విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామని, అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది.
నేడు డీసెట్ ఎడిట్ ఆప్షన్
సాక్షి, హైదరాబాద్: వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకోవడానికి డీసెట్ అభ్యర్థులకు మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని డీసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు http://deecet.cdse.telangana.gov.in లో చూడాలని, సందేహాలకు 6300767628 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment