
దేశవ్యాప్తంగా పరీక్ష రాయనున్న 24 లక్షల మందికి పైగా విద్యార్థులు
557 నగరాలు, పట్టణాలు, దేశం వెలుపల 14 నగరాల్లో నిర్వహణ
మధ్యాహ్నం 2 నుంచి 5.20 గంటల వరకు పరీక్ష
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ–2024)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 557 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
పెన్ అండ్ పేపర్ మోడ్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది, నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు, పలు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
24 లక్షల మందికి పైగా..
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్ యూజీ రాయనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. అయితే గతేడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 42,836 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది 70 వేల మందికిపైగా పరీక్ష రాసే అవకాశం ఉంది.
706 కళాశాలల్లో లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లు
నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా 706 వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం లభిస్తుంది. ఈ కళాశాలల్లో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 5,360 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, పాడేరుల్లో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మరో 500 సీట్లు కొత్తగా సమకూరనున్నాయి.
విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు
∗ పెన్ను, అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకెళ్లాలి.
∗ ఆధార్, పాన్, ఓటరు ఐడీ వంటి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.
∗ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
∗ ఉంగరాలు, చెవి పోగులు, నగలు, ఆభరణాలు వంటివి ధరించకూడదు.
Comments
Please login to add a commentAdd a comment