భారత సరిహద్దుల్లో చొరబాట్లకు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. తాజాగా భారత్- నేపాల్ సరిహద్దు దగ్గర ఇద్దరు చొరబాటుదారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లోని నేపాల్ సరిహద్దులో ఇద్దరు చైనా పౌరులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరూ నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారన్నారు. వీరిని గుర్తించిన భారత సైన్యం, సిద్ధార్థనగర్ పోలీసుల బృందం వారిని పట్టుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌ఎస్‌బీ, సిద్ధార్థనగర్ పోలీసుల బృందం మార్చి 26న చైనాకు చెందిన ఓ పురుషునితో పాటు మహిళను అరెస్టు చేసింది. పోలీసు అధికారులు వారిని తనిఖీ చేశారు. వారి నుంచి రెండు చైనీస్ పాస్‌పోర్ట్‌లు, నేపాల్‌కు చెందిన టూరిస్ట్ వీసా, రెండు మొబైల్ ఫోన్లు, రెండు నేపాలీ సిమ్ కార్డులు, రెండు చైనీస్ సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిద్ధార్థనగర్ ఏఎస్పీ సిద్ధార్థ్ సింగ్ తెలిపారు. భారత్- నేపాల్‌లు మొత్తం 1751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రేఖను పంచుకుంటాయి. ఈ సరిహద్దు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింల మీదుగా కొనసాగుతుంది. భారత్ ఈ సరిహద్దులో 455 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment