లోక్‌సభ
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రాభవాన్ని క్రమక్రమంగా కోల్పోతున్నారు. ఒక ఎన్నికల నుంచి మరో ఎన్నికలకు వచ్చే సరికి గెలిచే ఇండిపెండెంట్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అటు లోక్‌సభ ఎన్నికల్లో, ఇటు శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రుల సీట్లతో పాటు వారి ఓట్ల శాతం కూడా క్షీణిస్తోంది. ఇటీవల కర్ణాటకలో 222 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఇండిపెండెంట్ గెలుపొందాడు. ఆరు దశాబ్దాలకు పైబడిన ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యల్పం.. 2013 శాసనసభలో 9 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. 2018 ఎన్నికల్లో ఈ ఎనిమిది మంది కూడా ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థుల చేతుల్లో ఓటమి చవి చూశారు. ఒక సిట్టింగ్ ఇండిపెండెంట్ మాత్రం మరో స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడాడు.
కర్ణాటకలో పోటీచేసిన ఇండిపెండెంట్ అభ్యర్థులు సీట్లతో పాటు ఓట్ల వాటా కూడా గణనీయంగా కోల్పోయారు. మొత్తం 1,129 మంది స్వతంత్రుల ఓట్ల వాటా ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తక్కువ అంటే 3.9 శాతంగా నమోదైంది. గత ఎన్నికల్లో స్వతంత్రుల ఓట్లవాటాతో పోల్చితే ఇది సగం మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను బట్టి తెలుస్తోంది. 1957లో కర్ణాటక మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 35 మంది స్వతంత్రులు గెలిచారు. 1967లో జరిగిన ఆ రాష్ట్ర మూడో ఎన్నికల్లో అత్యధికంగా 41 మంది విజయం సాధించారు.
మొత్తం 331 ఇండిపెండెంట్లు పోటీచేయగా, వారి ఓట్లవాటా కూడా అత్యధికంగా 28 శాతంగా నమోదైంది. అయితే క్రమేణా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ, వారికొచ్చే ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. గెలిచే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా దిగజారింది. ఇది ఒక్క కర్ణాటకకే పరిమితం కాలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయపార్టీల అధిపత్యం (జాతీయ, ప్రాంతీయపార్టీలు) పెరుగుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా స్వతంత్రులకు రాజకీయ అవకాశాలు సన్నగిల్లుతున్నాయని రాజకీయపరిశీలకులు అంచనా వేస్తున్నారు.
11 రాష్ట్రాల్లో అతి తక్కువగా ఇండిపెండెంట్లు...
ప్రస్తుతం దేశంలోని 11 రాష్ట్రాల శాసనసభల్లో స్వతంత్రుల సీట్ల వాటా తక్కువగా నమోదు కాగా...22 రాష్ట్రాల అసెంబ్లీలలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్ల వాటా అత్యల్పంగా రికార్డయిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, బిహార్, అస్సాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి అతి తక్కువ మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అదేవిధంగా రాజస్థాన్, జమ్మూ, కశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, సిక్కిం, మిజోరాం, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు అభ్యర్థుల ఓట్ల వాటా గణనీయంగా తగ్గిపోయింది.
ప్రస్తుత లోక్‌సభలో ముచ్చటగా ముగ్గురే...
ప్రస్తుత లోక్‌సభలో కేవలం ముగ్గురే ఇండిపెండెంట్ ఎంపీలున్నారు. 1991లో జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక స్వతంత్ర ఎంపీ గెలుపొందాడు. అప్పటి నుంచి (1991) ఈ సంఖ్య కొంచెం అటు ఇటుగా ఉంటోంది. 1957లో జరిగిన రెండో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 42 మంది ఎంపీలు ఏ పార్టీకి చెందనివారు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనే స్వతంత్ర అభ్యర్ధులు అత్యధికంగా 19.3 శాతం ఓట్ల వాటాను సాధించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా గెలుపొందడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయాన్ని స్వతంత్ర ఎన్నికల పర్యవేక్షణ సంస్థ ప్రజాస్వామిక సంస్కరణల సంఘం(ఏడీఆర్) వ్యవస్థాపకుడు జగదీప్ చొక్కార్ వెలిబుచ్చారు. రాజకీయపార్టీల అభ్యర్థులకు అందుబాటులో ఉన్నన్ని వనరులు ఇండిపెండెంట్లకు లేక పోవడమే ప్రధాన కారణం. వీరిమధ్య వనరులకు సంబంధించిన అంతరం చాలా ఎక్కువగా ఉంటోంది. ఎన్నికల్లో చేస్తున్న వ్యయం కూడా గణనీయంగా పెరగడంతో స్వతంత్రులుగా పోటీ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. పోటీ చేసిన వారిలోనూ గెలిచే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఈ విధంగా రాజకీయ వ్యవస్థపై రాజకీయపార్టీల పట్టు పెరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment