
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరికొందరు రేపు(మంగళవారం) ప్రమాణం చేయనున్నారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రమాణం చేశారు. ఇంగ్లీషులో పీవీ మిథున్ రెడ్డి, తెలుగులో గురుమూర్తి , హిందీలో డాక్టర్ గుమ్మ తనూజరాణి ఎంపీలుగా ప్రమాణం చేశారు.
కాగా, బుధవారం లోక్‌సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
ప్రత్యేక హోదాపై గళం విప్పుతా..: గురుమూర్తి, తిరుపతి ఎంపీ
వైఎస్ జగన్ ఆశీస్సులు, తిరుపతి ప్రజల మద్దతుతో రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందంగా ఉంది. పులికాటు సరస్సు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు తీసుకురావడం నా ప్రాధాన్యత. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఉన్నా టీడీపీ అడగకపోవడం బాధాకరం. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై పార్లమెంట్‌లో గళం విప్పుతా.. ఈ ఐదేళ్లు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాం
వైద్య సదుపాయాలు కోసం కృషి చేస్తా: గుమ్మ తనూజరాణి, అరకు ఎంపీ
నాకు అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు. అరకు పార్లమెంట్‌లో వైద్య సదుపాయాలు, రోడ్లు మెరుగుపరచడానికి కృషి చేస్తా. వైఎస్సార్‌సీపీ కండువాతో ప్రమాణ స్వీకారం చేశా. నేను పార్టీ మారి ప్రసక్తే లేదు. ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ తోనే కలిసి ప్రయాణం చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment