చాడ వెంకటరెడ్డి
మంకమ్మతోట(కరీంనగర్) : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా జిల్లాకు చెందిన చాడ వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రం కొల్లంలో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఈనెల 25 నుంచి 29వరకు సీపీఐ జాతీయ మహాసభలు నిర్వహించిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఐ ప్రథమ మహాసభలను 2015 మార్చిలో ఖమ్మంలో ఏర్పాటు చేసింది.
ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా మొదటిసారిగా ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవమయ్యారు. అలాగే 2016 నవంబర్‌లో వరంగల్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభలో చాడను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రెండో రాష్ట్ర మహాసభల్లో రెండోసారి కూడా రాష్ట్ర కార్యదర్శిగా చాడను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు.
రాజకీయ ప్రస్థానం..
చాడ వెంకటరెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి జిల్లాలోని రేకొండ. 40 ఏళ్లుగా ఆయన రాజకీయంలో కొనసాగుతున్నారు. 1981లో రేకొండ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987 నుంచి వరుసగా మూడుసార్లు చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేమండలం నుంచి ఒక్కసారి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. సీపీఐ తాలుకా కార్యదర్శి నుంచి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు.
2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ తరఫున శాసనసభపక్ష నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూనే.. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. చాడ ఎన్నికపట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment