ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక ఉంటే చాలు వయసు ఏ మాత్రం అడ్డంకి కాదు. అదే నిరూపించింది 80 ఏళ్ల బామ్మ. లేటు వయసులో స్విమ్మింగ్ నేర్చుకుని ఎన్నో పతకాలు సాధించింది. అతేగాదు నృత్యకారిణిగా కూడా రంగ ప్రవేశం చేసి ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్ధురాలిగా పేరు తెచ్చుకుంది. జీవితంలో కష్టాలు మాములే వాటిని పక్కన పెట్టి మంచిగా ఆస్వాదించడం తెలిస్తే హాయిగా జీవించొచ్చు అంటోంది ఈ బామ్మ. ఎవరీమె? రెస్ట్ తీసుకునే వయసులో మెరుపుతీగలా పతకాలు సాధిస్తూ.. దూసుకుపోతున్న ఆమె నేపథ్యం ఏంటంటే..
గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల బకులాబెన్ పటేల్ అనే బామ్మకి ఒకప్పుడు నీళ్లంటే చచ్చేంత భయమట. కానీ ఇప్పుడు గజ ఈతగాడి మాదిరి అలవోకగా ఈత కొట్టేస్తోంది. 58 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం ప్రారంభించిందట. మొదట్లో విభిన్న అథ్లెటిక్ క్రీడలు ప్రయత్నిస్తూ..చివరికి ఈత నేర్చుకోవాలని నిర్ణయం తీసుకుందట. అలా ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈతల పోటీల్లో పాల్గొని ఎన్నో పతాకాలు, సర్టిఫికేట్‌లు సాధించింది.
ఈ పోటీల నేపథ్యంలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ఆస్ట్రేలియా వంటి 12 దేశాల్లో జరిగే టోర్నమెంట్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అంతేగాదు ఆ బామ్మ పేరు మీదుగా ఏకంగా తొమ్మిది అంతర్జాతీయ పతకాలు, దాదాపు 500కి పైగా సరిఫికేట్‌లు ఉన్నాయి. అంతేగాదు 400 మందికి పైగా స్విమ్మర్‌లకు శిక్షణ కూడా ఇచ్చింది.
అలాగే ప్రపంచంలో అత్యంత సవాలుతో కూడిన సముద్రాలు, నదులను కూడా ఈదేసింది. అత్యంత కష్టమైన కెనడియన్ సముద్రంలో కూడా అలవోకగా రెండుసార్లు స్విమ్ చేసింది. అంతేగాదు ఏదో ఒక రోజు ఇంగ్లిష్ ఛానెల్‌ను కూడా జయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పాలని భావిస్తోంది బకులాబెన్. దీంతోపాటు ఏడు పదుల వయసులో భరతనాట్య నృత్యకారిణిగా రంగప్రవేశం చేసింది. పైగా ఆరంగేత్రం ప్రదర్శించిన అత్యంత వృద్దురాలిగా నిలవడమే గాక ఉత్తమ నృత్యకారిణిగా ప్రశంసలందుకుంది.
ఇక బకులాబెన్ నేపథ్యం వచ్చేటప్పటికీ..ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 13వ ఏటనే వివాహం చేసుకుని ఇద్దర పిల్లలకు తల్లి అయ్యింది. అయితే కొంతకాలనికే భర్త మరణించడంతో ఒంటిరిగా పిల్లలను పోషించుకుంటూ బతికింది. వాళ్లు పెద్దవాళ్లై మంచి పొజిషన్‌లో సెటిల్ అవ్వడంతో మళ్లీ ఆమె జీవితం శూన్యంతో నిశబ్దంగా ఉండిపోయింది.
దీన్నుంచి బయటపడేలా ఆమె తన దృష్టిని క్రీడలవైపుకి మళ్లించింది. అలా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి క్రీడాకారిణిగా ఎన్నో విజయాలు సాధించింది. తాను ఏ రోజుకైనా దేశం గర్వపడేలా విజయం సాధించి, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవాలనేది ప్రగాఢమైన కోరికట ఆమెకు.
Comments
Please login to add a commentAdd a comment