ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రెండు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. వీటిలో ఒకటి బద్రీనాథ్ జాతీయ రహదారిలోని జోషిమఠ్‌లో, మరొకటి పాతాళగంగ ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. దీంతో ఈ రెండు మార్గాల్లో వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. అయితే తాజాగా చార్‌ధామ్ యాత్రికుల కోసం పాతాళగంగ రహదారిని క్లియర్ చేశారు. దీంతో 40 గంటల తరువాత ఈ రహదారిలో వెళ్లేవారికి ఉపశమనం లభించినట్లయ్యింది. జోషిమఠ్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన రహదారి ప్రాంతాన్ని ఇంకా క్లియర్ చేయలేదు.
48 గంటలు గడిచినా జోషిమఠ్-బద్రీనాథ్ హైవేలో ఇంకా వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడటంతో, బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్ మొదలైన ప్రాంతాల మధ్య కనెక్టివిటీ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్‌ధామ్ యాత్రికులు పలు అవస్థలు పడుతున్నారు.
రెండు వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ హైవేపై చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు జోషిమఠ్‌లో రహదారిని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో 260కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. వాటిపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేసేందుకు 241 జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment