కూటమి ప్రజా ప్రతినిధుల పోకడలపై టీడీపీ సర్వే
ప్రజలకు ఐవీఆర్‌ఎస్ ఫోన్ కాల్స్
చినబాబు టీమ్ పనేనంటూ జనసేన, బీజేపీ నేతల రుసరుసలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే మంత్రుల పనితీరుపై సర్వేకు ఉపక్రమించిన టీడీపీ కూటమి సర్కారు తాజాగా ఎమ్మెల్యేల పని తీరుపై కూడా ఆరా తీస్తోంది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్‌ఎస్) ద్వారా ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆర్నెళ్లలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటూ వాకబు చేస్తున్నారు. బాగుంటే ఒకటి.. ఫరవాలేదు అయితే రెండు.. బాగోలేకుంటే మూడు నొక్కాలని సూచిస్తూ సమాచారం సేకరిస్తున్నారు.
గతంలో ఇదంతా టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకే పరిమితం కాగా తాజాగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా సాగుతుండటం గమనార్హం. ఈ ఫోన్ కాల్స్ అన్నీ మంగళగిరి కేంద్రంగా టీడీపీ కార్యాలయం నుంచి వస్తున్నట్లు భావిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేకు పరిమితం కాకుండా తమపై టీడీపీ పెత్తనం ఏమిటంటూ జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
కూటమి నేతలను కట్టడి చేసేందుకేనా...!
ఎమ్మెల్యేల పనితీరుపై మదింపు పేరుతో జరుగుతున్న ఈ సర్వే బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలను కట్టడి చేసేందుకేననే ప్రచారం జరుగుతోంది. ‘మా పనితీరును మా అధినేతలు గమనిస్తుంటారు. ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే వారు చెప్పాలి.
అంతేగానీ జాతీయ పార్టీ అయిన మాపై ప్రాంతీయ పార్టీ అధినేత ఎలా సర్వే చేస్తారు? మాపై టీడీపీ పెత్తనం ఏమిటి?’ అని బీజేపీకి చెందిన కొందరు నేతలు రుసరుసలాడుతున్నారు. జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ వ్యవహారంపై రగిలి పోతున్నట్లు తెలుస్తోంది.
జైన్ ఇన్‌ఫ్రా నంబర్లతో...
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల పనితీరుపై వివిధ నంబర్లతో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇవన్నీ మంగళగిరికి చెందిన జైన్ ఇన్‌ఫ్రా పేరుతో ఉండగా ఆ చిరునామాతో వివరాలు అందుబాటులో లేవు. 86453 సిరీస్ నుంచి కాల్స్ వస్తున్నాయి.
ట్రూ కాలర్‌లో పరిశీలిస్తే... జైన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ (టీడీపీ ఆఫీస్) మంగళగిరి అని కనిపిస్తోంది. నారా లోకేష్ కార్యాలయం నుంచే ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొంటున్నారు. లోకేష్ కార్యాలయం కేంద్రంగానే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయని, ఈ సర్వే కూడా ఆయన టీమ్ నిర్వహిస్తోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment