ఏపీలో సాక్షి, మరికొన్ని ఛానళ్ల శాశ్వత నిరోధానికి యత్నం
సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధం
కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలి
ట్రాయ్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఒత్తిళ్లతో మీడియా ప్రసారాలు నిలిపివేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పలు వార్తా ఛానళ్ల ప్రసారాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆ పార్టీ యత్నిస్తోందని పేర్కొంది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి, విధానపరమైన సమ్మతిలేకుండా అధికార టీడీపీ ఒత్తిళ్ల కారణంగా సాక్షి, టీవీ–9.. ఎన్టీవీ, 10టీవీల ప్రసారాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ తీర్మానం చేసినట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కు మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్. నిరంజన్‌రెడ్డి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్, ప్రమోషన్–2019 2ఎస్‌సీసీ 104 కేసులో సుప్రీంకోర్టు ఎయిర్‌వేవ్, ఫ్రీక్వెన్సీలు పబ్లిక్ ప్రాపర్టీగా తన తీర్పులో పేర్కొందని, తద్వారా వాటిని వినియోగించుకోవడం ప్రతీ పౌరుడి హక్కు అనే విషయాన్ని ట్రాయ్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. చట్టానికి లోబడి సహేతుకమైన ఆంక్షలు విధించొచ్చని, అయితే ఎలాంటి కారణాలు లేకుండా ఏజెన్సీలు ఛానెళ్లను ఏకపక్షంగా తొలగించడం ఉల్లంఘన కిందకి వస్తుందని ఆయన స్పష్టంచేశారు. ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయనే విషయాన్ని ఫిర్యాదులో ఉటంకించారు.
నోటీసు ఇవ్వకుండా సిగ్నల్ ఆపకూడదు..
ప్రతిపాదిత డిస్‌కనెక్షన్‌కు కారణాలు స్పష్టంగా పేర్కొంటూ ప్రభావిత సర్వీస్ ప్రొవైడర్‌కు కనీసం మూడు వారాల నోటీసు ఇవ్వకుండా ఏ సర్వీస్ ప్రొవైడర్ టెలివిజన్ ఛానళ్ల సిగ్నల్‌ను డిస్‌కనెక్ట్ చేయరాదని 2017 నిబంధనల్లోని 17వ నిబంధన స్పష్టంచేస్తోందని.. కానీ, ప్రస్తుతం ఏపీలో ఈ నిబంధన తుంగలో తొక్కారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నూతంగా ఏర్పాటవుతున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం పలు వార్తా ఛానళ్లపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. నోటీసు జారీచేయకుండానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం ఏపీలో కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రంపై ప్రత్యక్షంగా దాడిచేసినట్లేనన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించే వార్తా ఛానళ్లను ఏకపక్షంగా నిరోధించడం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై స్వతంత్ర నివేదికలు, విమర్శనాత్మక విశ్లేషణలు అందించే ప్రతికా స్వేచ్ఛను హరిస్తున్నారని నిరంజన్‌రెడ్డి ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ తరహా జోక్యం ప్రతికా స్వేచ్ఛను నిరుత్సాహపరచడమేనని.. ఇది పాత్రికేయ స్వేచ్ఛను అణచివేయడమేనన్నారు.
పౌరులకు భిన్నమైన, అవసరమైన సమాచారం అందించే అవకాశం మీడియా కోల్పోతుందన్నారు. ఛానెళ్లు మ్యూట్ చేయడమంటే అసమ్మతి గళం సహించబోమనే సందేశం ప్రజల్లోకి పంపుతోందన్నారు. దీనిద్వారా జర్నలిస్టులు, మీడియా సంస్థలు వివాదాస్పద అంశాలు కవర్ చేయడం తగ్గుతుందని, కేవలం ప్రభుత్వ అనుకూల కథనాలే ప్రసారమవుతాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ తరహా చర్యలవల్ల ప్రతికా స్వేచ్ఛపై పడే ప్రభావాలను ట్రాయ్ తక్షణమే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి కోరారు.
సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి..
ఇక ట్రాయ్ నిబంధనలు అమలుచేయడంతోపాటు ప్రభుత్వ ప్రభావం నుంచి మీడియాను రక్షించడానికి నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్ల అసోసియేషన్ న్యూస్ ఛానళ్లను అక్రమంగా బ్లాక్ చేయడంపై సమగ్ర విచారణ జరపాలని, ట్రాయ్ 2017 నిబంధనల్లోని 17వ నిబంధన ఉల్లంఘించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రెస్ స్వతంత్ర సూత్రాలను సమర్థించి మీడియా, బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్‌లపై ప్రభుత్వ ప్రభావం లేకుండా చూడాలని ఆ ఫిర్యాదులో నిరంజన్‌రెడ్డి కోరారు. తన ఫిర్యాదులోని అంశాన్ని అత్యవసరంగా తీసుకుని వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment