మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకోవడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకయ్యే ఖర్చులు తానే భరించనుంది. జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేట్ రెసిడెన్సియల్ అత్యుత్తమ పాఠశాలల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశం కల్పించనున్నారు. ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే గిరిజన శాఖ జారీ చేయగా, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే నవోదయ, మోడల్, గురుకులం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో వివిధ వర్గాల్లోని పేద కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యతోపాటు వసతి కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది. అయినప్పటికీ కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో చదవాలని ఆశ ఉండి, ప్రభుత్వ సంస్థల్లో ప్రవేశం లభించని విద్యార్థులకు అన్ని ఖర్చులు భరిస్తూ చదివించాలనే ఆశయంతో విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశం కల్పించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో జిల్లాలోని గిరిజన, షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేటు రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదవనున్నారు. ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థి ఇతర విద్యార్థులతో కలిసి సమానంగా చదువు నేర్చుకుంటాడు.
ఎంపిక ఇలా..
జిల్లాలోని గిరిజన విద్యార్థులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎంపిక ప్ర క్రియ నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఎంపిక ప్ర క్రియ ప్రారంభించారు. ఎస్సీ విద్యార్థులకు జిల్లా సాంఘిక సం క్షేమ శాఖ అధికారులు ప్రవేశ భాధ్యతలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు శుక్రవారం జారీ అయ్యాయి. ఎంపికైన పాఠశాలల్లో ఉన్న ఖాళీల ఆధారంగా విద్యార్థులను చేర్చుకుం టారు. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఏటా ప్రవే శం ఉంటుంది. దర ఖాస్తు చేసుకున్న విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, ప్రవేశం కల్పిస్తారు. ఒకసారి చేరిన విద్యార్థికి పదో తరగతి వరకు ఉచితంగా విద్యాభ్యాసం అందిస్తారు.
సౌకర్యాలు
జిల్లాలో ఎంపికైన రెసిడెన్సియల్ ప్రైవేటు పాఠశాలల్లో చేరిన ప్రతీ విద్యార్థికి చదువుతోపాటు వసతి, భోజనం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. వీటితోపాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫాం, ట్రంక్ పెట్టె, పల్లెం, గ్లాసు, దుప్పటి, సబ్బులు, ధోబీ, మంగళి ఖర్చులనూ సంబంధిత శాఖల అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు అందజేస్తారు. పాఠశాలలో చేరిన విద్యార్థి ఒక్క పైసా కూడా చెల్లించకుండానే కార్పొరేటు విద్య అభ్యసిస్తాడు.
అవకాశం ఎందరికీ..?
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం 12 పాఠశాలలను ఎంపిక చేశారు. గిరిజన విద్యార్థుల్లో సుమారు 200 మంది ఏటా ప్రైవేటు పాఠశాలల్లో చేరనున్నారు. ఎస్సీ విద్యార్థుల సంఖ్య 100కే పరిమితం చేశారు. ఒక్కో విద్యార్థికి సగటున రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ప్రభుత్వం వెచ్చించనుంది.
పేదలకు కార్పొరేట్ విద్య
Published Mon, May 26 2014 12:54 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement