సాక్షి, కర్నూలు: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగా మారింది. ఈ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించినా పరిస్థితిలో మార్పు కరువైంది. తామెలాగూ చదువుకోలేకపోయాం.. కనీసం బిడ్డలనైనా ఉన్నతంగా తీర్చిదిద్దాలని భావించే గ్రామీణులకు, అత్తెసరు జీతాలతో దుర్భర జీవితం తమతోనే ముగిసిపోవాలని.. పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చాలని తలిచే మధ్య తరగతి తల్లిదండ్రులకు ‘కార్పొరేట్’ తీరు నిరాశ మిగులుస్తోంది. సర్కారు పాఠశాలల్లో సౌకర్యాలు వెక్కిరిస్తుండగా.. ఆర్థిక స్థోమత లేకపోయినా పిల్లలను ప్రతి ఒక్కరూ ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇదే అదనుగా యాజమాన్యాలు ఫీజుల రూపంలో చుక్కలు చూపుతున్నాయి. ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో కేజీ నుంచి పదో తరగతి వరకు 25 శాతం సీట్లను పేద పిల్లలకు కేటాయించాలనేది విద్యా హక్కు చట్టంలోని నిబంధన. గత ఏడాది ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మొట్టికాయలు వేసింది. ఏడాదిన్నర గడచినా కేంద్రం తీరులో మార్పు కరువైంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పును పెడచెవిన పెట్టి ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ ఇప్పటికే సీట్లన్నీ భర్తీ చేసేశాయి.
ఈనెల 12 నుంచి 2014-15 విద్యా సంవత్సరం మొదలైంది. అంతకు ముందే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ యథావిధిగా నిర్దేశించిన ఫీజులను సీట్లను భర్తీ చేయడం గమనార్హం. ఇందులో ఏ ఒక్క నిరుపేద విద్యార్థికి ఉచితంగా సీటు కల్పించిన దాఖలాల్లేవు. కేంద్ర ప్రభుత్వ నాన్చుడు ధోరణే ఇందుకు కారణమని విద్యారంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్రం స్పందించి మార్గదర్శకాలు జారీ చేస్తే జిల్లాలోని వేలాది మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. గత ఏడాది గుర్తింపు పొందిన పాఠశాలల సంఖ్య జిల్లాలో 1300 పైమాటే. వీటిలో 25 శాతం సీట్లు పేదలకు కేటాయిస్తే పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాట వేసినట్లవుతుంది.
ఒక్కో పాఠశాలలో కనీసం 20 మంది పిల్లలకు అవకాశం కల్పించినా 26వేల మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. జిల్లా విద్యా శాఖ అధికారులు.. పాఠశాలల యాజమాన్య కమిటీ సమక్షంలో విద్యార్థుల ఎంపిక చేయాల్సి ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీచేసింది. ఇదే సమయంలో మిగతా పిల్లలతో పాటు వీరినీ సమానంగా కూర్చోబెట్టి అన్ని రకాల వసతులు కల్పించాలని ఆదేశించింది. అప్పటి తీర్పు తల్లిదండ్రుల్లో ఆనందం నింపింది.
తమ పిల్లలకు ప్రైవేట్ విద్యను అభ్యసించే భాగ్యం లభించనుందని సంబరపడ్డారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఎత్తుగడల ముందు వారి ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇదిలాఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తన ప్రసంగంలో ‘పేద పిల్లలు ఆకలితో ఏడుస్తూ నిద్రలోకి జారుకోవడం ఆమోదయోగ్యం కాదు.. ప్రభుత్వం సంపన్నుల కోసం కాదు.. పేదల కోసమే పనిచేయాలి’ పలికిన మాటలు నిరుపేదల్లో ఆశలను చిగురింపజేశాయి. విద్యా హక్కు చట్టం అమలులో కనీసం మోడీ ప్రభుత్వమైనా ఒక అడుగు ముందుకేస్తే ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
మేమింతే!
Published Sat, Jun 14 2014 2:08 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement