- నిస్వార్థంతో పనిచేసే పాలకులు రావాలి..
- ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం కావు
- ఈటెల రాజేందర్ స్పష్టీకరణ
కవాడిగూడ,న్యూస్‌లైన్: రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన గొప్ప మార్పులురావని..త్యాగం,అంకితభావం, నిస్వార్థం కలిగిన పాలకులు వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కనీసం 5 ఏళ్ల సమయం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య రద్దు, కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఉపాధ్యాయ భేరి ఆదివారం ఇందిరాపార్కు వద్ద జరిగింది.
దీన్ని ప్రొ.కేశవరావు జాదవ్ ప్రారంభించగా, ముఖ్యఅతిథులుగా ఈటెల రాజేందర్, టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రజాగాయకులు గద్దర్, గోరెటి వెంకన్న, విమలక్క, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్రనేత గోవర్దన్ తదితరులు హాజరయ్యారు. ఈటెల ఈసందర్భంగా మాట్లాడారు. ‘మాటలు చెప్పడం వేరు, పాలనచేయడం వేరు. తెలంగాణను పాలించే వారికి త్యాగం,అంకితభావం, నిస్వార్థం కలిగిన పాలకులు రావాలి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఏడాదిలో పరిష్కారమవుతాయని అనుకోవడం లేదు.
దాదాపు ఐదేళ్లు పాలిస్తే తప్ప సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సామాజిక చైతన్యాన్ని అందించిన ఉద్యమస్ఫూర్తితో నవతెలంగాణను నిర్మించుకుందామని’ పిలుపునిచ్చారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వశాఖల్లో 70 శాతానికిపైగా ఉద్యోగులు సీమాంధ్రులే ఉన్నారని, జనాభా నిష్పత్తి లెక్కన ఉద్యోగులను విభజిస్తే తెలంగాణ రాష్ర్టంలో మళ్లీ సీమాంధ్ర ఉద్యోగులే ఆధిపత్యం చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీటీఎఫ్ అధ్యక్షుడు రాములు, ప్రధానకార్యదర్శి రఘునందన్, ప్రొ.తిరుమలి, వేద కుమార్, జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకులు గద్దర్, గోరటి వెంకన్న, విమలక్క, పైలం సంతోష్, అరుణోదయ కళాకారులు పాడిన పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి.