మెదక్: కార్పొరేట్ విద్య కాలకూట విషమని, ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు వేస్తాయని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో జరిగిన ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్పొరేట్ విద్య.. పాలబుగ్గల చిన్నారుల మెదడుపై మోయలేని భారాన్ని మోపుతోందన్నారు. విద్యార్థికి పాఠశాల, ఇల్లు తప్ప మరేవీ తెలియని పరిస్థితి నెలకొంటోందన్నారు. రాన్రాను విద్యార్థి ఆట పాటలకు.. ప్రాపంచిక జ్ఞానానికి...పల్లె వాతావరణాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరికొన్ని రోజులైతే గేదెలను సైతం జూకెళ్లి చూపించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని అన్నారు. భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచానికే మార్గదర్శకులన్నారు. గ్రామీణ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరి హృదయాలను పులకింపజేశాయన్నారు. ఇన్‌స్పైర్‌లో వారు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు శాస్త్రవేత్తలనే అబ్బురపరిచేవిగా ఉన్నాయన్నారు. మెతుకుసీమ బిడ్డలు మట్టిలో మాణిక్యాలని కొనియాడారు. తెలంగాణ ముద్దుబిడ్డ డీఈఓ రాజేశ్వర్‌రావు ఇంతకాలం ఆంధ్రాలో పనిచేశారని, ఆయన మెతుకుసీమకు బదిలీపై రావడంతో ఈరోజు ఇన్‌స్పైర్‌ను ఇంత ఘనంగా నిర్వహించగలుగుతున్నామన్నారు. ఇందుకు కృషిచేసిన ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్‌లో సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇన్‌స్పైర్‌లో విజేతలైన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. సైన్స్‌ఫెయిర్‌ను తిలకించేందుకు 124 పాఠశాలకు చెందిన విద్యార్థులు రావడం గమనార్హమన్నారు.
డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ గత మూడు ఇన్‌స్పైర్ ప్రోగ్రాంలలో 4,046 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డాక్టర్ సురేందర్ మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరంలో ఇన్‌స్పైర్‌ను మెదక్‌లో నిర్వహిస్తే లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. విజేతలైన 75 మంది విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగిఅశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మికిష్టయ్య, కౌన్సిలర్లు మాయ మల్లేశం, డిప్యూటీ ఈఓలు శోభ, పోమ్లా నాయక్, మోహన్, డైట్ ప్రిన్సిపాల్ రమేష్, ఎంఈఓలు నరేష్, నీలకంఠం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మెదక్ రూరల్: ఇన్‌స్పైర్ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం విద్యార్థుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. విద్యార్థులు చేసిన వివిధ నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పట్టణంలోని సిద్దార్థ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శ్రీనిజ చేసిన భరతనాట్యం మంత్రముగ్దుల్ని చేసింది. నెత్తిన బోనాలు పెట్టి, పల్లెంపై నిలబడి, రెండు చేతుల్లో జ్యోతులను వెలిగించి ఆమె చేసిన నృత్యం ఔరా అనిపించింది. పాపన్నపేటకు చెందిన తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థినులు పాడిన పాటపై చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రభుత్వ పాఠశాలలే ప్రగతికి సోపానాలు
Published Sat, Sep 20 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM
Advertisement
Advertisement