యువతా.. మీ చేతిలోనే దేశ భవిత
చుట్టూ చీకటి...దారీతెన్నూకానరావడంలేదు....నిస్సత్తువ, నిరాశనిస్పృహ చుట్టముట్టిన వేళ. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఇలా ఏం చేద్దామన్నా అందుబాటులేని పరిస్థితి. అగమ్యగోచరంగా కొట్టుమిట్టాడుతున్న యువత. పేదలకు అందని ద్రాక్షలా విద్య, ఎవరికీ దొరకని ఉపాధి...నిరుద్యోగం తాండవించడంతో చదువుకున్న యువత కూలీలా మారి వలసపోయే దుస్థితి.
ఇదంతా చంద్రబాబు పాలనలో 2004 సంవత్సరం ముందు పరిస్థితి. ఇన్ని సమస్యలు యువతను ఉక్కిరిబిక్కిరి చేసే సమయంలో ఆశాకిరణం మెరిసింది. రాజశేఖర రెడ్డి రూపంలో వారికి ఆధారం దొరికింది. పేదలు పెద్ద చదువులు చదివేందుకు, కార్పొరేట్ విద్య అభ్యసించేందుకు ఆయన నడుంబిగించారు. స్కాలర్ షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సీట్లు, ప్రత్యేక మేళాల ద్వారా ఉపాధి కల్పనతో వారిని ఆదుకున్నారు. దీంతో యువకుల తల్లిదండ్రుల కళ్లల్లో ఇంద్ర ధనసులు విరబూశాయి.
ఎంతో మంది పేద విద్యార్థులు ఇంజినీర్లుగా, డాక్టర్లుగా తయారయ్యారు. మహానేత మరణానంతరం పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల మంజూరు సక్రమంగా సాగక కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధించడం ప్రారంభించారు.
నిబంధనల పేరుతో చాలా మంది విద్యార్థులకు వీటిని మంజూరు చేయడం నిలిపివేశారు. పాలకులు రాష్ట్రాన్ని విభజించి విద్య,ఉద్యోగావకాశాలను దెబ్బతీశారు. రెండు ప్రాంతాల విద్యార్థులు, యువకుల మధ్య చిచ్చురేపారు. చేతికి అందివచ్చిన తమ సంతానం ఉద్యమాలకోసం బలిదానమవడంతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.
ఒక్క మంచి నేత మనమధ్యలేకపోవడంతో రాష్ర్టం అతలాకుతలమైంది. యువతను మళ్లీ పాత బాధలు చుట్టుముట్టాయి. ఇటువంటి తరుణంలో యువత మేలుకోవాలి. సమాజం మేలుకోరాలి. యువత అంటే నవ చైతన్యం, సమాజ భవితవ్యం అందుకే యువకులే నవ సమాజ సారథలు కావాలి, రాష్ర్ట పునర్నిర్మాణంలో ముందుండాలి. తిమిరసంహారానికి అరమరికలు లేని నేతలు అవసరం. సత్తువ చచ్చి, కీళ్లు వదిలిన నేతలను, పాత కుళ్లును కడిగేయాలి.
ధైర్యమున్న యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగిం చాలి. నడుము వంగిన శకుని మామలు, వారి కుటిల గురువులపై ప్రళయకాల గర్జనలై విజృంభించాలి. ఈ సమరంలో ఉడుకు రక్తానికి కావాలి ఓటు ఆయుధం...ఆ ఆయుధమే ఇస్తుంది మీకు నాయకత్వం.
మన చిన్నప్పుడు పాఠశాల స్థాయిలో చదివాం.. భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని! కళాశాలకు వచ్చాం.. అదే పాఠం, మరలా అదే వాక్యం.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని! విద్యార్థి స్థాయి నుంచి ఉద్యోగ, వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాం. ఇప్పుడూ పత్రికల్లో చదువుతున్నాం.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని..! ఏళ్లు గడుస్తున్నా... మన దేశ అభివృద్ధిలో మార్పు రావడం లేదు. రేపు మన పిల్లలూ, వారి పిల్లలూ ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమ’నే చెప్పుకోవాల్సిందేనా? అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం పేరు చేరేదెప్పుడు? సమాజంలో మార్పు అవసరం. గతి తప్పిన రాజకీయాలను గాడిన పెట్టగలిగే.. భ్రష్టుపట్టిన వ్యవస్థను సమూలంగా మార్చగలిగే నాయకత్వం అవసరం.
ఇది రాచరిక వ్యవస్థ కాదు.. ప్రజాస్వామ్య దేశం. మన పాలకులను మనమే నిర్ణయించగలిగే హక్కు మనకు ఉంది. గతించిన కాలాన్ని తలచుకుని బాధ పడే క్షణాలను వదిలేద్దాం. ఈ వ్యవస్థను మార్చగలిగే సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తెచ్చుకుందాం. అందుకు యువతే ముందుకు రావాలి. రాజకీయాల్లో వారి భాగస్వామ్యం పెరగాలి. దేశానికి చేటు తెస్తున్న నాయకులను ఓటు అనే ఆయుధం ద్వారా ఇంటికి పంపిద్దాం. యువ నాయకత్వానికి జై కొడదాం.. నయా భారత్‌ను నిర్మిద్దాం.