నినాదాన్ని సాకారం చేసేవాడే మేటి యోధుడు
కార్పొరేట్ విద్యకు రెడ్‌కార్పెట్ పరచి విద్యా వ్యవస్థను నాశనం చేసుకున్నాం. పిల్లల్లో వ్యక్తిగత లాభం, స్వార్థాలను రేకెత్తించాం. విద్యార్థి దశ నుంచే యువతలో దేశభక్తిని, నిస్వార్థతత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంపొందించడం సర్కారీ విద్యతోనే సాధ్యం.
గత రెండు నెలలుగా అమెరి కాలో తిరుగుతున్నాను. ప్రస్తు తం తూర్పు అమెరికా నుంచి పడమరకు వచ్చాను. తూర్పు అమెరికాలోని కాలిఫోర్నియా లో సుమారు యాభై ఏళ్లకు పైబడిన నా పూర్వ విద్యార్థు లు కలిశారు. వీరంతా 1970- 90ల మధ్య ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారే. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. కొందరు పలు కంపెనీలను నడిపిస్తున్నవారైతే... ఇంకొందరు కొన్ని కంపెనీలకు సీఈఓలుగా ఉన్నారు. ఈసారి పర్యటనలో వారందరితో కలసి ముచ్చటించే అవకాశం నాకు చిక్కింది. ‘‘తెలుగు రాష్ట్రాలు రెండూ పునర్నిర్మాణ దశలో ఉన్నాయి కదా... మీరు కూడా మీ గ్రామాల్లోనో, లేక సమీప పట్టణాల్లోనో కంపెనీలు స్థాపించి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తే బాగుంటుంది కదా!’’ అని వారితో అనగానే... వారంతా ఉత్సాహంగా అందుకు ముందుకువచ్చారు. ‘‘ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కావాల్సింది ఉద్యమాలు, తగాదాలు కావు... నిర్మాణాత్మక కార్యక్రమాల్ని రూపొం దించే సరికొత్త ఆలోచనలు’’ అన్న నా విజ్ఞప్తికి వారి నుం చి విశేష స్పందన వచ్చింది.
ఇటీవలే అమెరికాకు పడమర దిశగా ఉన్న వాషింగ్ట న్‌లో కూడా అలాగే కొందరు తెలుగువారిని కలిశాను. వీరు కూడా నా దగ్గర చదువుకున్నవారే. కానీ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో భాగస్వాములు కండనే నా విజ్ఞప్తికి అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ‘‘మాకు దేశం ఏం చేసింది? ప్రభుత్వ బడుల్లో నాణ్యతలేక చిన్నప్పటి నుంచీ ప్రైవేట్ బడుల్లోనే చదువుకున్నాం. కళాశాల విద్య కూడా అంతే. ఫీజులన్నీ మా తల్లిదండ్రులే భరించారు. ఇంజనీరింగ్ విద్య కూడా అంతంత మాత్రంగానే సాగిం ది. ఇక్కడ ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. మాకు ఈ దేశం ఉద్యోగావకాశాలను కల్పించింది. మన దేశంలో కులమే అన్నింటికీ ప్రాతిపదిక. ఇక్కడ కులాన్ని, మతాన్ని చూడరు. అందుకే మాకు ఈ దేశం అంటే ఇష్టం... మేం ఎవరికైనా రుణపడి ఉన్నామంటే అది కేవ లం మా తల్లిదండ్రులకే’నని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని ఇంతకు ముందు నేను అనేకసార్లు చర్చించాను. ప్రైవేట్ కళాశా లల్లో అధిక ఫీజులు చెల్లించి చదువును కొనుక్కోవడం వల్ల లాభాపేక్షకు సంబంధించిన ఆలోచనలతోనే వారి విద్యాభ్యాసం సాగింది తప్ప వారిలో సామాజిక దృక్ప థం ఏర్పడలేదు. ప్రభుత్వాలు సర్కారీ విద్యను క్రమం గా నీరుగార్చడం వల్ల కలుగుతున్న విపరిణామాలను ఇప్పుడు చవిచూడాల్సి వస్తోంది.
కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లలోని విద్యార్థులకు ఎంత తేడా ఉందో గమనించాను. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న తరం ఒకటైతే... కార్పొరేట్ కళాశాలల్లో చదువును కొనుక్కున్న తరం ఇంకొకటి. అందుకే సామా జిక లక్ష్యం అనే పదానికి అర్థమే మారిపోయింది. కాబట్టి ప్రైవేట్ విద్యావ్యవస్థ మనుషుల్లో తీసుకొచ్చిన ఈ మార్పును చూసి ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. అమె రికా అధ్యక్షులలో జఫర్‌సన్ గొప్పవాడు. ఆ తర్వాత అధ్యక్షుడైన లింకన్‌ను పత్రికా విలేకర్లు మీకు ‘‘ఆదర్శ ప్రాయుడైన అధ్యక్షుడు ఎవరు?’’ అని అడిగితే ఆయన ‘‘నేనే ఓ ఆదర్శ అధ్యక్షుడ్ని కావాలి’ అన్నారట.
జఫర్ సన్ ప్రపంచానికి సమానత్వ నినాదాన్ని ఇచ్చాడు. ఆ కారణంగా లింకన్ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవచ్చని అనలేం. జఫర్‌సన్ కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం మాత్రమే. ఆయన సమానత్వ నినాదాన్ని ఇచ్చాడే తప్ప దాన్ని అమలు జరపలేదు. ప్రజలకు నినాదం కన్నా అమలు ముఖ్యం. నినాదమిచ్చినవాడి కంటే దాన్ని అమ లు చేసిన వాడే ఆదర్శం. జఫర్‌సన్ కాలం కంటే లింకన్ కాలంలో సాంకేతికత బాగా పెరిగింది. లింకన్ బ్యాం కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. బానిసత్వానికి వ్యతిరే కంగా పోరాటం చేశాడు. ఆనాడు బానిసత్వానికి వ్యతిరే కంగా పోరాటం చేసిన వాడే యోధుడు. అందువల్ల అమెరికా స్వాతంత్య్రదినోత్సవం నాడు జఫర్‌సన్ కన్నా లింకన్‌నే ప్రజలు ఎక్కువగా జ్ఞప్తికి తెచ్చుకుంటారు. లింకన్ నినాదం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యమి చ్చాడు. అలాగే మన ప్రజలకు కూడా ఈనాడు కావా ల్సింది నినాదాలు కాదు. ఆచరణలో అమలు చేసి చూపే ప్రభుత్వాలు, నాయకులు కావాలి. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే శక్తినిచ్చే నాయకులు కావాలి. సమస్యల మూలాలను కనుగొని నిర్మూలించేవాడే యోధుడు. ప్రజాస్వామిక నినాదాలను ఇవ్వడంకన్నా ఆచరణలో అమలయ్యేలా చేసేవాడే గొప్పవాడు.
మనం కార్పొరేట్ యాజమాన్యాలకు రెడ్‌కార్పెట్ పరచి చేజేతులారా మన విద్యా వ్యవస్థను నాశనం చేసు కున్నాం. పిల్లల్లో వ్యక్తిగత లాభం, స్వార్థాలను రేకెత్తిం చాం. చిన్న వయసు నుంచే విద్యార్థిలో ‘‘నేను చదువును కొనుక్కున్నాను’’ అనే భావనను కలిగిస్తున్నాం. కాబట్టి మా తల్లిదండ్రులు నా కోసం ఖర్చు చేసిన ఆ డబ్బును ఏ రకంగానైనా నేను సంపాదించాల్సిందే అనే ఆలోచ నను మనమే వారిలో కల్పిస్తున్నాం. వెర్రితలలు వేస్తోన్న కార్పొరేట్ విద్యా వ్యవస్థను నియంత్రించకపోతే మరె న్నో విపత్కర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది.
ఏ దేశం తమకు మంచి ఉపాధిని, భవిష్యత్తును కల్పిస్తున్నదో ఆ దేశాన్నే ఎవరైనా ప్రేమిస్తారు, గౌరవి స్తారు. కాబట్టి విద్యార్థి దశ నుంచే యువతలో దేశభక్తిని, నిస్వార్థతత్వాన్ని, సామాజిక దృక్పథాన్ని పెంపొందిం చడం సర్కారీ బడులతోనే సాధ్యం. ప్రభుత్వాలు తక్ష ణమే సర్కారీ విద్యాసంస్థలను పటిష్టపరిచేందుకు పూను కోవాలి. సరికొత్త పరిశ్రమలను, వివిధ రంగాలలోని కంపెనీలను ఏర్పరచి ఉపాధి అవకాశాలను కల్పించగల గాలి. అప్పుడే విద్యార్థులకు దేశం పట్ల, రాష్ర్టం పట్ల ప్రేమ కలుగుతుంది. సామాజిక బాధ్యతతో మెలగు తారు. యువతను కదిలించడానికి కావాల్సింది ఉపన్యా సాలు కాదు... ఆచరణ!
(వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు)
- చుక్కా రామయ్య