సాక్షి, కరీంనగర్ :మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది జిల్లాలో ఆదర్శ పాఠశాలల పరిస్థితి. ఇప్పటికే అరకొర వసతులతో అస్తవ్యస్తంగా తయారైన ఈ పాఠశాలలకు మరో ఆపద వచ్చిపడింది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించేసరికి ఆకర్షణీయమైన వేతనాలు, అన్ని అలవెన్సులు, బోధనకు అన్ని వసతులుంటాయనే ఆశతో పోటీ పరీక్షలో నెగ్గి మోడల్‌స్కూళ్లలో చేరిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. ఆర్థిక, సర్వీసు సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోవడం ఇష్టం లేక స్కూల్ పాయింట్లకు వెళ్లిపోతున్నారు. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గత విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో 45 మోడల్‌స్కూళ్లు ఏర్పాటయ్యాయి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. బోధనకు ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ)లను ఎంపిక చేసింది. స్కూలుకు ఓ ప్రిన్సిపాల్, 13 మంది చొప్పున మొత్తం 585 మంది పీజీటీలు, ఒక్కో స్కూలుకు ఆరుగురి చొప్పున మొత్తం 270 మంది టీజీటీలు ఉండాలి. కానీ 21 మంది ప్రిన్సిపాళ్లు, 338 మంది పీజీటీలు, 118 టీజీటీలను మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. మిగతా పోస్టులు ఖాళీ ఉన్నాయి.
సర్వీసు రూల్స్, వేతనాలతోనే సమస్య
ప్రభుత్వ పాఠశాలల ఎస్జీటీలకు నెలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860 మూలవేతనం ఉండగా, ఆదర్శ పాఠశాలల్లో బోధించే టీజీటీలకు నెలకు రూ.14,860, పీజీటీలకు 16,150 ఖరారు చేసింది. ఎక్కువ వేతనం వస్తుందనే ఆశతో అప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పలువురు రాత పరీక్ష రాసి ఎంపికై మోడల్‌స్కూళ్లలో చేరారు. ఎస్జీటీలను టీజీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లను పీజీటీ, ప్రిన్సిపాళ్లుగా తీసుకుంది. నియామకాల వరకు బాగానే ఉన్నా అటు తర్వాత వీరి గురించి ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. సర్వీస్ రూల్స్, బదిలీలపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. వీరి నియామకాలైనప్పటినుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఏ రెండుసార్లు(17.12శాతం) పెరిగింది.
ఆదర్శ పాఠశాలల అధ్యాపకులకు మాత్రం పాత మూల వేతనమే అందుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే పీజీటీలు ప్రతి నెల రూ.7,125, టీజీటీలు రూ.6,556లు తక్కువ వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసి.. మోడల్ స్కూళ్లలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తిస్తుందా? కొత్త పెన్షన్ విధానామా? అనే విషయంపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించింది. ఆదర్శపాఠశాలల్లోని టీజీటీ, పీజీటీలకు ఇది వర్తించకపోవడంతో భవిష్యత్తులో పీఆర్‌సీలో నష్టపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికే 15 మంది
మోడల్ స్కూళ్లలో పోస్టింగ్ పొందిన తర్వాత వాటిలో పనిచేయడం ఇష్టం లేకపోతే రెండేళ్లలోపు తిరిగి స్కూల్ పాయింట్లకు వెళ్లిపోవచ్చనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడంతో ఈ నిబంధన ఆధారంగా ఆదర్శపాఠశాలల బోధకులు పాతస్థానాలకు వెళ్తున్నారు. ఇక్కడే కొనసాగితే భవిష్యత్‌లో సర్వీసుపరం గా, వేతనాల పరంగా నష్టపోయే ప్రమాదముందని వారు తిరిగి వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 15 బోధకులు సర్కారు స్కూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. సైదాపూర్, కేశవపట్నం, కాటారం మోడల్‌స్కూళ్లలోని పలువురు బోధకులు పాత స్థానాలకు వెళ్లారు.
ఇంకా పదుల సంఖ్యలో మోడల్ స్కూల్స్ నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరందరూ ఇదే విషయమై జిల్లా విద్యాశాఖ, కమిషనర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే వీరిని స్కూల్ పాయింట్లకు పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వసతులు సరిగా లేవని, కనీసం భవనాలు కూడా లేనిచోట చదివేదెలా? అని ఇప్పటికే చాలా చోట్ల విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. మోడల్ స్కూళ్లలో ఇప్పటికే పోస్టులు చాలామేర ఖాళీ ఉండగా, ఇప్పుడు ఉన్న బోధకులు కూడా వెళ్లిపోతే విద్యాబోధన, ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
ఆదర్శానికో దండం!
Published Fri, Aug 8 2014 4:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement