డుమ్మాలు జాన్తానై | teachers on the attendence Govt surveillance | Sakshi
Sakshi News home page

డుమ్మాలు జాన్తానై

Published Thu, Oct 9 2014 4:44 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM

డుమ్మాలు జాన్తానై - Sakshi

డుమ్మాలు జాన్తానై

గైర్హాజరయ్యే టీచర్లపై సర్కార్ నిఘా
- నేటి నుంచీ ఉపాధ్యాయుల హాజరుపై కలెక్టర్ పర్యవేక్షణ
- ఉదయం 10 గంటల్లోగా హెచ్‌ఎంల ద్వారా ఎంఈఓలకు హాజరు వివరాలు  
- 12 గంటల్లోగా జిల్లా అధికారులకు సమాచారమివ్వనున్న ఎంఈఓలు

మెదక్: సర్కార్ స్కూళ్లలోనూ కార్పొరేట్ విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. అందులో తొలుత పంతుళ్లపై పర్యవేక్షణకు సిద్ధమైంది. అందులో భాగంగానే  నేటి నుంచి ప్రతిరోజు పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల అటెండెన్స్‌ను ఏకంగా కలెక్టరే మానిటరింగ్ చేయనున్నారు. ఉదయం పాఠశాల సమయానికి విధులకు హాజరైన...గైర్హాజరైన..ఉపాధ్యాయుల వివరాలను ఏకంగా కలెక్టర్, విద్యాశాఖ అధికారి, ఆర్వీఎం పీఓ లకు సమాచారం అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్న తరుణంలో మెదక్ జిల్లాలో తీసుకున్న ఈ నిర్ణయం...ఇతర జిల్లాలకు ఆదర్శంగా మారే అవకాశం ఉంది.
 
మెదక్ జిల్లాలో 1,974 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2,899 పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మొత్తంగా సుమారు 12 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం...ఇటీవలే పాఠశాలల వేళలను కూడా మార్చారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల ఉపాధ్యాయులు సమయానుకూలంగా పాఠశాలకు రావడం లేదన్న ఆరోపణ లున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులు పోలింగ్ బూత్‌ల కోసం జిల్లాలో సుమారు 75 పాఠశాలలను పరిశీలించిన సమయంలో, దాదాపు 62 పాఠశాలల్లో ఉపాధ్యాయులు తమ విధుల్లో అలసత్వం వహిస్తున్నట్లు గుర్తించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు సమాచారం.  
 
రోజువారీ మానిటరింగ్
ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటలకల్లా సంబంధిత ఎంఈఓలకు ఉపాధ్యాయుల హాజరుపై సమాచారం ఇవ్వాలి. ఎంఈఓలు మధ్యాహ్నం 12 గంటల్లోపు కలెక్టర్‌కు, విద్యాశాఖ అధికారికి, ఆర్వీఎం పీఓకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇందులో పాఠశాల పేరు, మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య, సెలవుల్లో ఉన్న వారి వివరాలు, విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయుల హోదా, బోధించే సబ్జెక్ట్ తదితర వివరాలు ఉన్నత అధికారులకు తెలియజేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఇక నుంచి పంతుళ్లు విధులకు డుమ్మా కొట్టినా...సమయ పాలన పాటించకపోయినా ఏకంగా కలెక్టరే చర్య తీసుకునే అవకాశం కలిగింది.

గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ ప్రభుత్వాస్పత్రుల్లో, హాస్టళ్లు, కేజీబివీల్లో స్కైప్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14 నుంచి ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం విధితమే. వీటికితోడు ఉపాధ్యాయుల పనితీరుపై రేటింగ్ కూడా నమోదు చే సేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజాగా ఉపాధ్యాయుల హాజరుపై కలెక్టర్ పర్యవేక్షణ ప్రారంభమవుతోంది. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement