కార్పొరేట్‌కు అడుగులు
టెన్త్ పాసైన వెనుకబడిన వర్గాల పిల్లలకు శుభవార్త. పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ కాలేజీలో చదువుకునే అవకాశాన్ని వీరికి ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకు చర్యలు చేపట్టింది. ఏడు గ్రేడు పాయింట్లు మించి సాధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు ఇది నిజంగా వరమే.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, వికలాంగుల్లో ప్రతిభావంతులకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు
* ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
సత్తెనపల్లి : వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో టెన్‌తలో ఉత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ఇంటర్ విద్య కార్పొరేట్ కళాశాలల్లో అభ్యసించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. టెన్త్‌లో 7 గ్రేడ్ పాయింట్ల కన్నా ఎక్కువ సాధించిన వారి కార్పొరేట్ విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ మేరకు అర్హుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణకు సాంఘిక సంక్షేమ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగుల వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అర్హులు.
అర్హతలు ఇవీ..
ప్రభుత్వ విద్యా సంస్థల్లో టెన్త్ విద్యనభ్యసించి ఉండాలి. 2016 మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షల్లో 7 గ్రేడ్ పాయింట్లు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షలకు మించి ఉండరాదు. మిగిలిన వారి కుటుంబ ఏడాది ఆదాయం రూ.లక్షకు మించకూడదు. జెడ్పీ, మున్సిపల్, వసతి గృహాలు, సాంఘిక, గిరిజన సంక్షేమ, కేజీబీవీలు, నవోదయ పాఠశాలల్లో చదివి ఉండాలి. ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. జూన్ 2 నుంచి 10వ తేదీలోగా ఏపీ ఈ-పాస్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారి సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తుంది.
ప్రయోజనాలు ఇలా..
కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక విద్యార్థులకు ఉంటుంది. ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థులు లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.
రిజర్వేషన్లు ఇలా..
జిల్లావ్యాప్తంగా 57 మండలాలకు మొత్తం 272 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 50 శాతం.. అన్ని యాజమాన్యాల్లోని వసతి గృహాల్లో ఉండి టెన్త్ చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. గిరిజన, సాంఘిక సంక్షేమ, కేజీబీవీ, బీసీ యాజమాన్యాల గురుకుల పాఠశాలలు, నవోదయలో చదువుకున్న వారికి 25 శాతం సీట్లు కేటాయిస్తారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుకున్న వారికి ఐదు శాతం, పురపాలక, జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్న వారికి 20 శాతం సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు చేసుకోండి..
పదో తరగతి పూర్తి చేసి ఏడు గ్రేడ్ పాయింట్లు మించి సాధించిన విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో విద్యనభ్యసించడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. వచ్చే నెల 2 నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది పేద, వసతి గృహాల విద్యార్థులకు మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- పవన్‌కుమార్, సూపరింటెండెంట్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం, గుంటూరు