
పిల్లలకు వేలవి సెలవులు వచ్చాయంటే.. తల్లిదండ్రుల ఆర్థిక స్థాయిని బట్టి విహార యాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. సంపన్నుల ఇళ్లల్లో ‘సింగపూర్‌కా, సిమ్లాకా’ అంటూ ఎంపిక చేస్తుంటే.. ‘అమ్మమ్మ ఇంటికా అత్త వాళ్ల ఊరికా’ అంటూ మధ్య తరగతి ఇళ్లలో ప్లాన్ వేస్తుంటారు. మరికొందరైతే వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి సమ్మర్ క్యాంప్స్‌కి జై కొడతారు. అయితే వెకేషన్‌కు వెళ్లే డబ్బుల్లేక, సెలవులను గడిపేందుకు చుట్టాలూ, బంధువులూ లేక, వేసవి శిబిరాల వ్యయాన్ని భరించే స్తోమత లేని అనాథ/నిరుపేద పిల్లల పరిస్థితేంటి? వారికి మాత్రం కలలు ఉండవా? అంటే ఉంటాయి. మరి వాటిని నెరవేర్చేదెవరు..? ‘వారి కలను తీర్చడానికి మనమంతా లేమా!’ అంటూ నగరానికి చెందిన ఓ ఎన్‌జీఓ ప్రశ్నిస్తే నగరవాసులు ‘మేం ఉన్నామంటూ’ ముందుకొచ్చారు. బాలికలకలలకు రెక్కలు తొడిగారు.
సాక్షి,సిటీబ్యూరో :‘ఆంటీవాళ్లు మాకు ఎంతో మరిచిపోలేని ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. నేను లైఫ్‌లో మంచి పొజిషన్‌కి వచ్చాక మా సొంత డబ్బులతో వాళ్లని ఫారిన్‌కి తీసుకెళతా’ అంటూ చెప్పింది పద్మజ. అలా మాట్లాడుతున్న ఆ అమ్మాయిని సంతోషంగా చూస్తూ.. ‘అదే మాకు కావాలండీ. వాళ్లలో అలాంటి ఆత్మవిశ్వాసమే మేం కోరుకునేది’అని చెప్పారు రీనా. ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ తరఫున 20 మంది నిరుపేద విద్యార్థినుల వేసవి సెలవులను సద్వినియోగం చేసే క్రమంలో భాగంగా ఈ ఉచిత విమానయాన అనుభవాన్ని వారికి అందించామన్నారామె.
మరికొన్ని అంశాల్లోనూ శిక్షణ
ఈ సమ్మర్ క్యాంప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని భరణి లే అవుట్‌లో ఉన్న కలినరీ లాంజ్‌లో ఈ బాలికలకు పాకశాస్త్ర తరగతులు ఉచితంగా ఏర్పాటు చేశారు. అప్పటికే అక్కడ శిక్షణ పొందుతున్న సీనియర్ స్టూడెంట్స్ వీరికి శిక్షణ ఇవ్వడం విశేషం. ‘నిరుపేద బాలికలైనా వీరి ఆలోచనా శక్తి అమోఘం. ఒక్క పూటలోనే రకరకాల వంటకాలపై వీరు ప్రాధమిక అవగాహన ఏర్పరచుకున్నారు. ఇలాంటి కార్యక్రమానికి చేయూతనివ్వడం మాకెంతో సంతృప్తినిచ్చింది’ అని కలినరీ లాంజ్ నిర్వాహకులు విభూతి, గోపి ఆనందంగా చెప్పారు. ఈ వేసవి మొత్తం ఈ బాలికలకు వైవిధ్యభరితమైన విజ్ఞాన వినోదాలను పంచాలనే క్రమంలో ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతుందని ఫౌండేషన్ ప్రతినిదులు స్పష్టం చేశారు.
విమాన విహారం.. సోషల్ సహకారం..
గత కొంత కాలంగా టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు నగరంలోని రాధా కిషన్ బాలికా భవన్‌ను దత్తత తీసుకుని అక్కడి బాలికల బాగోగులు చూస్తున్నారు. వారికి చదువుతో పాటు అవసరమైనన సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే, అంతటితో ఆగిపోకుండా ఈసారి వేసవి సెలవుల్లో విభిన్న తరహా సమ్మర్ క్యాంప్‌ను డిజైన్ చేశారు. తొలిసారి 20 మంది బాలికలను బెంగళూరుకి విమానంలో తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ‘ఒక్కో బాలికకు టికెట్‌కి వ్యయం రూ.4,500 అవుతుంది. మా ఆలోచనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే మంచి స్పందన వచ్చింది. సిటీలో నివసించే మా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ తలో ఒకరు లేదా ఇద్దరు బాలికలకు స్పాన్సర్ చేస్తామంటూ ముందుకు వచ్చారు. బెంగళూరులో ఒక హోటల్ ఉచిత వసతి అందించారు. ఇలా ప్రతి ఒక్కరూ సహకరించడంతో ఈ బాలికల కల సాకారం చేయగలిగాం’ అని ఆనందంగా వివరించారు రీనా.
డ్రీమ్ బిగ్.. అచీవ్ బిగ్
పెద్ద పెద్ద కలలు కనాలి.. అవి సాకారం చేసుకోవడానికి కష్టపడాలి.. అనే ఆలోచన వారికి ఇవ్వాలనేదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఆ ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఇరవై మంది బాలికల కలలకు రెక్కలు తొడుగుదామని భావించామంటున్నారు వీరు. నిరుపేద చిన్నారులు ఖరీదైన కలలు కనడానికి కూడా భయపడతారు. ఆ భయం వారి భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తుంది. ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే వారికి అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు అందాలి అంటారు ఫౌండేషన్ సభ్యులు. సమ్మర్ క్యాంప్‌లో బెంగళూరుకి విమానంలో రాకపోకలు సాగించడం జీవితంలో ఎదగాలనే స్ఫూర్తిని తమకు ఇచ్చిందని దేవిక, జెస్సికా.. తదితర బాలికలు ‘సాక్షి’తో తమ సంతోషాన్ని పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment