పథకం కొనసాగింపుపై స్పష్టత ఇవ్వని కూటమి ప్రభుత్వం
రెండు నెలలుగా తెరుచుకోని జ్ఞానభూమి ఆన్‌లైన్ పోర్టల్
ఎన్నికల ముందు దరఖాస్తు చేసిన అభ్యర్థుల ఎదురుచూపులు
ప్రభుత్వ సాయంపై ఆధారపడి విదేశాలకు వెళ్లిన విద్యార్థులు
పరిశీలన పూర్తయినా పట్టించుకోని సర్కారు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేసిందా అనే ప్రశ్నకు విద్యార్థుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. జ్ఞానభూమి ఆన్‌లైన్ పోర్టల్ రెండు నెలలుగా తెరుచుకోకపోవడమే దీనికి కారణం. – సాక్షి, అమరావతి
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి ఎన్నికల ముందునుంచే పేద విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తులు పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. వారి పరిస్థితి ఇప్పుడు ఏంచేయాలో తెలియని ఆయోమయంలో పడింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు రూ.107.07 కోట్లను విదేశీ విద్యా పథకం కింద పేద విద్యార్థులకు అందించింది. ఈ ఏడాది జనవరి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. కొందరికి ఇంటర్వ్యూలు కూడా అధికారులు పూర్తి చేశారు. కాగా.. అంతకుముందు ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా పరిశీలించి సాయం విడుదల చేసిందా అంటే అదీలేదు.
విద్యార్థులకు ఉదారంగా సాయమందించిన వైఎస్ జగన్
పేద కుటుంబాల్లోని పిల్లల పెద్ద చదువులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదారంగా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకు ఊతమిచ్చారు. ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు.
ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల్లో ఆ మొత్తాన్ని విద్యార్థులకు చెల్లించేవారు. విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్‌డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకు విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.15 లక్షల వరకే సాయం అందిస్తే.. జగన్ ప్రభుత్వం గరిష్టంగా రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు అందించడం విశేషం.
సమాధానం చెప్పేవారూ కరువు
ప్రభుత్వం సాయం అందిస్తుందనే ఆశతో ఇంటర్వ్యూలు పూర్తయిన చాలామంది విద్యార్థులు అప్పులు చేసిమరీ చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. విదేశీ విద్యా పథకం తమకు మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు. పోర్టల్‌లో ఏదైనా అప్‌డేట్ ఉందేమో అని చూస్తే జ్ఞానభూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు.
ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించినప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. స్పష్టత రావడానికి మరో నెల పట్టవచ్చని.. పథకాన్ని మార్చి విధి విధానాలు కఠినతరం చేసి ఆర్థిక సాయాన్ని తగ్గించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment