సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా పూర్తిస్థాయిలో తగ్గనప్పటికీ రెండేళ్ల కిందటితో పోలిస్తే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం తెలంగాణ విద్యార్థులు ఈ ఏడాది మరింత ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫారెన్‌లో చదువుకోవాలనుకుంటున్న వారిలో ఏకంగా 90 శాతం మంది అమెరికా, బ్రిటన్, కెనడాలనే తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నట్లు తేలింది. ముంబై కేంద్రంగా విదేశీ విద్యాసంస్థల కన్సల్టెంటుగా పనిచేసే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ‘యోకెట్’ 30 వేల మంది తెలంగాణ విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
పెరిగిన ఆర్థిక చేయూతతో విదేశాలవైపు...
ఒకప్పుడు విదేశీ విద్య అంటే కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం. కానీ ప్రస్తుతం విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావడంతో విదేశీ విద్య అనేది పేద విద్యార్థులకు సైతం అందుబాటులోకి వచ్చింది. అందుకే నేటి కాలం విద్యార్థుల్లో చాలా మంది విదేశీ విద్యపై మక్కువ పెంచుకుంటున్నారు. తెలంగాణలో బీటెక్, ఎంబీబీఎస్ ఇతర గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా, బ్రిటన్, కెనడాలకే ప్రాధాన్యమిస్తున్నారని తాజా సర్వే వెల్లడించింది. ఆ తరువాత స్థానంలో ఆస్ట్రేలియాతోపాటు ఐరోపా దేశాలైన జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్స్‌ను ఎంచుకుంటున్నారని సర్వే వివరించింది.
ఏటేటా పెరుగుతున్న సంఖ్య...
విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటాన్ని ‘యోకెట్’ తన సర్వేలో ప్రత్యేకంగా గుర్తించింది. 2019లో 8,000 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లినట్లు సర్వే సంస్థ తెలిపింది. అయితే 2020లో కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో చాలా మంది తమ చదువులను ఈ ఏడాదికి వాయిదా వేసుకున్నారని, అయినప్పటికీ 2019తో పోలిస్తే గతేడాది రాష్ట్రం నుంచి ఏకంగా 17 శాతం మంది విద్యార్థులు అధికంగా విదేశాలకు వెళ్లారని తెలిపింది. అలాగే 2019 గణాంకాలతో పోల్చినపుడు ఈ ఏడాది విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న తెలంగాణ విద్యార్థుల సంఖ్య 62 శాతానికి చేరుకుందని సర్వే వెల్లడించింది.
అందరికీ కంప్యూటర్ సైన్సే కావాలి..
తెలంగాణ విద్యార్థులు మాస్టర్స్ చేసేందుకు అక్కడ ఎంచుకుంటున్న కోర్సులపైనా సర్వే సంస్థ విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. విదేశాలకు వెళ్తున్న వారిలో 50 శాతం మంది కంప్యూటర్ సైన్స్ ఎంచుకంటున్నారని తేలింది. అలాగే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (ఎంఐఎస్) కోర్సులో చేరేందుకు తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మొగ్గుతున్నట్లు సర్వే వివరించింది. ఇక ఆ తరువాత స్థానంలో ఐటీతోపాటు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.
55 శాతం రుణాల ద్వారానే..
ఈ సర్వేలో ‘యోకెట్’ గమనించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తెలంగాణ నుంచి విదేశాలకు మాస్టర్స్ చేసేందుకు వెళ్తున్న విద్యార్థుల్లో 55 శాతం మందికి అంత ఆర్థిక స్తోమత లేదు. అయినా వారు బ్యాంకు రుణాలపై ఆధారపడి విదేశాలకు వెళ్తున్నారు. అలాగే 30 శాతం మంది పూర్తిగా సొంత నిధులను సమకూర్చుకొని వెళ్తుండగా 15 శాతం మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి విదేశాలకు వెళ్తున్నారు.
తెలంగాణ నుంచి ఎక్కువగా వెళ్తున్నారు
కరోనా విపత్తు కారణంగా పలు దేశాలకు విధించిన ఆంక్షలు గతేడాది విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న చాలా మంది విద్యార్థులను నిరాశకు గురిచేశాయి. కానీ 2021లో ఇండియా నుంచి విదేశాలకు వెళ్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి గణనీయ వృద్ధి కనిపిస్తోంది. 2020లో కరోనా కారణంగా వెళ్లలేకపోయిన వారంతా వారి ప్రయాణాన్ని 2021–22కు మార్చుకుంటున్నారు.
- తుముల్ బుచ్, యోకెట్ సహ వ్యవస్థాపకుడు
ఫారెన్ ఎడ్యుకేషన్.. చలోచలో
Published Wed, Jun 16 2021 2:31 AM | Last Updated on Wed, Jun 16 2021 2:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment