సాక్షి, అమరావతి: కాపు కార్పొరేషన్ ద్వారా ‘విదేశీ విద్యాదీవెన’ పథకానికి లబ్ధిదారులను ఎంపికచేసిన ప్రభుత్వం వారికి సాయం చేయడం మరిచిపోయింది. గతేడాది ఎంపిక చేసిన విద్యార్ధులకు ఇంతవరకూ సాయం అందకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకంతో తమ పిల్లల్ని విదేశాలకు పంపిన తల్లిదండ్రులు అప్పులపాలయ్యారు. విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా విదేశాల్లో పీజీ చదువుకునే కాపు విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది. విదేశాల్లో సీట్లు సంపాదించిన వారు చదువుకునే యూనివర్సిటీ వివరాలతో విదేశీ విద్యాదీవెన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న వారికి మొదటి సెమిష్టర్ పూర్తయ్యేలోపు రూ. 5 లక్షలు, రెండో సెమిష్టర్‌కు మరో రూ. 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి సారిగా కార్పొరేషన్ నుంచి 2014–15లో విదేశీ విద్య కోసం దరఖాస్తులు చేసుకున్న 400 మందికి రెండు విడతల్లో కాపు కార్పొరేషన్ చెల్లింపులు చేసింది. అనంతరం 2016–17 విద్యా సంవత్సరానికి 580 మంది కాపు విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ విద్యకు సీట్లు ఇప్పించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. కాపు కార్పొరేషన్ హామీ మేరకు విద్యార్థికి రూ.10 లక్షలు విద్యా రుణంగా ఇప్పించేందుకు ఆంధ్రా బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. ఒకవైపు విమాన ఛార్జీ కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసింది. సుమారు మూడు వేల మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. మే నెలాఖరులో ఇంటర్వ్యూలు నిర్వహించి 512 మందిని మొదట ఎంపిక చేశారు. ఆ తరువాత మొత్తం 681 మంది కాపు విద్యార్థులను విదేశీ విద్యకు ఎంపిక చేసినట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ప్రకటించారు.
బ్యాంకుల్లో రుణం తీసుకునే అవకాశమూ లేదు...
2015–16 బ్యాచ్‌లో విదేశాల్లో చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులను పిలిపించి ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆ తరువాత నేటికీ ఎంపికైన విద్యార్థులకు పైసా ఇవ్వలేదు. సెమిష్టర్‌ల వారీగా ఫీజులు చెల్లించలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ విద్యాదీవెన పథకం కింద రుణం మంజూరైనట్లు ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో బ్యాంకుల్లో విద్యారుణం తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
‘ కాపు కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షలు ఇస్తారని, మరో రూ.10 లక్షలు బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తారని ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి మురిసిపోయాను. నా కుమార్తెను ఎంబీబీఎస్ చదివించేందుకు 2016లో చైనా పంపాను. ఆ తరువాత ఆన్‌లైన్‌లో కాపు కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశాం. విజయవాడలో 2017 మే 30న ఇంటర్వూ నిర్వహించిన అధికారులు విదేశీ విద్యాదీవెన పథకం కింద లబ్ధిదారుగా ఎంపిక చేశారు. జూలై 23న డబ్బులు మంజూరయ్యాయని ప్రొసీడింగ్స్ లెటర్ కూడా ఇచ్చారు. అయితే నేటి వరకు పైసా కూడా ఇవ్వలేదు. అప్పుచేసి రెండు సెమిస్టర్‌ల ఫీజు రూ.8 లక్షలు కట్టాను. ఖర్చులు కలిపి ఇప్పటి వరకు రూ.13 లక్షలు అయ్యాయి. కాపు కార్పొరేషన్‌కు వెళితే ఫైల్ ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు.
– ఇది ఓ విద్యార్థిని తండ్రి ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment