విదేశీ విద్యకు ఉపకార వేతనాలు | Scholarships for foreign education | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యకు ఉపకార వేతనాలు

Published Sun, Mar 23 2014 10:42 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Scholarships for foreign education

విదేశాల్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనే ఆకాంక్ష విద్యార్థులందరికీ ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే అది వాస్తవరూపం దాల్చదు. ఇలాంటివారికి ఉపకార వేతనాలు నిజంగా ఒక వరమేనని చెప్పుకొవచ్చు. స్కాలర్‌షిప్స్‌తో విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవచ్చు. యూనివర్సిటీలు, విద్యాసంస్థలతోపాటు కొన్ని స్వచ్ఛంద, సామాజిక సంస్థలు కూడా ఉపకార వేతనాలను అందిస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటునందించాలనే లక్ష్యంతో ఇవి పనిచేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకొనే ఔత్సాహిక విద్యార్థులకు అందుబాటులో ఉన్న కొన్ని స్కాలర్‌షిప్స్ గురించి తెలుసుకుందాం...
 
 ఇన్‌లాక్స్ శివ్‌దాసానీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్
 ఈ ఫౌండేషన్ రెండు రకాల ఉపకార వేతనాలను అందజేస్తోంది. అవి.. యూనివర్సిటీ స్పెసిఫిక్, కోర్సు స్పెసిఫిక్. అమెరికా, యూకేతోపాటు ఇతర యూరోపియన్ దేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీల్లో చదివే విద్యార్థులకు రెండేళ్లపాటు వీటిని ఇస్తారు. పీహెచ్‌డీ విద్యార్థులకైతే నాలుగేళ్లపాటు అందజేస్తారు.
 
అర్హతలు: నిర్దేశిత కోర్సులు మినహా మిగిలిన కోర్సులను అభ్యసించేవారికి ఈ ఉపకార వేతనం ఇస్తారు. 30ఏళ్లలోపు వయస్సున్నవారు అర్హులు. అభ్యర్థులు భారత్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అకడమిక్ పరంగా మెరుగైన రికార్డు ఉండడంతోపాటు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉండాలి.
 
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును పూర్తిచేసి ఫౌండేషన్ చిరునామాకు పంపాలి. అభ్యసించబోయే కోర్సు, కళాశాల వివరాలను జతచేయాలి.  తమ విద్యార్హతలు,నైపుణ్యాలకు సంబంధించిన  సమాచారం పంపించాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టులో చోటు సంపాదించిన విద్యార్థులకు రెండు దశల్లో ఇంటర్వ్యూ నిర్వహించి, తుది విజేతలను ప్రకటిస్తారు.

 దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 15, 2014
 వెబ్‌సైట్: www.inlaksfoundation.org
 
 ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్
 విదేశాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే ఐఈఎల్‌టీఎస్ అభ్యర్థులకు బ్రిటిష్ కౌన్సిల్ ప్రతిఏటా ఉపకార వేతనాలను అందజేస్తోంది. ఒక్కొక్కరికి దాదాపు రూ.3లక్షల చొప్పున కేవలం ఎనిమిది మందికే ఈ స్కాలర్‌షిప్ ఇస్తారు.

 అర్హతలు: అభ్యర్థుల ఐఈఎల్‌టీఎస్ స్కోర్ కనీసం 6.0 ఉండాలి.
 బ్రిటిష్ కౌన్సిల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖా స్తును పూర్తిచేసి పంపాలి. ఐఈఎల్ టీఎస్ టెస్ట్ రిపోర్ట్‌తో పాటు నిర్దేశించిన ఇతర డాక్యుమెంట్లను కూడా జతచేయాలి.
 
ఎంపిక: ఇంటర్వ్యూ ఉండదు. షార్ట్‌లిస్టులో ఉన్న అభ్యర్థులు బ్రిటిష్ కౌన్సిల్ నిర్ణయించే ఒక సామాజిక అంశంపై ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థుల భాషా పరిజ్ఞానం, ప్రజంటేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
 దరఖాస్తుల చివరి తేది: జూన్ 30, 2014
 వెబ్‌సైట్: www.britishcouncil. in/
 
నరోత్తమ్ శెఖ్సారియా స్కాలర్‌షిప్
మెరుగైన అకడమిక్ రికార్డు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ అందుకోవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్యూర్ సెన్సైస్, అప్లయిడ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యూమానిటీస్, లా, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే అభ్యర్థు లకు ఈ ఉపకార వేతనం ఇస్తారు.
 
అర్హతలు: భారత్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 30 ఏళ్లలోపు వయస్సు ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: షార్ట్‌లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: http://pg.nsfoundation.co.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement