విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా. కానీ, ఇపుడు విదేశీ విద్యావకాశాలు విస్త ృతమై... చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా.. వాటిలో ప్రవేశానికి కటాఫ్ 99 శాతం. దీన్నే రీచ్‌ఐవీ సీఈఓ విభా కాగ్జి మాటల్లో చెప్పాలంటే... దేశంలో ఆమోదనీయ స్థాయిలో ఉన్న నాణ్యమైన విద్య 2 శాతంలోపే!!. మరి మిగిలిన 98 శాతం మంది మాటేంటి? అందుకే ఇపుడు తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత వరకూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలంటే అది విదేశాల్లోనే సాధ్యమనే భావనతో ఉంటున్నారు. కాకపోతే ఈ ఖరీదైన విదేశీ విద్యను అందుకోవడం ఆర్థి కంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అందుకోవాలంటే అందుకు ప్రణాళిక అవసరమంటున్నారు నిపుణులు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
విదేశాల్లో కోర్సు పూర్తి చేయడమన్నది ఖరీదైన వ్యవహారమే. ఐవీ లీగ్ కాలేజీల్లో ఏడాది ట్యూషన్ ఫీజు రూ.30– 35 లక్షల మధ్య ఉంది. దీనికి తోడు అదనపు వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వసతి, ఆహారం, కన్వేయన్స్, విద్యకు అవసరమైన వస్తువుల కొనుగోలు, హెల్త్ ఇన్సూరెన్స్, వినోద ఖర్చులు అదనం. వీటన్నిటికీ మరో రూ.10 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం ప్రభావం, రూపాయి విలువ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
2018లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 శాతం వరకు పడిపోయింది. మరి 2–4 ఏళ్ల కోర్సుల కాలంలో రూపాయి విలువలో వచ్చే వ్యత్యాసాల ఆధారంగా కోర్సు ఫీజులకు చేసే చెల్లింపులు పెరిగిపోవడం, లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని విదేశీ విద్య కోసం పంపించాలనుకునే వారు మూడేళ్ల కోర్సు కోసం రూ.50 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. దీనికి 8 శాతం ద్రవ్యోల్బణ రేటును కూడా ముడిపెట్టాలి. అంటే... ఇప్పుడు రూ.50 లక్షల వ్యయమయితే, పదేళ్ల తర్వాత 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా కోర్సు ఫీజు రూ.1.07 కోట్లకు పెరిగిపోతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని చూస్తే అసాధ్యమేనని అనిపించొచ్చు. కానీ, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సాధ్యమే.
ముందుగానే ప్రారంభించాలి
పిల్లల విద్యా వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే పొదుపు మొదలు పెట్టిన వారికి లక్ష్యం సులువవుతుంది. పిల్లలు నెలల వయసులో ఉన్నప్పటి నుంచే వారి విద్యావసరాలకు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలనేది ఫైనాన్షియల్ అడ్వైజర్లు చేసే సూచన. అందుకే. సిప్ విధానంలో ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే పిల్లలు ఉన్నత విద్యకు వచ్చే సరికి రూ.50 లక్షల నిధి సాకారం అవుతుంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనుక పెద్ద భారం కూడా అనిపించదు. దీర్ఘకాలం చేతిలో మిగిలి ఉంటే... అధిక రాబడుల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
సరైన చోట పెట్టుబడి
పైన చెప్పుకున్నట్టు ముందు నుంచే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే అనుకున్నంత నిధి సమకూరుతుందనుకోవద్దు. మీ అవసరాలకు తగిన మొత్తం సమకూరేందుకు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, దానిపై ఆశించే రాబడులు, కాంపౌండింగ్ ప్రయోజనంతో నిర్ణీత సమయానికి ఎంత సమకూరుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇందుకు అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచన తీసుకోవాలి. 5–10 ఏళ్లు, అంతకుమించి సమయం ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ కలగలసిన సాధనాల్లో మెరుగైన రాబడులనే ఆశించొచ్చు.
‘‘దీర్ఘకాలం పాటు సమయం ఉంటే 65–70%పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సురక్షితమే. మంచి ఫలితాల కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్‌ను ఎంచుకోవాలి. స్టాక్స్, బాండ్లలోనూ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీలకు వర్తించే పన్ను ప్రయోజనాలే వీటికీ అమలవుతాయి. ఇవి 65% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక లాభం ఏడాదిలో రూ.లక్ష దాటితే (అమ్ముకున్న సమయంలో) దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లక్ష వరకూ పన్ను ఉండదు. ఆపై లాభంపై 10%పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఫిన్‌స్కాలర్జ్ వెల్త్ మేనేజర్స్ వ్యవస్థాపకురాలు రేణు తెలిపారు.
ఆలస్యంగా మొదలు పెడితే...
పిల్లలు పుట్టిన వెంటనే వారి విద్య కోసం పెట్టుబడి మొదలుపెట్టని వారు, ఈ అవసరాన్ని కొంత ఆలస్యంగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారు... సిప్‌తోపాటు ఏక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పరిష్కారం. లక్ష్యానికి దీర్ఘకాలం లేకపోతే వచ్చిన సమస్య ఏంటంటే రాబడులకు రిస్క్ తీసుకోలేని పరిస్థితి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో అంత ఆటుపోట్లు ఉండవు. రాబడులు బాండ్ ఈల్డ్స్‌కు స మానంగా ఉంటాయి. మూడేళ్లకు పైగా కొనసాగితే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే తక్కువ పన్ను రేట్లు అమలవుతాయి.
విద్యా రుణం తీసుకోవచ్చు...
లక్ష్యానికి సరిపడా ఇన్వెస్ట్ చేయలేని వారు, ఇన్వెస్ట్ చేసినప్పటికీ నిర్ణీత సమయంలో అవసరమైనంత నిధి సమకూరని వారు, ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించిన వారు పిల్లల విదేశీ విద్యా వ్యయాలను గట్టెక్కేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం పరిష్కారం. దాదాపు అన్ని బ్యాంకులు విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మంచి విద్యా సంస్థల్లో సీటు సంపాదిస్తే సులువుగానే రుణం పొందొచ్చు. పైగా, విద్యా రుణంపై ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లించే ఆదాయం ఉన్న వారికి ఇదో అదనపు ఆకర్షణ.
సంప్రదాయ ఇన్వెస్టర్లయితే...
పిల్లల ఉన్నత విద్య అనేది విస్మరించరాని అంశం. అలాగే, వాయిదా వేసేది కూడా కాదు. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోలేని వారు అయితే, పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం మరింత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రమ్య (25) నెదర్లాండ్స్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్‌కు వెళుతోంది. ఆమె చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాడు.
కానీ, సంప్రదాయ సాధనాల్లో చేయడంతో రాబడులు పెద్దగా లేవు. దీంతో కోర్సుకు కావాల్సినంత సమకూరలేదు. దీంతో రమ్య విద్యావసరాల కోసం ఆమె తండ్రి తన రిటైర్మెంట్ నిధిలోనూ కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని మెరుగైన రాబడులను ఇవ్వలేవు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం కాస్తంత నయం. రికరింగ్ డిపాజిట్ కూడా కాస్త మెరుగైన ఆప్షనే.
లక్ష్యానికి సమీపంలో...
పిల్లల ఉన్నత విద్యకు మరో 2 ఏళ్లు ఉందనగా, ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు కొద్దికొద్దిగా వాటిని డెట్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి మార్కె ట్లు పడిపోతే పెట్టుబడుల విలువ అమాంతం కరిగిపోయే ప్రమా దం ఉంటుంది. కనుక పెట్టుబడులను రక్షించుకోవాలనుకుంటే ముందు నుంచే క్రమంగా వైదొలగడం అవసరం.
విద్యా వ్యయం ఏ దేశంలో ఎంతెంత?
యూఎస్‌ఏ
ట్యూషన్ ఫీజు: ప్రైవేటు కాలేజీల్లో సుమారు రూ.25–30 లక్షలు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.15–23 లక్షలు.
నివాస వ్యయం: నెలకు రూ.75,000. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరంలో తక్కువ.
మొత్తం ఖర్చు: ఏటా దాదాపు రూ.34 లక్షలు.
ఆస్ట్రేలియా
ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అయితే రూ.10–16 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్‌కు 12–18 లక్షలు.
నివాస వ్యయం: నెలకు రూ.86,000. పట్టణాలను బట్టి ఇందులో మార్పు ఉంటుంది. సిడ్నీ, కాన్‌బెర్రా పట్టణాల మధ్యే నివాస వ్యయం నెలకు రూ.17,000 తేడా ఉంటుంది.
మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు.
యూకే
ట్యూషన్ ఫీజు: రూ.8–18 లక్షలు. నివాస వ్యయం: లండన్‌లో అయితే ప్రతి నెలా రూ.1.1 లక్ష వరకు. లండన్ బయట అయితే రూ.91,000.
మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు.
కెనడా
ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–15 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8–20 లక్షలు.
నివాస వ్యయం: వీసా అవసరాలను బట్టి ప్రతి నెలా రూ.57,000 వరకు
మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.19.8 లక్షలు
సింగపూర్
ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5–13 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–25 లక్షలు.
నివాస వ్యయం: రూ.50,000 వరకు ప్రతి నెలా.
మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.18 లక్షలు
జర్మనీ
ట్యూషన్ ఫీజు: పబ్లిక్ యూనివర్సిటీల్లో ఫీజు ఉండదు. కొన్ని నామమాత్రంగా ఏడాదికి రూ.40,000 వరకు చార్జ్ చేస్తున్నాయి.
నివాస వ్యయం: మ్యూనిక్, బెర్లిన్ వంటి పెద్ద పట్టణాల్లో అయితే ప్రతి నెలా రూ.54,000. కాలేజీ డార్మెటరీల్లో ఉండేట్టు అయితే రూ.42,000 చాలు. ఫ్రీబర్గ్, హాన్నోవర్ వంటి చిన్న పట్టణాల్లో అయితే రూ.42,000 వరకు అవసరం అవుతుంది.
మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.5.4 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment