బీసీలకూ ‘విదేశీ విద్య’ ఆర్థిక సహాయం
రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న తరహాలో వీరికి కూడా అమలు చేయాలని భావిస్తోంది. కొన్ని బీసీ కులాలు, సంచారజాతులకు చెందిన వారు ఎస్సీల కంటే కూడా వెనుకబడి ఉన్న నేపథ్యంలో... వారికి కూడా విదేశాల్లో ఉన్నత విద్య అవకాశాలను కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా సానుకూలంగా ఉన్నారని, దీనికి త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. విదేశాల్లో విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మైనారిటీ, బీసీ విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింప చేయాలని, రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఐఐటీల్లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐఐఎం, బిట్స్ పిలానీ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. ఇలా చేయడం వల్ల విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు... బీసీ, ఈబీసీ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 26 కులాలను చేర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీసీ శాఖ కోరినట్లు తెలుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ 2015 ఏప్రిల్‌లోనే రాష్ట్రానికి వచ్చి ఆయా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై బహిరంగ విచారణను నిర్వహించింది కూడా. కానీ ఏడాది గడిచినా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ప్రభుత్వపరంగా కేంద్రానికి విజ్ఞప్తిచేయాలని కోరినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో ఓబీసీలుగా గుర్తించకపోవడంతో ఆ 26 కులాలకు చెందినవారు ఉద్యోగ, విద్య అవకాశాలను కోల్పోతున్నారని... దీనిపై త్వరగా నిర్ణయం వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.