విదేశీ విద్యపై తగ్గని మోజు! | Leverage Survey On Foreign Education | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యపై తగ్గని మోజు!

Published Wed, Apr 22 2020 2:11 AM | Last Updated on Wed, Apr 22 2020 4:27 AM

Leverage Survey On Foreign Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలోనూ విదేశీ విద్యపై విద్యార్థుల ఆసక్తి తగ్గట్లేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా చదువుకునేందుకు విదేశాలకు వెళ్లే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనేక దేశాల్లో కరోనా కారణంగా పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా.. వచ్చే 6 నెలల నుంచి 10 నెలల్లోగా విదేశాలకు వెళ్లేందుకు మన విద్యార్థులు సిద్ధం అవుతున్నట్లు లీవరేజ్‌ ఎడ్యు సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సహకారం అందించే ఈ సంస్థ ప్రస్తుత కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆసక్తిపై సర్వే నిర్వహించింది.

టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు చెందిన వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ విభాగం కూడా అదే అంశాన్ని వెల్లడించింది. వచ్చే 6 నుంచి 10 నెలల్లో విదేశాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయన్న అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ఏటా దేశవ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. దీంతో వచ్చే 10 నెలల కాలంలో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులతో మాట్లాడి నివేదిక రూపొందించింది.

లీవరేజ్‌ సర్వేలో తేలిన అంశాలివే..
– దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 76 శాతం మంది విద్యార్థులు రాబోయే 6 నుంచి 10 నెలల్లో విదేశాల్లో తమ విద్యను కొనసాగించాలని భావిస్తున్నట్లు తేలింది.
– ఈ వేసవి ముగిసే నాటికి తాము విదేశాల్లో చదువుకునే అంశంపై నిర్ణయం తీసుకుంటామని 16 శాతం విద్యార్థులు పేర్కొన్నారు.
– 8 శాతం మంది విద్యార్థులు మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా విదేశాల్లో చదువుకునే అంశాలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. తర్వాత ఆలోచిస్తామని చెప్పారు.
– సెప్టెంబర్‌ నుంచి జనవరి నాటికి అంతర్జాతీయ యూనివర్సిటీలు చేపట్టే చర్యల ఆధారంగా, అక్కడి పరిస్థితులను బట్టి తమ నిర్ణయాల్లో మార్పులు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామని 25 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది.
– 70 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు అంతర్జాతీయంగా అరోగ్య సంరక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఆరోగ్య సంరక్షణకు కెనడా, బ్రిటన్‌ అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయని, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, భారత్, జర్మనీ, స్వీడన్, ఫిన్‌లాండ్‌ ఉన్నట్లు పేర్కొన్నారు.
– సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 76 శాతం మంది పీజీ కోసం విదేశాలకు వెళ్తామని చెప్పగా, మిగతా 34 శాతం మంది విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదివేందుకు వెళతావుని చెప్పారు.
– విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బ్రిటన్‌ వెళ్తామని చెప్పుకొచ్చారు. బ్రిటన్‌లో చదువుకుంటామని 28 శాతం మంది చెప్పగా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్‌లో చదువుకుంటామని 20 శాతం మంది విద్యార్థులు పేర్కొన్నారు. కెనడాలో చదువుకునేందుకు 15 శాతం మంది, అమెరికాలో చదువుకునేందుకు 18 శాతం మంది ఆసక్తి కనబరిచారు.

ప్రణాళికలు మార్చుకోవట్లేదు..
విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఎక్కువ మంది కరోనా కారణంగా తమ ప్రణాళికలు మార్చుకోవట్లేదని టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు చెందిన వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ విభాగం పేర్కొంది. రానున్న 6 నెలల్లో విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో 73 శాతం మంది నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు తెలిపింది. ప్రణాళికలను మార్చుకున్న 27 శాతం మందిలో సగం మాత్రం తమ ప్రణాళికలను వచ్చే ఏడాదికి లేదా ఆపై సంవత్సరానికి వాయిదా వేసుకున్నట్లు తెలిపారని వెల్లడించింది. మిగతా సగం మంది ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్స్‌పై ఆసక్తి కనబర్చినట్లు తేలింది. ఇటీవల వస్తున్న సర్వేల్లో మాత్రం దేశంలోనే చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. గతవారం నిర్వహించిన సర్వేలో 31 శాతం మంది తమ ప్రణాళికలు మార్చుకున్నట్లు వెల్లడించింది. చదవండి: కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా! 

ప్రభావం ఎక్కువే ఉంటుంది..
విదేశాలకు వెళ్లే విద్యార్థులపై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, అది దేశీయ విద్యకు ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే 70 శాతం విద్యార్థులపై ఆ ప్రభావం ఉందని ఢిల్లీలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అండ్‌ ఫైనాన్స్‌ ఫౌండర్, డైరెక్టర్‌ జితిన్‌ చాడా ఇటీవల పేర్కొన్నారు. అమెరికా, ఐరోపాకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలు విరమించుకున్నారని వెల్లడించారు. విదేశీ విద్యపై కరోనా ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అన్షు చోప్రా పేర్కొన్నారు.

స్థానికంగానే తమ పిల్లలను చదివించుకునేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు కరోనా కారణంగా భారత విద్యా రంగం మెరుగుపడుతుందని, విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ చదువుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతుందని ఫరీదాబాద్‌లోని మానవ్‌ రచ్నా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ స్టడీస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ) ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుభాజిత్‌ ఘోష్‌ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయి దేశంలోనే చదువుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement