విదేశీ విద్య - వీసా ఎలా? | Overseas Education - How to visa? | Sakshi
Sakshi News home page

విదేశీ విద్య - వీసా ఎలా?

Published Mon, Jun 9 2014 5:03 AM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

విదేశీ విద్య -  వీసా ఎలా? - Sakshi

విదేశీ విద్య - వీసా ఎలా?

విదేశీ విద్య దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి దృష్టి వీసా మీదే. వీసా వస్తుందా? రాదా? మొదటి ప్రయత్నంలోనే వీసాను పొందాలంటే ఏయే విధానాలు పాటించాలి? దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? దరఖాస్తులో ఏయే అంశాలను పొందుపరచాలి.. ఇలా ఎన్నో సందేహాలు.. ఈ నేపథ్యంలో వీసా ప్రక్రియ వివరాలు..
 
దరఖాస్తు ఇలా

యూనివర్సిటీ అడ్మిషన్ లేదా కన్ఫర్మేషన్ లెటర్ అందిన వెంటనే వీసా ప్రక్రియను ప్రారంభించాలి. వీసా మంజూరు కోసం వర్సిటీలు ఇచ్చేఅడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తప్పనిసరి. వీసా కోసం కోర్సు ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. మరికొన్ని దేశాలు ఆరునెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించాయి. దరఖాస్తు చేసే ముందే సంబంధిత వివరాలన్నీ తెలుసుకోవాలి. ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్‌లలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా దేశాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. వీసాకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత దేశ కాన్సులేట్‌కు ఫోన్ లేదా మెయిల్ చేసి తెలుసుకోవచ్చు.
 
ముందుగా ఇంటర్వ్యూ

వీసా కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు ముందుగా ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. వీసా ప్రక్రియలో దీన్ని చాలా ముఖ్య దశగా పరిగణించాలి.
 
ఇంటర్వ్యూ ఇంతసేపు ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. వ్యక్తులను బట్టి సమయం మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో పది నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తవుతుంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఇంటర్వ్యూలో సాధారణంగా అకడెమిక్ రికార్డు, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్, భవిష్యత్ లక్ష్యాలు, ఎంచుకున్న కోర్సు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఈ విధంగా ఉండొచ్చు..
     
సంబంధిత దేశానికి (ఉదాహరణకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా) ఎందుకు రావాలనుకుంటున్నారు?
     ఎక్కడ ఉంటారు?
     ఎవరి దగ్గర ఉంటారు?
     {పస్తుతం మీ వృత్తి ?
     ఎన్నేళ్ల అనుభవం ఉంది?
     కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి వెళతారా?
     భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?
     సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయా?
 
నిర్ణయాత్మక అంశాలు
 
వీసా ప్రాసెస్‌లో అకడెమిక్ రికార్డు కీలకపాత్ర పోషిస్తుంది. సంబంధిత ఎగ్జామ్స్‌లో చక్కని స్కోర్‌తోపాటు అకడెమిక్ రికార్డులో బ్యాక్‌లాగ్స్ లేకుండా చూసుకోవాలి. బ్యాక్‌లాగ్స్ కారణంగా కొన్నిసార్లు వీసా మంజూరు చేయకపోవచ్చు. వీటికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన వాదన సహేతుకంగా ఉంటే వీసా మంజూరు చేస్తారు. వీసా పొందే క్రమంలో కీలకాంశం విద్యార్థి ఆర్థిక స్థోమత. వీసా మంజూరు చేసేందుకు సదరు విద్యార్థి ఆర్థిక స్థోమతను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నా రు. కోర్సు ఫీజు, సంబంధిత దేశంలో కోర్సు కాల వ్యవధిలో నివసించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయూ? లేవా? అనే విషయూలను కూడా వీసా మంజూరుకు ముందు పరిశీలిస్తున్నారు.
 
 బాడీ లాంగ్వేజ్ ముఖ్యం
 
ఉన్నతవిద్య దిశగా.. ప్రవేశ ప్రక్రియలో విజయం సాధించడం ఎంత ముఖ్యమో.. వీసా ఇంటర్వ్యూలో గట్టెక్కడం కూడా అంతే ముఖ్యం. ఇంట ర్వ్యూ విజయంలో బాడీ లాంగ్వేజ్ కీలకమైంది. మనం ఎంత స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇస్తున్నామనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. అందుకే ఇంటర్వ్యూలో ఎంతో అప్రమత్తంగా సమాధానాలివ్వాలి. ఆకట్టుకునే విధంగా సరళంగా, సూటిగా సమాధానం చెప్పాలి. మాట్లాడే తీరును బట్టి భాష మీద పట్టు ఉందనే విషయం స్పష్టం కావాలి. అడిగిన ప్రశ్నల పరిధి మేరకే సమాధానం చెప్పాలి. కోర్సు పూర్తయ్యాక ఉన్న అవకాశాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వస్తాం అనే సమాధానం చెప్పడం ఉత్తమం.
 
 వర్సిటీ ఎంపిక కీలకమే
 
యూనివర్సిటీ ఎంపిక కూడా ఒక్కోసారి కీలకంగా మారుతుంది. కాబట్టి సరైన యూనివర్సిటీ, కోర్సును ఎంచుకోవాలి. ఉదాహరణకు 70 శాతం అకడెమిక్ రికార్డు ఉన్న విద్యార్థి.. 55 శాతం అకడెమిక్ రికార్డును పరిగణించే యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే వీసా తప్పకుండా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కారణం తన ప్రతిభకు సరితూగే యూనివర్సిటీని ఎంచుకోకపోవడమే. ఇటీవలి కాలంలో నకిలీ యూనివర్సిటీల భాగోతం బయటకు వస్తున్న తరుణంలో సంబంధిత ఏజెన్సీల అక్రెడిటేషన్‌ఉన్న యూనివర్సిటీలనే ఎంచుకోవాలి. ఒక్కోసారి అక్కడి యూనివర్సిటీ/ఏదైనా సంస్థ మంజూరు చేసిన స్కాలర్‌షిప్ లభిస్తే.. వీసా పొందడానికి ఆ అంశం కూడా అడ్వాంటేజ్‌గా ఉంటుంది.
 
 రెండోసారి
 
ఒకసారి వీసా రిజెక్ట్ అయినా.. పరిస్థితులకనుగుణంగా డాక్యుమెంట్స్, టెస్ట్ స్కోర్స్ సంబంధిత అంశాల్లో కొన్ని మార్పులు చేసి(ఉంటేనే).. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి దరఖాస్తు చేసుకోవడం వల్ల అవకాశాలు తక్కువగా ఉంటాయని భావించడం సరికాదు. రెండోసారి కూడా మొదటిసారిగానే అవకాశాలు ఉండొచ్చు. అందుకు మొదటిసారి వీసా నిరాకరణకు గల కారణాలను సహేతుకంగా వివరించాలి. ఆ కారణాలను వీసా ఆఫీసర్ సమంజసం అని భావిస్తేనే ఇది సాధ్యం. గతంలో కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తే.. ఆ యూనివర్సిటీ ప్రవేశ పత్రంతో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 వీసా దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు

 పాస్‌పోర్ట్
     
వీసా దరఖాస్తు
     
అడ్మిషన్/కన్ఫర్మేషన్ లెటర్
     
అకడెమిక్ అర్హతల ధ్రువ పత్రాలు
     
కోర్సు ఫీజు రసీదులు
     
నిర్దేశిత పరీక్షల (జీఆర్‌ఈ, టోఫెల్, జీమ్యాట్, ఐఈఎల్‌టీఎస్ తదితర) స్కోర్ కార్డులు
     
ఆర్థిక స్థోమత ఉన్నట్లు రుజువు (ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్)
     
సదరు విద్యార్థిని వేరే వ్యక్తులు స్పాన్సర్ చేస్తే.. సంబంధిత స్పాన్సర్ ఇచ్చే లెటర్, స్పాన్సరర్ ఐటీ స్టేట్‌మెంట్
 
 ముఖ్యమైన వెబ్‌సైట్స్
www.gov.uk
www.ustraveldocs.com
www.ica.gov.sg
www.immi.gov.au
www.immigration.govt.nz
www.immigration.ca/en/

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement