వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా! | Tips To Crack Student Visa Interview To Study Abroad: Does And Not Does | Sakshi

వీసా ఇంటర్వ్యూకు వెళ్తున్నారా? ఇలా అస్సలు చేయొద్దు

Published Fri, Jul 9 2021 1:04 PM | Last Updated on Fri, Jul 9 2021 2:10 PM

Tips To Crack Student Visa Interview To Study Abroad: Does And Not Does - Sakshi

నిజానికి స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులు విమానం ఎక్కాలా.. వద్దా.. అని నిర్ణయించేది ఈ వీసా ఇంటర్వ్యూనే!

విదేశీ చదువు ఒక డోర్‌ అనుకుంటే.. దాన్ని తెరిచే ‘కీ’.. వీసా ఇంటర్వ్యూ! నిజానికి స్టడీ అబ్రాడ్‌ విద్యార్థులు విమానం ఎక్కాలా.. వద్దా.. అని నిర్ణయించేది ఈ వీసా ఇంటర్వ్యూనే! ఫారిన్‌ ఎడ్యుకేషన్‌ దరఖాస్తు ప్రక్రియలో చివరి అంకమైన వీసా ఇంటర్వ్యూ అత్యంత కీలకమైంది. కాని విదేశాల్లో చదవాలని కలలు కనే ఎంతో మంది ప్రతిభావంతులు... వీసా ఇంటర్వ్యూలో తడబడి అవకాశాన్ని జార విడుచు కుంటున్నారు. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఫాల్‌ సెషన్‌ (ఆగస్టు–సెప్టెంబర్‌)కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. వీసా ఇంటర్వ్యూల తీరుతెన్నులపై ప్రత్యేక కథనం...

ఇంటర్వ్యూ ఉద్దేశం
స్టడీ అబ్రాడ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు... సదరు విదేశంలో నివసించేందుకు, విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నారా.. అనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. చదువు పూర్తయిన తర్వాత అభ్యర్థి స్వదేశానికి తిరగి వెళ్తాడా లేదా అనే విషయాన్ని  అంచనా వేస్తారు. అంతేకాకుండా విద్యార్థి ఇచ్చే సమాధానాల్లో నిజాయితీని కూడా చూస్తారు. 

ఒక్కోదేశంలో ఒక్కో తీరు
► విదేశీ విద్యకు సంబంధించి వీసా ఇంటర్వ్యూ విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. 

► అమెరికాలో విద్యను అభ్యసించాలంటే.. ఎఫ్‌–1 వీసా పొందాల్సి ఉంటుంది. దీని కోసం వీసా ఇంటర్వ్యూకు హాజరవడం తప్పనిసరి.
 
► యూకే బోర్డర్‌ ఏజెన్సీ సైతం వీసా ఇంటర్వ్యూని తిరిగి ప్రవేశపెట్టింది. ఒకసారి వీసా తిరస్కారానికి గురైన లేదా ప్రామాణిక టెస్టుల్లో తక్కువ స్కోర్లు పొందిన అభ్యర్థులను వీసా ఇంటర్వ్యూకి పిలిచే అవకాశాలు ఎక్కువ.

► స్టడీ అబ్రాడ్‌ పరంగా మరో ముఖ్యమైన దేశం కెనడాకు సంబంధించి అవసరం అనుకుంటేనే విద్యార్థులను వీసా ఇంటర్వ్యూకు పిలుస్తారు. కెనడాలో స్టూడెంట్‌ వీసా పొందాలంటే.. వైద్య పరీక్షలు తప్పనిసరి. 


ఆస్ట్రేలియా భిన్నంగా

ఆస్ట్రేలియా.. దరఖాస్తు ఆధారంగా అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలవాలా.. వద్దా అనేది నిర్ణయిస్తోంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏదైనా ఒకటి జరగొచ్చు.
► వీసా ఇంటర్వ్యూయర్‌ అభ్యర్థిని టెలిఫోన్‌ ద్వారా ఇంటర్వ్యూ చేయడం.
► అభ్యర్థిని పిలిచి నేరుగా ఇంటర్వ్యూ చేయడం.
► మరింత సమాచారం కోరుతూ అభ్యర్థికి లెటర్‌ రాయడం.
► ఇంటర్వ్యూ నిర్వహించకుండానే అభ్యర్థికి తిరస్కరణ లేఖ పంపడం.
► ఇంటర్వ్యూ నిర్వహించకుండా వీసా మంజూరు చేయడం. 


అవసరమైన పత్రాలు

వీసా ఇంటర్వ్యూలో ప్రధానంగా అప్లికేషన్‌ లేదా వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను అడుగుతారు. దీంతోపాటు ఇంటర్వ్యూయర్‌ కింది డాక్యుమెంట్లలో దేన్నైనా అడిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆయా డాక్యుమెంట్లను సిద్ధంగా తమ వద్ద ఉంచుకోవడం మంచిది. అవి.. పాస్‌పోర్ట్, ఫీజు రిసీట్, 10–12 తరగతులు, బ్యాచిలర్‌ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల మెమోలు, జీఆర్‌ఈ/జీమ్యాట్‌/శాట్‌ స్కోర్‌కార్డ్స్, వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సర్టిఫికెట్‌.

ఫైనాన్షియల్‌ ప్రొఫైల్‌
వీసా ఇంటర్వూ్వ ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యమైంది.. విద్యార్థి ఫైనాన్షియల్‌ ప్రొఫైల్‌. అభ్యర్థి సదరు దేశంలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమతను కలిగి ఉన్నాడా.. లేదా? అనే నిర్ణయానికి వచ్చేందుకు పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. అవి.. –లోన్‌ అప్రూవల్‌ లెటర్, సేవింగ్స్‌ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ (3 నెలలు), ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్స్‌(3 సంవత్సరాలు).


ఇలా చేస్తే మేలు

► వీసా ఇంటర్వ్యూను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూయర్‌ అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని.. సమాధానాలను చక్కటి ఇంగ్లిష్‌లో చెప్పగలిగేలా ఉండాలి. 

► చేరేబోయే ప్రోగ్రామ్‌ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఆ కోర్సును సదరు దేశంలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారో చెప్పి ఒప్పించగలగాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశంలో లభించే ఉద్యోగ అవకాశాలను వివరించేలా సిద్ధంకావాలి. 

► ఇంటర్వ్యూయర్‌ వద్దకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. తక్కువ సమయంలో ఇంటర్వ్యూని ముగించాలని భావిస్తుంటారు. కాబట్టి సమాధానాలను సూటిగా చెప్పడం ద్వారా ఇంటర్వ్యూయర్‌ మనుసు గెలవొచ్చు. 

అడిగే ప్రశ్నలు
► వీసా ఇంటర్వ్యూయర్‌ పలు ప్రశ్నలను అడిగేందుకు ఆస్కారం ఎక్కువ. అవి...
► విదేశీ విద్య కోసం ఈ దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు
► భారత్‌లో ఎందుకు చదవాలనుకోవడం లేదు
► ఎందుకు నిర్దిష్ట ప్రోగ్రామ్‌ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు
► మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే(సదరు దేశం) ఉద్యోగం అవకాశం దక్కితే ఏం చేస్తారు
► ఒకవేళ వ్యక్తిగత ఆర్థిక స్థోమత విద్యాభ్యాసానికి సహకరించని పరిస్థితుల్లో మీ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయి?


డూస్‌.. డోంట్స్‌

► చక్కటి వస్త్రధారణతోపాటు సంభాషణ, ప్రవర్తనపై దృష్టిపెట్టాలి.
► ప్రశ్నలను ఆసాంతం విని..తర్వాత సమాధానానికి ఉపక్రమించాలి.
► ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ఇంటర్వ్యూయర్‌తో వాదించడం సరికాదు. 
► సదరు దేశం, విద్యనభ్యసించబోతున్న విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవాలి.
► అవసరమైన డాక్యుమెంట్లను వెంట సిద్ధంగా ఉంచుకోవాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement