interviews Tips
-
ట్రెండ్ మారింది, గుడ్‌వర్కర్ నుంచి డిజిటల్ వాకిన్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫాం
న్యూఢిల్లీ: కార్మికులు మొదలుకుని ఉన్నతోద్యోగుల వరకు వివిధ రకాల ఉద్యోగుల నియామకానికి సంబంధించి దేశీయంగా తొలి డిజిటల్ వాకిన్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించినట్లు గుడ్‌వర్కర్ సంస్థ వెల్లడించింది. ఓడ బ్ల్యూవీఐ ప్లాట్‌ఫాంతో సాంప్రదాయ ఆఫ్‌లైన్ వాకిన్ అనుభూతిని తమ గుడ్‌వర్కర్ యాప్‌లో ఆన్లైన్ విధానంలో పొందవచ్చని పేర్కొంది. ఇంటర్వ్యూ చేసే వారు, ఉద్యోగార్థులు వ ర్చువల్‌గా ముఖాముఖి భేటీ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని గుడ్‌వర్కర్ తెలిపింది. దీనితో భౌతికంగా ప్రయాణాలు చేయాల్సి న భారం తగ్గుతుందని, రిక్రూట్మెంట్ వ్య వస్థకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. -
Interview Tip: ఆమె థింకింగ్ వేరె లెవల్.. జాబ్ కోసం ఇలా కూడా చేస్తారా?
ఒక పనిని ఒకే విధంగా చేయాలి అనే రూలేమీ లేదు. ఎవరికి నచ్చిన విధంగా వారు తమ వినూత్న ఆలోచనతో పనిచేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటుచేసుకుంది. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చాలా స్మార్ట్‌గా ఆలోచించింది. అందులో భాగంగానే కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసి.. కంపెనీకి పంపించింది. ఆమె చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. నార్త్ కరోలీనాకు చెందిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్బర్న్ అనే మహిళ సాంప్రదాయ పద్ధతికి విరుద్ధంగా కేక్‌పై తన రెజ్యూమ్‌ను ప్రింట్ చేసింది. అనంతరం, ఆ కేక్‌ను ప్రముఖ సంస్థ ‘నైకీ’కి పంపించింది. ఈ సందర్భంగా ఆమె.. ఎందుకు ఇలా చేశానో సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. కొన్ని వారాల క్రితం తాను కేక్‌పై రాసిన రెజ్యూమ్ని నైకీ కంపెనీకి పంపినట్లు పేర్కొంది. నైకీ కంపెనీ టీం ప్రస్తుతం ఎలాంటి పోస్ట్‌లకు రిక్రూట్ చేసుకోవడం లేదని తెలిపింది. అయితే, తన గురించి నైకీ కంపెనీలో ఉద్యోగం సాధించడమే తన టార్గెట్ అని పేర్కొంది. ఈ విషయం నైకీ టీంకి తెలియజేయడం కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఇలా చేసినట్టు చెప్పింది. అందుకే కేక్‌పై రెజ్యూమ్ ప్రింట్ చేసి పంపినట్లు వివరించింది. నైకీ కంపెనీ హెడ్ ఆఫీసులో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని తనను తాను సమర్ధించుకుంది. కాగా, ఆమె చేసిన కేక్ రెజ్యూమ్ ఆలోచన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొంతమంది ఆమె ఆలోచనను మెచ్చుకున్నారు. కంపెనీ యాజమాన్యం దృష్టిని ఆకర్షించేందుకు అద్భుతమైన కాన్సెప్ట్ అని అన్నారు. మరికొంత మంది మాత్రం ఆమె జిమ్మిక్స్ చేస్తుందంటూ కామెంట్స్ చేశారు. Did you like Karly's idea?https://t.co/tr4SAmwLD6 — IndiaToday (@IndiaToday) September 27, 2022 -
APPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్..
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులకు మోడల్ ఇంటర్వ్యూల కోసం ఉచిత శిక్షణ, దిశానిర్దేశం చేయనున్నట్టు ఏపీ స్టడీ సర్కిల్ సంచాలకుడు కె.హర్షవర్థన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు ఈ నెల 15 నుంచి మౌఖి క పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించిందన్నారు. చదవండి: AP: మీరు టీచరా?.. ఈ నూతన మార్గదర్శకాలు మీకోసమే.. ఈ నేపథ్యంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా ఆ అభ్యర్థులకు తగిన తర్ఫీదు ఇచ్చేందుకు మోడల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏడాదికి రూ.6 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఇతర అభ్యర్థులు ఈ నెల 13వ తేదీలోపు ఏపీటీడీసీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్ పోర్టల్ నందు దరఖాస్తు చేసుకోవాలని హర్షవర్థన్ సూచించారు. -
ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ సింపుల్ ట్రిక్స్ మర్చిపోకండి
చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం ప్రతి ఒక్కరి కల. అందుకోసం ముందు ఇంటర్వ్యూను ఛేదించాల్సి ఉంటుంది. చాలామంది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలో తెలియక అవకాశాలను కోల్పోతుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. సులభంగానే ఇంటర్వ్యూలో సక్సెస్ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. సంస్థ గురించి ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి అధ్యయనం చేసి..అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దరఖాస్తు చేసిన ఉద్యోగం, నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలపైనా అవగాహన కలిగి ఉండాలి. మంచి వస్త్రధారణ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వస్త్రధారణ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తేడా వస్తే రిక్రూటర్లు అభ్యర్థిని త్వరగానే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి తగినట్లు వస్త్రధారణ హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. చదవండి: వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా! కాస్త ముందుగానే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి సంస్థ వద్దకు చేరుకోవడం కంటే.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లేలా చూసుకోవాలి. దాంతో అనవసరపు ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి చేరుకోవడమో లేదా ఆలస్యంగా వెళ్లడమో చేస్తే గందరగోళ పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. హుందాగా వ్యవహరించాలి సంస్థలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకూ.. ఎంతో హుందాగా వ్యవహరించాలి. గేట్ దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి.. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల దాకా.. సంస్థలో ఎంతో మంది ఎదురవుతారు. వీరందరితో హుందాగా ప్రవర్తించాలి. కరచాలనం, పలకరించే సందర్భాల్లో పద్ధతిగా మసలుకోవాలి. ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష, భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి. నిజాయితీ ముఖ్యం ఇంటర్వ్యూ చేసేవారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే.. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి. అంతేతప్ప ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. ఏదో ఒకటి చెబితే ఆ విషయాన్ని రిక్రూటర్లు సులభంగానే గుర్తిస్తారు. హావభావాలు ఇంటర్వ్యూలో హావభావాలు కూడా ముఖ్యమే. చేతులు కట్టుకొని కూర్చోకూడదు. కాళ్లు కదపడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం వంటి చేష్టలు అస్సలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండటం, అవసరమైతే సందర్భానుసారంగా చిరునవ్వు చిందించడం అవసరం. ఇవి తీసుకెళ్లాలి ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు జాబ్ అప్లికేషన్‌తోపాటు రెజ్యూమ్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమ్‌లో పేర్కొన్నవాటికి భిన్నంగా ఉండకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత చివర్లో బోర్డ్ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం మరిచిపోవద్దు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూ గట్టెక్కి.. కోరుకున్న కొలువు సొంతమవుతుంది!! -
వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా!
విదేశీ చదువు ఒక డోర్ అనుకుంటే.. దాన్ని తెరిచే ‘కీ’.. వీసా ఇంటర్వ్యూ! నిజానికి స్టడీ అబ్రాడ్ విద్యార్థులు విమానం ఎక్కాలా.. వద్దా.. అని నిర్ణయించేది ఈ వీసా ఇంటర్వ్యూనే! ఫారిన్ ఎడ్యుకేషన్ దరఖాస్తు ప్రక్రియలో చివరి అంకమైన వీసా ఇంటర్వ్యూ అత్యంత కీలకమైంది. కాని విదేశాల్లో చదవాలని కలలు కనే ఎంతో మంది ప్రతిభావంతులు... వీసా ఇంటర్వ్యూలో తడబడి అవకాశాన్ని జార విడుచు కుంటున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఫాల్ సెషన్ (ఆగస్టు–సెప్టెంబర్)కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. వీసా ఇంటర్వ్యూల తీరుతెన్నులపై ప్రత్యేక కథనం... ఇంటర్వ్యూ ఉద్దేశం స్టడీ అబ్రాడ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు... సదరు విదేశంలో నివసించేందుకు, విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నారా.. అనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. చదువు పూర్తయిన తర్వాత అభ్యర్థి స్వదేశానికి తిరగి వెళ్తాడా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా విద్యార్థి ఇచ్చే సమాధానాల్లో నిజాయితీని కూడా చూస్తారు. ఒక్కోదేశంలో ఒక్కో తీరు ► విదేశీ విద్యకు సంబంధించి వీసా ఇంటర్వ్యూ విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ► అమెరికాలో విద్యను అభ్యసించాలంటే.. ఎఫ్–1 వీసా పొందాల్సి ఉంటుంది. దీని కోసం వీసా ఇంటర్వ్యూకు హాజరవడం తప్పనిసరి. ► యూకే బోర్డర్ ఏజెన్సీ సైతం వీసా ఇంటర్వ్యూని తిరిగి ప్రవేశపెట్టింది. ఒకసారి వీసా తిరస్కారానికి గురైన లేదా ప్రామాణిక టెస్టుల్లో తక్కువ స్కోర్లు పొందిన అభ్యర్థులను వీసా ఇంటర్వ్యూకి పిలిచే అవకాశాలు ఎక్కువ. ► స్టడీ అబ్రాడ్ పరంగా మరో ముఖ్యమైన దేశం కెనడాకు సంబంధించి అవసరం అనుకుంటేనే విద్యార్థులను వీసా ఇంటర్వ్యూకు పిలుస్తారు. కెనడాలో స్టూడెంట్ వీసా పొందాలంటే.. వైద్య పరీక్షలు తప్పనిసరి. ఆస్ట్రేలియా భిన్నంగా ఆస్ట్రేలియా.. దరఖాస్తు ఆధారంగా అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలవాలా.. వద్దా అనేది నిర్ణయిస్తోంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏదైనా ఒకటి జరగొచ్చు. ► వీసా ఇంటర్వ్యూయర్ అభ్యర్థిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం. ► అభ్యర్థిని పిలిచి నేరుగా ఇంటర్వ్యూ చేయడం. ► మరింత సమాచారం కోరుతూ అభ్యర్థికి లెటర్ రాయడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండానే అభ్యర్థికి తిరస్కరణ లేఖ పంపడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండా వీసా మంజూరు చేయడం. అవసరమైన పత్రాలు వీసా ఇంటర్వ్యూలో ప్రధానంగా అప్లికేషన్ లేదా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్‌ను అడుగుతారు. దీంతోపాటు ఇంటర్వ్యూయర్ కింది డాక్యుమెంట్లలో దేన్నైనా అడిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆయా డాక్యుమెంట్లను సిద్ధంగా తమ వద్ద ఉంచుకోవడం మంచిది. అవి.. పాస్‌పోర్ట్, ఫీజు రిసీట్, 10–12 తరగతులు, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల మెమోలు, జీఆర్ఈ/జీమ్యాట్/శాట్ స్కోర్‌కార్డ్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్. ఫైనాన్షియల్ ప్రొఫైల్ వీసా ఇంటర్వూ్వ ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యమైంది.. విద్యార్థి ఫైనాన్షియల్ ప్రొఫైల్. అభ్యర్థి సదరు దేశంలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమతను కలిగి ఉన్నాడా.. లేదా? అనే నిర్ణయానికి వచ్చేందుకు పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. అవి.. –లోన్ అప్రూవల్ లెటర్, సేవింగ్స్ బ్యాంక్ స్టేట్మెంట్ (3 నెలలు), ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్స్(3 సంవత్సరాలు). ఇలా చేస్తే మేలు ► వీసా ఇంటర్వ్యూను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌పై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూయర్ అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని.. సమాధానాలను చక్కటి ఇంగ్లిష్‌లో చెప్పగలిగేలా ఉండాలి. ► చేరేబోయే ప్రోగ్రామ్ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఆ కోర్సును సదరు దేశంలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారో చెప్పి ఒప్పించగలగాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశంలో లభించే ఉద్యోగ అవకాశాలను వివరించేలా సిద్ధంకావాలి. ► ఇంటర్వ్యూయర్ వద్దకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. తక్కువ సమయంలో ఇంటర్వ్యూని ముగించాలని భావిస్తుంటారు. కాబట్టి సమాధానాలను సూటిగా చెప్పడం ద్వారా ఇంటర్వ్యూయర్ మనుసు గెలవొచ్చు. అడిగే ప్రశ్నలు ► వీసా ఇంటర్వ్యూయర్ పలు ప్రశ్నలను అడిగేందుకు ఆస్కారం ఎక్కువ. అవి... ► విదేశీ విద్య కోసం ఈ దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు ► భారత్‌లో ఎందుకు చదవాలనుకోవడం లేదు ► ఎందుకు నిర్దిష్ట ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ► మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే(సదరు దేశం) ఉద్యోగం అవకాశం దక్కితే ఏం చేస్తారు ► ఒకవేళ వ్యక్తిగత ఆర్థిక స్థోమత విద్యాభ్యాసానికి సహకరించని పరిస్థితుల్లో మీ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయి? డూస్.. డోంట్స్ ► చక్కటి వస్త్రధారణతోపాటు సంభాషణ, ప్రవర్తనపై దృష్టిపెట్టాలి. ► ప్రశ్నలను ఆసాంతం విని..తర్వాత సమాధానానికి ఉపక్రమించాలి. ► ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ఇంటర్వ్యూయర్‌తో వాదించడం సరికాదు. ► సదరు దేశం, విద్యనభ్యసించబోతున్న విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవాలి. ► అవసరమైన డాక్యుమెంట్లను వెంట సిద్ధంగా ఉంచుకోవాలి. -
ఏపీపీఎస్సీ.. గ్రూప్–1 (2011) ఇంటర్వ్యూ టిప్స్
సమకాలీన అంశాలపై పట్టు గ్రూప్–1 ఇంటర్వూ్య అభ్యర్థులు సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. అభివృద్ధి కారక అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక అభివృద్ధితో సంబంధంలేని అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల్లోని బిడియాన్ని తొలగించేందుకు, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ఇంటర్వూ్య బోర్డ్ సభ్యులు.. ఇటీవల మీరు చూసిన సినిమా ఏంటి? ఆ సినిమాపై మీ అభిప్రాయం? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే ఎక్కువగా వీటిపై దృష్టి పెట్టకుండా.. సమకాలీనంగా ముఖ్యమైన పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. పని నేపథ్యం.. ఇప్పుడు ఇంటర్వూ్యలు నిర్వహిస్తున్న గ్రూప్–1 పోస్టులకు సంబంధించి తొలి నోటిఫికేషన్ 2011లోనే వెల్లడైంది. కానీ అనూహ్య కారణాల వల్ల కోర్టు జోక్యం వరకు వెళ్లి ఒక కొలిక్కి రావడానికి ఐదున్నరేళ్లకుపైగానే పట్టింది. తొలి నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అధిక శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారు. వీరు ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న విధులపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అభ్యర్థులు నిర్వహిస్తున్న విధులు, వాటిలో సాధించిన విజయాలు లేదా విధి నిర్వహణలో ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలు, వాటి ఫలితాలు తదితరాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు వీటికి అనుగుణంగా సన్నద్ధమై ఇంటర్వూ్యకు వెళ్లాలి. అకడమిక్ నేపథ్యం ఇంటర్వూ్యకు హాజరయ్యే అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ అకడమిక్ నేపథ్యం, తమ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యం, తమ అకడమిక్ నైపుణ్యాలను విధి నిర్వహణలో ఎలా అన్వయిస్తారో సమర్థంగా చెప్పగలిగేలా ఇంటర్వూ్యకు సన్నద్ధమవ్వాలి. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ అభ్యర్థులు ఈ తరహా ప్రశ్నలకు సిద్ధంగా ఉండాలి. పునర్విభజనపై సమగ్ర అవగాహన గ్రూప్–1(2011) ఇంటర్వూ్యకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వూ్యలో రాణించేందుకు ప్రధానంగా ఉపకరించే మరో అంశం.. పునర్విభజన చట్టం. దీనివల్ల రాష్ట్రానికి మేలు జరిగిందా? లేదా? మీ అభిప్రాయం? కొత్త రాష్ట్రంగా ఏర్పాటయ్యాక తలెత్తిన పరిస్థితులపై మీ అభిప్రాయం? లాంటి ప్రశ్నలు ఎదురయ్యే అవకాశముంది. అందువల్ల పునర్విభజన చట్టం, రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలి. న్యూస్ పేపర్ రీడింగ్ అభ్యర్థులు తప్పనిసరిగా న్యూస్‌పేపర్ చదవాలి. దినపత్రికల ఎడిటోరియల్స్, ఒక అంశంపై ప్రముఖుల విశ్లేషణలను కేవలం చదవడమే కాకుండా వాటిపై స్వీయ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. ఇంటర్వూ్యలో ఒక అంశం గురించి ప్రశ్నించినప్పుడు కేవలం తాము చదివిన అంశాలనే ప్రస్తావిస్తే.. అభ్యర్థికి స్వీయ అభిప్రాయం లేదని బోర్డ్ సభ్యులు అనుకోవచ్చు. అందువల్ల ప్రతి అంశంపై స్వీయ అభిప్రాయం, విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇంటర్వూ్యకు హాజరయ్యే రోజున అభ్యర్థులు కనీసం రెండు దినపత్రికలను చదవాలి. గతంలో చాలా సందర్భాల్లో పలువురు అభ్యర్థులను ‘ఈ రోజు న్యూస్ పేపర్లో మీరు ప్రాధాన్యంగా భావించిన న్యూస్ ఏంటి?’, ‘ఈ రోజు ఫలానా వార్తా కథనంలో పేర్కొన్న అంశాలపై మీ అభిప్రాయం ఏంటి?’ లాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేక శ్రద్ధ ఇంటర్వూ్యకు హాజరయ్యే అభ్యర్థులు తమ బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లైట్ షేడ్ డ్రెస్‌తోపాటు షూస్ ధరించడం మంచిది. అయితే అలవాటు ఉంటేనే టై ధరించాలి. ఇంటర్వూ్య సమయంలో అభ్యర్థులు తమ హావభావాలను వ్యక్తం చేయడంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా చేతులు, కాళ్లు కదిలించకూడదు. ప్రశ్న.. చర్చగా మారితే? కొన్ని సందర్భాల్లో ఇంటర్వూ్యలో అడిగిన ప్రశ్న నేరుగా జవాబు చెప్పడంతోనే ముగియకుండా.. అనుబంధ ప్రశ్నలు, బోర్డ్ సభ్యుల అభిప్రాయాలతో కలిసి చర్చగా మారొచ్చు. అలాంటప్పుడే కొందరు అభ్యర్థులు ఇబ్బంది పడతారు. సంబంధిత అంశంపై అవగాహన లేకపోతే నిజాయతీగా తమకు ఎంతవరకు తెలుసో అంతవరకే చెప్పాలి. ఇంటర్వూ్య రోజు ఆహ్లాదంగా ఇంటర్వూ్య రోజున ఆహ్లాదంగా ఉండాలి. ముఖ్యంగా అప్పటికే ఇంటర్వూ్య పూర్తయిన అభ్యర్థులతో బోర్డ్ సభ్యులు అడిగిన ప్రశ్నల గురించి చర్చించొద్దు. వ్యవధి ఉంటే మీతోపాటు వేచి చూస్తున్న వారితో ఆ రోజు న్యూస్ పేపర్లోని అంశాల గురించి చర్చించొచ్చు. హుందాగా.. ఇంటర్వూ్య రూమ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు హుందాగా, వినమ్రంగా వ్యవహరించాలి. ముందుగా డోర్ నాక్ చేసి బోర్డ్ సభ్యుల అనుమతి తీసుకున్నాకే గదిలోకి వెళ్లాలి. అందరినీ చూస్తూ విష్ చేయడం మరవొద్దు. తర్వాత బోర్డ్ సభ్యులు చెప్పే వరకు సీటులో కూర్చోవద్దు. సీట్లో కూర్చునే శైలి కూడా హుందాగా ఉండేలా చూసుకోవాలి. నిటారుగా కూర్చోవాలి. ఇందులోనే సగం ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. ఎదురుగా ఉన్న టేబుల్‌పై చేతులు పెట్టడం వంటివి చేయకూడదు. ఇంటర్వూ్య ముగిసిన తర్వాత కూడా అందరికీ ఆపాదించేలా ‘థ్యాంక్యూ సర్, థ్యాంక్యూ మేడమ్’ అంటూ బయటికి రావాలి. ‘ఐ’ కాంటాక్ట్.. మోస్ట్ ఇంపార్టెంట్: సివిల్స్, గ్రూప్–1 ఇలా ఇంటర్వూ్య ఏదైనా బోర్డ్ సభ్యులందరితో ఐ కాంటాక్ట్ అభ్యర్థులకు ప్రధాన అంశం. ప్రశ్న అడిగిన సభ్యుడి వైపు దృష్టిపెడుతూనే... సమాధానం చెప్పేటప్పుడు బోర్డ్‌లోని ఇతర సభ్యులను చూస్తూ చెప్పాలి. వివాదాస్పద అంశాలపై ప్రశ్నలు వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్ అప్రోచ్‌తో వ్యవహరించాలి. ఏకపక్ష ధోరణి సరికాదని గుర్తించాలి. – వి. గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ గ్రూప్–1 (2011) ఇంటర్వూ్య సన్నాహకాలు సంబంధిత సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి. అటెస్టేషన్ అవసరమైన పత్రాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అందుకు సంబంధించిన సర్టిఫికెట్ల నమూనాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నిర్దేశిత అధికారుల నుంచి ధ్రువీకరణ పొందాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీని తెలుసుకొని, దానికి ఒకరోజు ముందుగానే అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్‌లో ఇంటర్వూ్యలు నిర్వహించనున్నందున దూర ప్రాంతాల అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీకి ఒక రోజు ముందుగానే చేరుకోవడం మేలు. వీటిపై అవగాహన.. హెచ్–1బి వీసాల్లో కోత– భారత్‌పై ప్రభావం డీమానిటైజేషన్, నల్లధనాన్ని అరికట్టేందుకు ఉన్న అవకాశాలు రాష్ట్రస్థాయిలో అమలవుతున్న కొత్త పథకాలు ఫిబ్రవరి 13 నాటికి కేంద్ర బడ్జెట్ (2017–18) ప్రకటిస్తారు. కొత్త బడ్జెట్లో ముఖ్యాంశాలు, ప్రధానంగా రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు, పథకాల గురించి తెలుసుకోవడం మేలు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై అభిప్రాయం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తుంటే సంబంధిత శాఖలో అమలవుతున్న కొత్త పథకాలపై పూర్తి అవగాహన ఉండాలి. ప్రవేశాలు ఇప్లూలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ), హైదరాబాద్ వివిధ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: అండర్ గ్రాడ్యుయేట్‌కు 10+2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. పోస్ట్ గ్రాడ్యుయేట్‌కు ఏదేని డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ: 2017, ఫిబ్రవరి 8 వెబ్సైట్: www.efluniversity.ac.in బిట్స్, పిలానీలో ఎంబీఏ కోర్సులు బిట్స్, పిలానీ.. ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: క్యాట్– 2016 /జీమ్యాట్ స్కోర్. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది: 2017, ఫిబ్రవరి 15 వెబ్సైట్: www.bitsadmission.com