నయాక్రేజ్.. స్టడీ ఆబ్రాడ్ | Indian students crazy about foreign country education | Sakshi
Sakshi News home page

నయాక్రేజ్.. స్టడీ ఆబ్రాడ్

Published Tue, Sep 9 2014 11:36 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

నయాక్రేజ్.. స్టడీ ఆబ్రాడ్ - Sakshi

నయాక్రేజ్.. స్టడీ ఆబ్రాడ్

విదేశీ విద్యకు నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. భారత్ నుంచి ప్రతిఏటా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమవుతున్నారు. ప్రధానంగా అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్(యూకే), ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాం డ్‌లు విద్యార్థులకు హాట్ ఫేవరేట్‌గా మారాయి. వీటితోపాటు జర్మనీ, కెనడాల పట్ల కూడా మన విద్యార్థులు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాల్లో అత్యున్నత ప్రమాణాలను కలిగిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అందిస్తున్న కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటం.. తద్వారా అవకాశాలు విస్తృతం అవుతుండటంతో విద్యార్థులు విదేశీ విద్యవైపు మొగ్గుచూపుతున్నారు.  విదేశీ డిగ్రీకి భారత జాబ్ మార్కెట్‌లో ఉన్న డిమాండ్ కూడా విద్యార్థులు స్టడీ అబ్రాడ్ దిశగా పయనమయ్యేట్లు చేస్తోందంటున్నారు నిపుణులు. పీజీ, డాక్టోరల్ కోర్సులకు విదేశీ యూనివర్సిటీల్లో ఉన్న అధునాతన సౌకర్యాలు, ఫ్యాకల్టీ, పరిశోధనలకు ప్రోత్సాహం కూడా భారతీయ విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. ఉన్నత విద్య కోసం మన సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఆయా దేశాల్లో కోర్సులు, పేరున్న విద్యాసంస్థలు, ప్రవేశ పరీక్షలు, ఫీజులపై స్పెషల్ ఫోకస్..
 
 మొదటి ఓటు.. అమెరికాకే
 ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. భారత్‌లోని మిగతా నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు యూఎస్‌కు ఉన్నత విద్య కోసం వె ళ్తున్నట్లు తాజా సర్వే సైతం వెల్లడించింది. అక్కడ నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడమే ఇందుకు కారణం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికాకు విదేశీ విద్యార్థుల రాక భారీగా పెరుగుతోంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో 2012-13లో ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య 8,19,644. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 55 వేల మంది అధికంగా వచ్చారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉండడం గమనార్హం. తర్వాత స్థానాల్లో చైనా, కొరియా విద్యార్థులు ఉన్నారు.

అగ్రరాజ్యంలో నాణ్యమైన మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులో ఉండడం అన్ని దేశాల విద్యార్థులను ఆకర్షిస్తోంది. స్టూడెంట్స్‌లోని అసలైన శక్తిసామర్థ్యాలను వెలికితీసి, సుశిక్షితులైన మానవ వనరులుగా తీర్చిదిద్దేలా ఆయా కోర్సులు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ మిట్, స్టాన్ ఫోర్డ్, యేల్, హార్వర్డ్, ప్రిన్స్‌టన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, న్యూయార్క్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అమెరికాలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు కోర్సు ప్రారంభానికి ఏడాది నుంచి ఏడాదిన్నర ముందుగానే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 400 యూనివర్సిటీలు కామన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా యూనివర్సిటీలకు దరఖాస్తుకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమవుతుంది. అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుకు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది. ఇతర ఖర్చులు అదనం. టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీమ్యాట్, జీఆర్‌ఈ వంటి పరీక్షల్లో ప్రతిభ చూపాలి.  
 
 ఆస్ట్రేలియా
 విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్న మరోదేశం... ఆస్ట్రేలియా. అక్కడ 1200 విద్యాసంస్థలు, 22 వేల రకాల కోర్సులు ఉన్నాయి. 2013  జూలై నుంచి 2014 మార్చి వరకు 24,205 మంది భారతీయ విద్యార్థులు అస్ట్రేలియా స్టూడెంట్ వీసాలను పొందారు. గతంలో పోలిస్తే ఇది 32.9 శాతం అధికమని ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రతినిధి వెల్లడించారు.
 
 ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్‌‌సలాండ్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ వంటి మంచి పేరున్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో విద్యాసంస్థలో ప్రవేశానికి, స్టూడెంట్ వీసా కోసం ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంచుకున్న యూనివర్సిటీని బట్టి దరఖాస్తుల  తేదీలు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమై డిసెంబర్‌లో ముగుస్తుంది. ఈ దేశంలో అండర్‌గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీకి ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.8.5 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు అవుతుంది. జీవన వ్యయం దాదాపు రూ.10 లక్షలు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల్లో చేరేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టుల్లో అర్హత సాధించడం తప్పనిసరి.
 
 యునెటైడ్ కింగ్‌డమ్
 ప్రపంచంలోని అనేక ఆధునిక ఇన్‌స్టిట్యూట్స్‌కు ప్రేరణ ఆక్స్‌ఫర్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలని చెబుతారు. అలాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలు ఉన్న దేశమే యూకే. ఇక్కడ ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌లతోపాటు యూనివర్సిటీ కాలేజీ లండన్, ఇంపీరియల్ కాలేజీ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్‌‌స, కింగ్స్ కాలేజీ లండన్ వంటి ప్రఖ్యాత కాలేజీలు ఉన్నాయి. యూకేలో దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్/అక్టోబర్ నుంచి జనవరిలోగా జరుగుతుంది. సెమిస్టర్ ప్రారంభానికి మూడు నెలలు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం మేలు. యూకేలో విద్య ఖరీదైనదే. ఇక్కడ ట్యూషన్ ఫీజులు అధికంగానే ఉంటాయి. ప్రముఖ యూనివర్సిటీలో చదవాలంటే ఏడాదికి రూ.38 లక్షల వరకు ఖర్చవుతుంది.  ఇతర ఖర్చులు రూ.5 లక్షల వరకు ఉంటాయి.  
 
 న్యూజిలాండ్
 యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 50 శాతం పెరిగింది. నిబంధనలు సరళంగా ఉండటం, ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండటంతో మన విద్యార్థులు న్యూజిలాండ్ వైపు మొగ్గుచూపుతున్నారు.  ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ వర్సిటీలు ప్రతిఏటా స్థానం దక్కించుకుంటున్నాయి. ద యూనివర్సిటీ ఆఫ్ అక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ కాంటర్‌బెరీ, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్, ఏయూటీ యూనివర్సిటీ, వైకాటో యూనివర్సిటీ, మాస్సీ యూనివర్సిటీ. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ట్యూషన్ ఫీజు  రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు. కాస్ట్ ఆఫ్ లివింగ్ రూ.7 లక్షలు ఉంటుంది. న్యూజిలాండ్‌లో ఒక విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నుంచి నవంబర్. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సమ్మర్‌స్కూల్ క్రెడిట్ కోర్సులను ఆఫర్ చేస్తారు. సెమిస్టర్లను బట్టి దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు ప్రారంభానికి 8 నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మేలు.
 
 ఫ్రాన్స్
  స్టూడెంట్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న మరోదేశం.. ఫ్రాన్స్. ఫ్యాషన్, బిజినెస్, హాస్పిటాలిటీ కోర్సులను అందించడంలో ఫ్రాన్స్‌కు మంచి పేరుంది. అక్కడ బెస్ట్ అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్ ఉండడం, తక్కువ ఫీజులు, సరళమైన వీసా నిబంధనలు, ఎన్నో రకాల స్కాలర్‌షిప్స్, కోర్సు పూర్తయిన తర్వాత కూడా ఏడాదిపాటు దేశంలోనే ఉండేందుకు అనుమతి... వంటి సానుకూల కారణాల నేపథ్యంలో గత ఐదేళ్లలో ఫ్రాన్స్‌కు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఈ దేశంలో ఎకోలీ నార్మలీ సుపీరియరీ, ఎకోలీ పాలిటెక్నిక్, యూనివర్సిటీ ఫియరీ ఎట్ మేరీ క్యూరీ వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీసా కోసం మూడు నెలలు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రాన్స్‌లో ట్యూషన్ ఫీజు ప్రతి సెమిస్టర్‌కు రూ.50 వేలు. ఇతర ఖర్చులు రూ.24 వేల నుంచి రూ.49 వేల వరకు ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరంలేదు.
 
 ముందస్తు ప్రణాళికతో సులభంగా ‘వీసా’..
 ‘‘స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులు వీలైనంత ముందుగా అడ్మిషన్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం.  తర్వాత దశలో.. ఆఫర్ లెటర్, యాక్సప్టెన్స్ లెటర్ ఆధారంగా జారీ చేసే వీసా ప్రాసెస్‌ను  విజయవంతంగా ముగించుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా దేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లలో చదవాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ ప్రక్రియను అకడెమిక్ సెషన్ ప్రారంభానికి ముందు 12 నుంచి 8 నెలల సమయంలో మొదలుపెట్టాలి. దీనివల్ల అడ్మిషన్ లెటర్ సరైన సమయంలో చేతికందుతుంది. వీసా దరఖాస్తుకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా వీసా మంజూరుకు నాలుగు నుంచి ఆరు వారాల గడువు పడుతుంది. కాబట్టి అకడెమిక్ సెషన్ ప్రారంభానికి నెల రోజుల ముందు నాటికే వీసా చేతిలో ఉండే విధంగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఆఫర్ లెటర్ ఆధారంగా మంజూరు చేసే వీసా విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా యూఎస్ వీసా (ఐ-20) జారీ క్రమంలో ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థి.. సదరు కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధంగా సమాధానం ఇవ్వాలి. అంతేకాకుండా స్టడీ అబ్రాడ్ కోణంలో ఒక దేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్న విద్యార్థులు తర్వాత దశలో తమకు సరితూగే ఇన్‌స్టిట్యూట్‌లను, యూనివర్సిటీలను అన్వేషించాలి. వాటికి సదరు ప్రభుత్వ నియంత్రణ సంస్థల గుర్తింపు ఉందో, లేదో క్షుణ్నంగా పరిశీలించాలి. గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం ఖరారైతేనే అడ్డంకుల్లేకుండా వీసా మంజూరవుతుంది’’
 -అరుళ్ జోసఫ్, మేనేజర్,
 స్టడీ ఓవర్సీస్- గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement