డిప్యూటీ సీఎంకు పలువురు తల్లిదండ్రుల విజ్ఞప్తి
వీలున్నంత త్వరగా నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చిన భట్టి
జూనియర్ లెక్చరర్ల పోస్టింగులు ఇప్పించాలని అభ్యర్థన
మంత్రితో ముఖాముఖిలో 300 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తమ పిల్లలు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లారని, వారికి అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద సాయమందించాలని పలువురు తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.
గురువారం గాందీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన మల్లు భట్టి విక్రమార్కను సామాన్య ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.
విదేశీ విద్యానిధి పథకం కింద పెద్ద చదువులు చదువుకునే విద్యార్థులకు ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పిన భట్టి.. వీలున్నంత త్వరగా ఆ నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.
» తన తల్లి బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమె ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అవసరమైన సాయం అందించాలని మహేశ్ కోరగా, భట్టి వెంటనే స్పందించి ఇప్పటివరకు అయిన ఆస్పత్రి బిల్లులకు ఎల్‌ఓసీ ఇప్పించాలని తన పీఏను ఆదేశించారు. స్వయంగా తన నంబరు ఆ యువకుడికి ఇచ్చి ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని సూచించారు.
» జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తమకు పోస్టింగులు ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు భట్టికి విజ్ఞప్తి చేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
» ట్రాన్స్‌కో, జెన్‌కోలలో ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత శాఖ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేశారు.
» ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. మంత్రితో ముఖాముఖిలో భాగంగా మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే శంకర్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
భట్టి దృష్టికి పటాన్‌చెరు పంచాయితీ
పటాన్‌చెరు నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నేత లు, ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల మధ్య నెలకొన్న రాజకీయ పంచాయితీ భట్టి దృష్టికి వచ్చింది. పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో వచ్చిన నేతలంతా తమపై మహిపాల్‌రెడ్డి పెత్తనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని, తద్వారా నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని వివరించారు. ఆ తర్వాత కాట శ్రీనివాస్‌గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్‌లో భట్టితో పాటు మహేశ్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment