కాజీపేట: చదువుకోవాలని తపన ఉండి .. మెరిట్ స్టూడెంట్ అయితే చాలు .. నిరుపేదలైన బీసీ విద్యార్థులకు అర్హతను బట్టి విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. అందుకు విదేశీ విద్యా నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంతో ప్రతిభ ఉన్నా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశాల్లో చదువు అందని ద్రాక్షలాగే మారుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకానికి శ్రీకారం చుట్టింది. 2016–17 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. అక్టోబర్ 10న జీఓ నం 23 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లా నుంచి 11 మంది విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా ముగ్గురు ఎంపికయ్యారు. వారికి ప్రభుత్వం మొదటి విడతగా రూ.10లక్షలు అందజేసింది. రెండో విడతగా మరో రూ.10 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అర్హత గల దేశాలు..
యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలు వెళ్లేవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
అర్హత పరీక్షలు : ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీఎంఏటీ అభ్యర్థులు గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఉండాలి.
పాస్‌పోర్టు ఉండాలి.
ఎంపికైన యూనివర్సిటీలో ఒక సంవత్సరంలోగా చేరాలి. లేకపోతే అడ్మిషన్‌ను నిలిపివేస్తారు.
అభ్యర్థి దరఖాస్తు చేసిన కోర్సు, వీసా వివరాలు మార్చుకోవద్దు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రుణం అందించే విధానం..
ఎంపికైన అభ్యర్థులకు రూ. 20లక్షలకు గాను రెండు విడతలుగా
రూ.10 లక్షలు చెక్కులు అందజేస్తారు. అభ్యర్థులు పది లక్షల
ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి అప్లై
చేసుకోవచ్చు. స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థుల యూసీలను
సంబంధిత యూనివర్సిటీల నుంచి మాత్రమే సమర్పించాలి.
అర్హతలు, వయస్సు ..
విద్యార్థి వయస్సు దరఖాస్తు చేసే సమయానికి 30 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఈ పథకానికి అర్బన్‌లో 2 లక్షలు, రూరల్‌లో అయితే రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి ఉంటుంది.
విద్యార్హతలు: ఇంజనీరింగ్ డిగ్రీ, మేనేజ్‌మెంట్ డిగ్రీ, ప్యూర్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్ సోషల్ సైన్స్, హ్యుమానిటీ మొదలైన డిగ్రీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఒక్కో కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..
బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ వారు బీసీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి.
బీసీ–సీ వారు ఎస్సీ సంక్షేమశాఖలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
బీసీ–ఈ వారు మైనార్టీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి.
రిజర్వేషన్లు..
బీసీ–ఏ వారికి 29 శాతం, బీసీ–బీ వారికి 42 శాతం, బీసీ–డీ వారికి 29 శాతం, మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు మూడు శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment