సాక్షి, హైదరాబాద్ : ఎలాంటి పరీక్షలు లేకుండా విదేశాల్లో విద్యనభ్యసించడానికి అవసరమైన వీసా, అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ ఫేస్‌బుక్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.6.7 లక్షలు కాజేశారు. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.5 లక్షలు, నిర్ధిష్ట సమయం కంటే ముందే పంపించేస్తానంటూ మరో రూ.1.7 లక్షలు కాజేశారు. ఈ బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమీర్‌పేటకు చెందిన ఓ యువకుడు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించాడు. దీనికోసం ఇంటర్‌నెట్‌తో పాటు సోషల్‌మీడియాలోనూ సెర్చ్ చేశాడు. ఫేస్‌బుక్ ద్వారా ఈ యువకుడికి పరిచయమైన సైబర్ నేరగాడు తాను విదేశాల్లో ఉంటున్నట్లు నమ్మించాడు. మెసెంజర్, వాట్సాప్‌ల ద్వారా సంప్రదింపులు జరుపుతూ తాను ఒక కన్సల్టెంట్ అని, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్‌టీఎస్) పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా లండన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విధ్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తానంటూ నమ్మబలికాడు.
తొలుత ప్రాసెసింగ్ ఫీజుగా రూ.50 వేలు చెల్లించమని చెప్పాడు. ఆపై రకరాల రుసుముల పేర్లు చెప్పి మొత్తం రూ.5 లక్షల తన బ్యాంక్ ఖాతాల్లో, వాలెట్స్‌లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఇంత డబ్బు చెల్లించిన తర్వాత నగర యువకుడు ఎప్పుడు లండన్ పంపుతావంటూ సైబర్ నేరగాడిని పదేపదే ప్రశ్నించాడు. దీంతో వీసా, అడ్మిషన్ వ్యవహారాలు ప్రాసెసింగ్‌లో ఉన్నాయని, నిర్దేశిత సమయం కంటే తొందరగా వెళ్లాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు. దీనికి ఔనంటూ యువకుడు సమాధానం చెప్పాడు. స్పీడ్ ప్రాసెసింగ్ కోసం మరో రూ.1.7 లక్షలు చెల్లించాలంటూ చెప్పి ఆ మొత్తాన్నీ డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై నగర యువకుడు ఎంతగా ప్రయత్నించినా ఆ సైబర్ నేరగాడు అందుబాటులోకి రాలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ–యాడ్స్ యాప్ ఓఎల్‌ఎక్స్‌లో సెకండ్ హ్యాండ్ కారు విక్రయిస్తానంటూ ఉన్న ప్రకటన చూసిన నగరవాసి స్పందించాడు. అందులో ఉన్న నెంబర్‌లో సంప్రదించగా ఆర్మీ ఉద్యోగిగా అవతలి వ్యక్తి చెప్పాడు. బేరసారాల తర్వాత కారును రూ.1,75,218కి విక్రయించడానికి ఒప్పందం కుదిరింది. ఈ మొత్తం డిపాజిట్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు. చిక్కడపల్లికి చెందిన మరో వ్యక్తి కూడా రూ.1.3 లక్షలకు కారు బేరమాడి, రూ.61 వేలు చెల్లించి మోసపోయాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ పే ద్వారా చేసిన బదిలీ అవతలి వ్యక్తికి చేరలేదు. దీంతో ఆ సంస్థ కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని భావించాడు. దీనికోసం ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసిన అతగాడు ఓ నెంబర్ తీసుకుని కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు చెప్పినట్లే తన బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు వివరాలు, పిన్ నెంబర్ అందించాడు.
వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఈయన ఖాతా నుంచి రూ.92,794 కాజేశారు. తన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ.56 వేలు పోయాయంటూ దత్తాత్రేయనగర్‌కు చెందిన ఓ వైద్యుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అలానే బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి తన పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచిన సైబర్ నేరగాళ్లు స్నేహితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: ప్రేయసికి అరుదైన కానుక.. ఇద్దరూ అరెస్టు
తల్లి పక్కలో ఉండగానే అడవి జంతువుల దాడి!
Comments
Please login to add a commentAdd a comment