
శాసనమండలి ప్రశ్నోత్తరాలు
విదేశీ విద్యపై నిబంధనలను సడలిస్తాం
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ నిబంధనను రూ.2 లక్షల నుంచి పెంచడం, ప్రస్తుతమున్న ఐదు దేశాలతోపాటు జర్మనీ, న్యూజిల్యాండ్, దక్షిణకొరియా వంటి దేశాలకు అనుమతివ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి తెలిపారు.
శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సెలక్షన్ విధానంలో మార్పులు తీసుకురావాలని, ట్రంప్ విధానాలతో అమెరికా విద్యపై అభద్రతాభావం నెలకొన్న నేపథ్యంలో ఇతర దేశాల్లోనూ అనుమతివ్వాలని, కనీస అర్హత మార్కులు తగ్గించాలని సభ్యులు కోరారు. ఇప్పటివరకు 1,019 మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్యకోసం రూ.8.80 కోట్లు కేటాయించామన్నారు.
ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు
రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి
ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుని సంస్థ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటు¯న్నట్లు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లలోని 150 ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు, పెట్రోలు బంకులు, సినిమా హాళ్లు తదితరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా సంస్థకు ఏటా రూ.30 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. హెచ్‌పీసీఎల్, ఐఏసీఎల్ సంస్థలకు 69 బస్టాండ్లలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం ద్వారా ఏటా మరో రూ.4 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. 357 బస్ స్టేషన్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. పాత ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో బీబీఓటీ పథకం కింద 20 ఖాళీ స్థలాలను 33 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
10 మంది విద్యాశాఖ అధికారులపై చర్యలు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
‘కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచే ఆలోచన చేస్తున్నాం. హైదరాబాద్‌లోని 16 మదర్సాలలో రూ.48.60 లక్షల మేర అవకతవకలు జరిగాయి. 10 మంది విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నాం. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి డబ్బు రికవరీ చేస్తాం. విచారణ సాగుతోంది. ఇందులో ఎంతటి వారున్న ఉపేక్షించేది లేదు. విద్యాశాఖలో అవినీతి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
‘వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లిని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయించాం. గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని వచ్చే 3,4 ఏళ్లలో రాష్టంలోని అన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తాం. నూటికి నూరు శాతం మద్యపాన నిషేధం, ఇంటి పన్ను వసూ లు, కుటుంబ మరుగుదొడ్లు, వాటి వినియోగం, కుటుంబ నియంత్రణ (కుటుంబానికి ఇద్దరు పిల్లలు), పొదుపు బృందాలు/పథకాల్లో అవ గాహన, పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు నమోదును ఈ గ్రామపంచాయతీ సాధించింది. ఇప్పటికే 14 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించింది’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.